
జాతీయ- అంతర్జాతీయ
దిల్లీ: ఈ ఏడాది వేసవి కాలంలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో మార్చి-మే మధ్య ఎండలు ఎలా ఉండబోతున్నాయన్న అంచనాను సోమవారం ఆ సంస్థ వెల్లడించింది. ఉత్తర, ఈశాన్య ప్రాంతాల్లో పగటి పూట భానుడి ప్రతాపం అధికంగా ఉంటుందని పేర్కొంది. దక్షిణ, మధ్య భారత్‌లో మాత్రం ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తక్కువగానే ఉండొచ్చని పేర్కొంది. అయితే... తూర్పు, పశ్చిమ ప్రాంతాలతో పాటు, సముద్ర తీరాల వద్ద అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్, గోవా, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా తీర ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని ఐఎండీ అంచనా వేసింది. ఉత్తర భారతంలో రాత్రి పూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగానే ఉండొచ్చని పేర్కొంది. ఏప్రిల్-జూన్‌కి సంబంధించిన వేసవి అంచనాలను ఏప్రిల్‌లో విడుదల చేస్తామని ఐఎండీ తెలిపింది.