
తాజా వార్తలు
వేధింపులు ఎదురైనప్పుడు ఏ డ్రెస్‌లో ఉన్నారు?
గాయని సోనా మొహాపాత్ర
ముంబయి: ‘నా శరీరం.. నా దుస్తులు.. నా ఇష్టం’ అంటూÙ తనను ట్రోల్ చేసిన నెటిజన్లకు ఘాటుగా జవాబిచ్చారు ప్రముఖ గాయని సోనా మొహాపాత్ర. కాలేజీలో చదువుతున్న రోజుల్లో తను ఈవ్ టీజింగ్‌కు, వేధింపులకు గురయ్యానని తాజాగా ఆమె ట్విటర్ వేదికగా తెలిపారు. ‘నా బీటెక్ సమయంలో వదులుగా ఉన్న కుర్తా వేసుకుని మైక్రోప్రాసెసర్ ల్యాబ్ వైపుగా వెళ్తుంటే నా సీనియర్లు ఏడిపించారు. విజిల్స్ వేస్తూ.. నా శరీరం గురించి అసభ్యంగా మాట్లాడారు. ఆపై నా మంచి కోరిన ఓ వ్యక్తి (వెటకారంగా) ‘ఎందుకు చున్నీ సరిగ్గా వేసుకోలేదు?, పూర్తిగా కవర్ చెయ్’ అన్నారు’ అని ట్వీట్ చేశారు.
‘మీటూ’లో భాగంగా.. ఇలాంటి సంఘటనలు ఎదుర్కొన్న మహిళలు తమ చేదు అనుభవాలను తెలపాలని కోరారు. సోనమ్ కపూర్‌తోపాటు చిన్మయిని ట్యాగ్ చేశారు. ‘మీరు లైంగిక వేధింపులు లేదా బెదిరింపులు ఎదుర్కొన్నప్పుడు ఏ దుస్తులు ధరించారో గుర్తు చేసుకోండి. బాధితుల్ని తప్పుపట్టే విషయంపై దృష్టిపెడుదాం’ అని మహిళలకు పిలుపునిచ్చారు.
నా శరీరం.. నా ఇష్టం..!
దీంతో కొందరు నెటిజన్లు సోనాను ట్రోల్ చేశారు. ‘పబ్లిసిటీ కోసం ఆరాటపడుతున్నావు, జాలి పొందడానికి ఇలా చేస్తున్నావు, నిజంగా నీకు అంత బాధ ఉంటే ఎందుకు హాట్ ఫొటోషూట్లు చేస్తావు?, ఇలాంటి డ్రామాలు చేయడం కన్నా నీకు సరిపోయే సింగింగ్‌పై ఇంకా ఎక్కువ దృష్టిపెట్టు, నీ ఫొటోలన్నీ అభ్యంతరకరంగానే ఉంటాయి..’ అని రకరకాల కామెంట్లు చేశారు. వీరికి సోనా ఘాటుగా రిప్లై ఇచ్చారు. ‘నా శరీరం,.. నాకు నచ్చినట్లు ఉంటా’ అని అన్నారు.
మరోపక్క సోనా పిలుపు మేరకు చిన్మయి స్పందించారు. ‘వేధింపులు ఎదురైన రోజు నేను ఫుల్ స్లీవ్ సల్వార్ కమీజ్, దుప్పట్టా వేసుకుని, నా జుట్టును కట్టేసి ఉన్నా. ఆరుసార్లు జాతీయ అవార్డు గెలుచుకుని, పద్మ అవార్డు కూడా అందుకున్న వైరముత్తు అనే వ్యక్తి ఎంతో పెద్దవాడని, గౌరవనీయులని, నాకు తండ్రిలాంటి వాడని నమ్మాను..’ అని పేర్కొన్నారు. ‘మీటూ’ ఉద్యమం సమయంలో చిన్మయి ప్రముఖ సాహిత్య రచయిత వైరముత్తుపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఆమె ఆయనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు.