భారతీయ వైద్యులతో సమానమేనా?
విదేశీ వైద్యవిద్యకు సంబంధించి విద్యార్థుల్లో, వారి తల్లిదండ్రుల్లో కొన్ని సందేహాలూ, అపోహలూ ఉంటున్నాయి. వాటి నిజానిజాలు చూద్దాం.

* విదేశాల్లో వైద్యవిద్య చదవటానికి ఏ అర్హతలు ఉండాలి? ఎంసీఐ పేర్కొన్న వయసు, మార్కుల నిబంధనలను విద్యార్థులు తప్పకుండా పాటించాలి. 1) ఈ ఏడాది విదేశీ వైద్యవిద్యలో చేరాలనుకునే విద్యార్థికి ఈ డిసెంబర్ 31 నాటికి 17 సంవత్సరాలు పూర్తికావాలి. 2) జీవశాస్త్రంలో ఇంటర్మీడియట్/ తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులైనవారు మాత్రమే అర్హులు. అందులో 50%కు తక్కువ కాకుండా మార్కులను సాధించాలి. ఎస్సీ, ఎస్టీ/ వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులు 40% తెచ్చుకుంటే సరిపోతుంది. జీవశాస్త్ర, రసాయన, భౌతికశాస్త్రాల్లో వచ్చిన మార్కులను మాత్రమే పరిగణిస్తారు. ఆంగ్ల బోధనాంశం తప్పనిసరి.
*కళాశాలలో చేరేముందు ఎంసీఐ అనుమతి అవసరమా? అవసరమే. ఎంసీఐ వెబ్సైట్లో ఉన్న ఎలిజిబిలిటీ దరఖాస్తును డౌన్లోడ్ చేసుకోవాలి. దాన్ని పూర్తిచేసి, యూనివర్సిటీ నుంచి వచ్చిన అడ్మిషన్ లెటర్నూ, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత మార్కుల జాబితానూ జతచేసి పంపాలి. దరఖాస్తు ప్రాసెస్ చేయడానికి ఏమైనా చెల్లింపులుంటే ఆ మొత్తాన్ని చెల్లించాలి.
* విదేశాల్లో మెడిసిన్ చదవాలంటే ఏయే పత్రాలు కావాలి? స్టడీ సర్టిఫికెట్లు, పదో తరగతి, ఇంటర్ మార్కుల జాబితాలు. కొన్ని కళాశాలలు బోనఫైడ్, పుట్టిన తేదీ ధ్రువపత్రాలు కూడా అడుగుతాయి.
* విజిటింగ్ వీసా మీద విదేశీ వైద్యకళాశాలలో చేరవచ్చా? చదువుకోవడానికి వెళుతున్నందువల్ల విజిటింగ్ వీసా అని కాకుండా స్టూడెంట్ వీసా మాత్రమే ఉండాలి. అయితే కొన్ని దేశాలు విజిటింగ్ వీసా మీద కూడా విద్యాభ్యాసానికి అనుమతిస్తున్నాయి.
*విదేశాల్లో ఇచ్చే ఎంబీబీఎస్ డిగ్రీకీ, మనదేశంలో ఇచ్చే ఎంబీబీఎస్ డిగ్రీకీ ఏమైనా తేడా ఉందా? మనదేశంలో ఎంబీబీఎస్ ఉత్తీర్ణులయ్యాక విద్యార్థులు తాము చదివిన వైద్య కళాశాలలోనే ఇంటర్న్షిప్ పూర్తిచేస్తారు. విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తిచేసిన తర్వాత మనదేశంలోనే ఇంటర్న్షిప్ చేయాల్సివుంటుంది. అందుకు స్క్రీనింగ్ టెస్టులో నెగ్గాల్సివుంటుంది. ఇదొక్కటే తేడా. ఈ స్క్రీనింగ్ టెస్టులో ఉత్తీర్ణులై, హౌస్ సర్జన్సీ ఏడాది పూర్తయిన తర్వాత ఆ డాక్టరు భారతీయ డాక్టరుతో సమానమవుతారు.
