
క్రైమ్
నలుగురికి గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం
రాయచోటి, న్యూస్టుడే: కడప జిల్లా రాయచోటి మండలం పెమ్మాడపల్లి పంచాయతీ ఎన్నికల్లో తెదేపా మద్దతుదారుడికి ఓటు వేశారంటూ అదే గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన వారిపై వైకాపా కార్యకర్తలు సోమవారం రాత్రి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో పాలకుంట గంగులయ్య, పి.నరసమ్మ, ఆంజనేయులు, బి.రామసుబ్బమ్మలు తీవ్రంగా గాయపడ్డారు. వీరాంజనేయులుకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే వారిని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో రామసుబ్బమ్మ, ఆంజనేయులు పరిస్థితి విషమంగా ఉండడంతో కడప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎన్నికలు పూర్తయినప్పటి నుంచి అభ్యర్థి ప్రతాపరెడ్డి తనకు ఓట్లు వేయలేదని బెదిరించి అనుచరులతో కర్రలతో దాడి చేయించారని క్షతగాత్రులు వాపోయారు. ఇరువర్గాలిచ్చిన ఫిర్యాదు మేరకు వేర్వేరుగా కేసులు నమోదు చేశామని పట్టణ సీఐ జి.రాజు పేర్కొన్నారు. గ్రామంలో ముందు రోజు పోలీసు హెచ్చరికలు కూడా జారీ చేశామన్నారు.