
అంతర్యామి
మానవ జీవిత పరమార్థం
మనసు రెండు రకాల ధర్మాలను నిర్వర్తిస్తుంది. మొదటిది... అశాంతిని సృష్టించే ఆలోచనలకు శిక్షణ ఇచ్చి, ఉత్తమ మార్గం వైపు నడిపించే ప్రయత్నం. ఎప్పటికప్పుడు అరిషడ్వర్గాలను నియంత్రిస్తూ, జ్ఞాన వికాసం కలిగించే ఆధ్యాత్మిక అప్రమత్తతను జాగృతపరచడం రెండోది.
‘నేను’ అనే అహం నిరంతరం బుద్ధిని పక్కదారి పట్టించే ఆలోచనలకు ఆజ్యం పోస్తుంది. ఇవే మానసిక అలజడులకు మూలాలు. వీటి కారణంగానే శారీరక, మానసిక రుగ్మతలు తలెత్తుతాయి.
మనిషి పుట్టినప్పటి నుంచే శారీరక ఎదుగుదలతో పాటు, మానసిక పరిణతీ సమాంతరంగా మొదలవుతుంది. శరీర పోషణకు అన్నపానాదులు అవసరమైనట్టే, మానసిక ప్రశాంతతకు మంచి ఆలోచనలు, ఆధ్యాత్మికత ఆవశ్యకం.
శరీరం షడ్రసోపేతమైన భోజనాన్ని కోరుకున్నట్టే, మనసూ సత్ప్రవర్తనను, సదాలోచనల్ని ఆశిస్తుంది. శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎంత తాపత్రయపడతామో, మానసిక ఆరోగ్యాన్ని పరిరక్షించుకునేందుకూ అంతకంటే ఎక్కువ శ్రమించాలి. శరీర అనారోగ్యానికి వైద్యం అవసరమైతే, మానసిక అనారోగ్యాన్ని కలగజేసే ఆలోచనల్ని ఎల్లవేళలా అదుపులో ఉంచుకోవాలి.
సంతోషాన్ని మందహాసంతో, ఆవేశాన్ని కోపంతో, దు:ఖాన్ని కన్నీళ్లతోనే వ్యక్తం చెయ్యాలి. అది శరీర ధర్మం. కానీ వాటిని బుద్ధి గడప దాటి, మనసు ప్రాంగణంలోకి అనుమతిస్తే- అవి వికృత ఆనందాలకు తెరతీసి, సంతృప్తిని అసంతృప్తిగా మార్చేస్తాయి. ఆలోచనా పగ్గాల్ని బుద్ధి హస్తగతం చేసుకుంటుంది. కోరిక, స్వార్థం అనే జోడు గుర్రాల స్వారీ మొదలు పెడుతుంది.
శారీరక ఆనందాన్నిచ్చే యౌవనం, సౌందర్యం అదృశ్యమవుతాయి. సంపదలు దూరమవుతాయి. పేరు ప్రఖ్యాతులు మసకబారతాయి. సౌభ్రాతృత్వం, ప్రేమ కాలానుగుణంగా మార్పులకు లోనవుతాయి. సద్గుణాలు అంతరించిపోయాయి. అందుకే మనసును మాయలో పడకుండా కాపాడుకోవాలి. దానికి నిరంతర అప్రమత్తత ఒక్కటే మార్గం. అదే మనసును నిశ్చల స్థితికి తీసుకెళ్తుంది. అదే ధ్యానం.
‘ధ్యానానికి ప్రత్యేక సమయం, రాత్రి పగలు, నిద్ర మెలకువలతో పని లేదు. అది నిరంతర ప్రక్రియ. ఆ అప్రమత్తతకు ఫలితం శూన్యం. దానివల్ల ఏ ప్రయోజనమూ ఒనగూడదు. ప్రయోజనం ఆశిస్తే అది ‘కోరికే అవుతుంది’ అన్నారు జిడ్డు కృష్ణమూర్తి.
చెడు ఆలోచనలు మనసు మాటను పెడచెవిన పెట్టి, బుద్ధి ఆధిపత్యానికి లొంగిపోయి, పరమోన్నత సత్యానికి మానవ జన్మను దూరం చేస్తాయి. నిరంతరం తమ ఉనికిని చాటుకోవాలని తాపత్రయపడే చెడు ఆలోచనలను అంతం చేయడానికి కఠోర సాధన చేయాలి. చెడు ఆలోచనలు వ్యతిరేక ఫలితాలు కలిగిస్తే, మంచి ఆలోచనలు మంగళప్రదమైన మార్పులు తీసుకొస్తాయి. మనసు నిర్మలంగా, స్వేచ్చగా ఉండాలంటే, దాన్ని వర్తమానానికి అనుసంధానించాలి. ఇది సాధ్యమా అంటే, సాధ్యమేనంటున్నారు సాధకులు.
ఆలోచన వస్తుంది, రానివ్వండి, పట్టించుకోకండి. కొంత సమయం తరవాత ఆలోచన తనంతట తానే నిష్క్రమించి, కొత్త ఆలోచనను ప్రవేశపెడుతుంది. పట్టించుకోనంత కాలం ఏ ఆలోచనా స్థిరంగా ఉండదు. వచ్చీపోయే బాటసారిలా కొంతకాలానికి ఉనికిని కోల్పోతుంది. అదే ఆలోచనా రహిత నిశ్చలస్థితి. తాను ఏ స్థితిలో ఉన్నాడో కూడా తెలియని స్వేచ్ఛ దానంతట అదే సిద్ధిస్తుంది.
అప్పుడు ‘నేను’ అంతరించి శాశ్వతమైన అప్రమత్తత ఏర్పడుతుంది. అది ఆత్మతో మనసును మమేకం చేస్తుంది. ఇదే మానవ జీవిత పరమార్థం.
- ఎం.వెంకటేశ్వరరావు
మరిన్ని కథనాలు

- బుల్లితెర జలపాతంలో సుధీర్, రష్మి
- మూఢ విశ్వాసంతో కన్నబిడ్డలనే కడతేర్చే యత్నం
- ‘ప్రియుడి ఒత్తిడితోనే కుమార్తె ఆత్మహత్య’
- ఇజ్రాయెల్.. అందుకో టీకా ఫలం!
- మార్కెట్లలో జోష్ నింపిన కేంద్రం నిర్ణయం
- పదేళ్లకే నాకు పెళ్లి చేశారు: నటి కృష్ణవేణి
- సెకండ్ వేవ్.. చిత్రసీమపై కరోనా ప్రతాపం
- ఐపీఎల్ నుంచి స్టోక్స్ ఔట్
- రోహిత్ నమ్మాడు.. రాహులే వికెట్లు తీశాడు
- గుట్టలుగా మృతదేహాలు.. ఖాళీలేని శ్మశానాలు!