* ఐదేళ్ళ కోర్సు అనీ, ఆరేళ్ళ కోర్సు అనీ... ఎంబీబీఎస్ ఇన్ని సంవత్సరాల్లో పూర్తిచేయాలనే నిబంధన ఉందా? అటువంటిదేమీ లేదు. స్థానిక ప్రభుత్వ గుర్తింపు, డబ్ల్యూహెచ్ఓలో నమోదు, భారతీయ ఎంబసీ అనుమతించిన కళాశాలల్లో వైద్యవిద్యను అభ్యసిస్తే అక్కడ కోర్సు వ్యవధికాలంతో పని లేదు.
* విదేశాల్లో ప్రైవేటు వైద్యకళాశాలలకూ, ప్రభుత్వ వైద్య కళాశాలలకూ గుర్తింపులో కానీ, నాణ్యతలో కానీ తేడా ఏమైనా ఉందా? దాదాపు అన్ని దేశాల్లోనూ వైద్య కళాశాలల నిర్వహణ బాధ్యతను ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వశాఖ పర్యవేక్షిస్తోంది. నాణ్యతా ప్రమాణాలూ, మౌలిక వసతులూ, అనుభవజ్ఞులైన బోధనా సిబ్బందీ కేవలం ప్రభుత్వ రంగంలో నడిచే వైద్యకళాశాలల్లోనే ఉంటాయనుకోవడం అపోహే. ఎన్నో దేశాల్లో ప్రైవేటురంగంలోనే విద్యావ్యవస్థ నడుస్తోంది. ఉదా: నేపాల్, ఫిలిప్సీన్స్. చైనాలో, సీఐఎస్ (ఒకప్పటి సోవియట్ రష్యా ప్రాంత) దేశాల్లో చాలామట్టుకు ప్రభుత్వ కళాశాలలే ఉంటాయి. ఉదా: ఉక్రెయిన్, బెలారస్ లాంటివి. మరికొన్ని దేశాల్లో రెండు రంగాల్లోనూ వైద్యకళాశాలలుంటాయి. ఉదా: భారత్, కిర్గిస్థాన్ మొదలైనవి.
* ఎంబీబీఎస్ కళాశాలలో పీజీ ఉంటేనే యూజీకి గుర్తింపు ఉంటుందా? అది అపోహ మాత్రమే. ఈ రెండూ వేర్వేరు కోర్సులు. దీనికీ, దానికీ సంబంధం లేదు.
* స్క్రీనింగ్ టెస్టు చాలా కష్టమనీ, ఉత్తీర్ణత శాతం బాగా తక్కువనీ విన్నాం. నిజమేనా? కొంతవరకూ వాస్తవమే! కానీ ఏ విద్యార్థీ ఏ పరీక్షకూ భయపడకూడదు. ప్రత్యేక తర్ఫీదు, క్యాంపస్లో తగిన శిక్షణ ఉంటే ఎంసీఐ స్క్రీనింగ్ టెస్టు ఉత్తీర్ణత పెద్ద కష్టం కాదు.. కోర్సు పూర్తిచేసుకుని, ఈ పరీక్షను తొలిసారే ఉత్తీర్ణత సాధించినవారు చాలామందే ఉంటున్నారు.
* వైద్యకళాశాలలకు సంబంధించి ఏదైనా సమాచారం భారతీయ ఎంబసీ వెబ్సైట్లలో లభిస్తుందా? లభించే అవకాశం ఉంది. ఆయా దేశాల్లో ఆ కళాశాలల పట్ల స్థానిక ప్రభుత్వం ఏదైనా వ్యతిరేక నిర్ణయం తీసుకుంటే ఆ సమాచారాన్ని ఎంబసీ వారు తమ సైట్లలో తెలుపుతారు. ఏవైనా హెచ్చరికలు ఉంటే అవి కూడా అవే సైట్లలో పొందుపరుస్తారు.
|