close

అంతర్యామి

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఎవరు జ్ఞాని?

శాస్త్ర విద్యల్లో, సాహిత్యంలో గట్టి పట్టు సాధించినవారిని పండితులుగా పేర్కొంటారు. ఏళ్ల తరబడి చేసిన కృషికి ఫలితంగా పాండిత్యం అబ్బుతుంది. అది గొప్ప విషయమే అయినా, పాండిత్యం చాలా సందర్భాల్లో అహంకారానికి కారణం అవుతుందన్నాడు భర్తృహరి. అది అసూయకు దారితీస్తుంది సుమా... అని హెచ్చరించాడు. అలాంటివారిని మత్సరపూర్ణమతులుగా అభివర్ణించాడు ఏనుగు లక్ష్మణ కవి. నిజంగా సర్వజ్ఞులైన వారికి తమ అల్పజ్ఞత తెలుస్తూనే ఉంటుంది. కొద్దిపాటి పాండిత్యానికే విరగబాటు ఎక్కువ. కాబట్టే అల్ప విద్యో మహాగర్వీ అంది శాస్త్రం. ‘అల్పుడెపుడు పల్కు ఆడంబరముగాను’ అన్నాడు యోగి వేమన. ‘కాస్త పాండిత్యం ఒంటపట్టేసరికి గర్విష్టినై మదగజంలా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించాను... దరిమిలా వివేకవంతుల సాంగత్యంలో కొద్దిగా జ్ఞానం కలిగాక, నాకేమీ తెలియదన్న విషయం అర్థం అయింది... నన్ను ఇంతవరకు ఆవరించిన గర్వం పూర్తిగా తొలగిపోయింది’ అంటూ భర్తృహరి తన నీతి శతకంలో చెప్పిన ‘తెలివి ఒకింత లేని యెడ...’ పద్యం లోకంలో బాగా ప్రసిద్ధిచెందింది. అందుకే పాండిత్యం కన్నా జ్ఞానం చాలా ఉత్తమమైనదని తేల్చారు వివేకవంతులు.

పదునాలుగు భాషల్లో పదునైన పాండిత్యం, ప్రాచీన కవుల సరసన నిలబడగల ‘శ్రీనివాస ప్రబంధం’ కావ్యసృష్టి, ఆధునిక కవులను సైతం అబ్బురపరచిన ‘శివతాండవం’ గేయ రచన- పుట్టపర్తి నారాయణాచార్యుల వారికి సరస్వతీపుత్రుడన్న సార్థక బిరుదాన్ని సంతరించి పెట్టాయి. ఆయనకు విద్యార్థి దశలో ఎదురైన అనుభవం చాలా అరుదైనది. 1938వ సంవత్సరంలో మద్రాసు విశ్వవిద్యాలయంలో విద్వాన్‌ పరీక్షకు హాజరైనప్పుడు- ఆయన తన 14వ ఏట రచించిన ‘పెనుగొండ లక్ష్మి’ కావ్యం ఆ ఏడాది పాఠ్యగ్రంథం అయింది. తన రచనపై తానే అధ్యయనం చేయవలసి రావడం ఒకానొక అసాధారణమైన విషయం. 1990లో మరణానికి ముందు ఆయన పుట్టినరోజునాడు పత్రికా ప్రతినిధి ఒకరొచ్చి ‘నేటి పండితులకు, సాహిత్య ఉపాసకులకు మీ సందేశం ఏమిటి?’ అని అడిగారు.

పుట్టపర్తి ఒకసారి నిర్వేదంగా చూసి ‘ఏముందయ్యా! నా జీవితం అహమేవ పండితః (నేనే పండితుణ్ని) అనుకొంటూ మొదలైంది. దరిమిలా అహం పండితః (నేనూ ఒక పండితుణ్నే) అని అనిపించింది. ఇంతదూరం ప్రయాణం సాగాక, గొప్ప గొప్ప సాహితీవేత్తలను కలుసుకొన్నాక- నాహం పండితః (నా దగ్గర పాండిత్యమే లేదు) అని తెలిసి వచ్చిందప్పా’ అన్నారాయన నవ్వుతూ!

వివిధ భాషల్లో ప్రావీణ్యంతోపాటు గ్రీక్‌ లాటిన్‌ ఫ్రెంచి భాషలతో మంచి పరిచయాన్ని సాధించిన పుట్టపర్తి ఈ జాతికి అందించిన సందేశం- ముఖ్యంగా రచయితలందరికీ శిరోధార్యం. తన రచనలను ఎదుటివారు పొగుడుతుంటే తనంతటి రచయిత ఎవరూ లేడనిపిస్తుంది. అది సహజం. కాని పెద్దయ్యాక తెలుస్తుందొక పచ్చినిజం. తొలిరోజుల్లోని తన రచనలను మలిదశలో తిరిగి పరిశీలించినప్పుడు ‘అయ్యో! ఇంతకన్నా బాగా రాసి ఉండవలసింది... తొందరపడి అచ్చుకు ఇచ్చేశాను’ అనుకోవడం చాలామంది గొప్ప రచయితల అనుభవం.

మరణానంతరం ఈ లోకంలో జీవించి ఉండాలంటే- జనం ఎల్లకాలం గుర్తుంచుకోదగిన మంచిపనులైనా చేసి ఉండాలి లేదా వారు మరచిపోలైని మంచి రచనలైనా అందించాలి. జీవితాంతం విద్యార్థిగా ఉండగలిగితే మంచి రచనలు సాధ్యం అవుతాయి. కనుక పాండిత్యంలోగాని, రచనా సామర్థ్యంలోగాని ‘అహమేవ’ దశ నుంచి ‘నాహం’ వరకు ప్రయాణించగలవారే గొప్పవారు. వారే జ్ఞానులు... వారే వివేకవంతులు!

- ఎర్రాప్రగడ రామకృష్ణ

మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.