
క్రైమ్
కార్లు గెలుచుకున్నారంటూ రూ.2 కోట్లు స్వాహా
పదిమందిని అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు
ఈనాడు, హైదరాబాద్ - న్యూస్‌టుడే, రాయదుర్గం: తెలుగువారిని టెలీకాలర్లుగా నియమించుకుని ఒడిశా, బిహార్‌ల నుంచి సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాగుట్టును సైబరాబాద్ పోలీసులు రట్టుచేశారు. పదిమంది నిందితులను అరెస్టు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసిన సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కొద్దిరోజులుగా పరిశోధించి రాంచీలో కాల్‌సెంటర్ నిర్వహిస్తున్న తరుణ్‌కుమార్‌ను, మరో పదిమందిని అరెస్ట్ చేశారు. వీరిలో ఐదుగురు మంచిర్యాల జిల్లాకు చెందినవారే.. ఆరునెలల్లో వీరు రూ.2 కోట్లు స్వాహా చేశారని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సోమవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. తెలుగు, కన్నడ, తమిళం వంటి ప్రాంతీయ భాషల్లో మాట్లాడుతూ సైబర్ మోసాలకు పాల్పడటం ఇదే తొలిసారని వివరించారు.
అంతర్జాలం వేదికగా అమ్మకాలు కొనసాగించే ఒక సంస్థలో పనిచేసి మానేసిన తరుణ్‌కుమార్, ప్రభాకర్‌లు అక్రమాలకు సిద్ధపడి ఒడిశాలోని రూర్కేలా, ఝార్ఖండ్‌లోని రాంచీలో కాల్‌సెంటర్లు ప్రారంభించారు. టెలీకాలర్లుగా తెలుగువారు కావాలని వారు వెతుకుతుండగా బెల్లంపల్లి వాసి కమలేష్ దూబే కలిశాడు. రూ.25 వేల జీతం, ఉచిత వసతి అని చెప్పి ఆయన మంచిర్యాల ప్రాంతం నుంచి తన స్నేహితుడు రమేశ్‌ను, మరో అయిదుగురిని గతేడాది ఆగస్టులో రాంచీకి రప్పించుకున్నారు. బాధితుల నుంచి రూ.5 లక్షలు వస్తే.. పదిశాతం బోనస్ ఇస్తామని చెప్పారు. కన్నడ, తమిళం, హిందీ భాషలు తెలిసిన మరికొందరినీ టెలీకాలర్లుగా నియమించుకున్నారు.
ఇదీ మోసగించే విధానం
ముందుగా మీకు బహుమతి వచ్చిందంటూ ఒక కంపెనీ పేరుతో లేఖ, హెచ్ఎస్బీసీ బ్యాంక్ ముద్రతో పాటు ఒక స్క్రాచ్కార్డును పంపుతున్నారు. ఆ కార్డును గీకగానే.. ‘‘మీరు టాటా సఫారీ కారు గెల్చుకున్నారు. ఫలానా నంబర్లను సంప్రదించండి’’ అని ఉంటోంది. సంప్రదించిన వారితో తెలుగువారైన వెంకటేష్, రాకేశ్, ప్రశాంత్, రాజేందర్, రాజలింగులు మాట్లాడేవారు. కొవిడ్ కారణంగా కారుకు బదులు రూ.14.5 లక్షలు ఇస్తామని చెప్పేవారు. ఇందుకోసం తొలుత 15 వేలు రిజిస్ట్రేషన్ రుసుం, 5 శాతం వాహన పన్ను, 12 శాతం జీఎస్టీ, 15 శాతం ధరావతు సొమ్ము చెల్లించాలని చెప్పేవారు. ధరావతు సొమ్మను తిరిగి ఇస్తామని నమ్మబలికారు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో వేలమందిని మోసం చేశారు. వసూలు చేసిన సొమ్మును 53 బినామీ ఖాతాల్లో వేసుకున్నారు. మంచిర్యాల నుంచి మిత్రులను తీసుకెళ్లిన రమేష్ అక్కడ ఆత్మహత్య చేసుకున్నాడని సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. వాటాల విషయంలోనా? కుటుంబ సమస్యలా? అన్న కోణంలో పరిశోధిస్తున్నామని కమిషనర్ సజ్జనార్ తెలిపారు.