Amitabh bachchan: వయసు పెరిగినా.. నటనలో తగ్గేదేలే..! - amithab bachan birth day special
close
Published : 11/10/2021 10:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Amitabh bachchan: వయసు పెరిగినా.. నటనలో తగ్గేదేలే..!

సముద్రంలోని కెరటాల్లాగే జీవితంలో కిందపడటం, పైకి లేవడం అనేది సహజం. వాస్తవ జీవితంలో పడిపోయిన ప్రతి ఒక్కరూ తిరిగి లేవాల్సిందే. అయితే ఎంత బలంగా నిలదొక్కున్నామనేదే చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది. అమితాబ్‌ కూడా కింద పడ్డారు. ఒకటి, రెండు సార్లు కాదు చాలా సార్లు. కోలుకోలేనంతగా దెబ్బతిన్నారు. ఇక అమితాబ్‌ పనైపోయిందన్న ప్రతిసారీ గట్టి సమాధానమిచ్చారు. ‘షహేన్‌ షా’ స్టార్‌డమ్‌కి కాలం చెల్లిందనే విమర్శలను 60 ఏళ్లు దాటిన తర్వాత కూడా తిప్పికొట్టారు. అమితాబ్‌కి ఉన్న అంకితభావం, పట్టుదల అలాంటిది. ఇవాళ  బిగ్‌బీ పుట్టిన రోజు. ఈ సందర్భంగా 60 ఏళ్లు దాటాక ఆయన చేసిన గొప్ప పాత్రలు, సినిమాలేంటో చూద్దాం.. 


బ్లాక్‌

అమితాబ్‌ కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిపోయే సినిమా ‘బ్లాక్‌’. సంజయ్‌లీలా భన్సాలీ దర్శకుడు. పుట్టకతోనే కళ్లు, చెవులు పనిచేయని అమ్మాయికి పాఠాలు చెప్పే గురువుగా అమితాబ్‌ అద్భుతంగా నటించారు. దివ్యాంగురాలి పాత్రను రాణీముఖర్జీ పోషించారు. చివర్లో అల్జీమర్స్‌ వ్యాధితో బాధపడే వృద్ధుడిగా బిగ్‌బీ నటన ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తుంది. కథ నచ్చి ఒక్క రూపాయి పారితోషికం తీసుకోకుండా నటించారాయన. 2005లో వచ్చిన ఈ సినిమా పలు అవార్డులు గెలుచుకుంది.  


 సర్కార్‌

ఆర్జీవీ తీసిన పొలిటికల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘సర్కార్’‌. మహారాష్ట్ర రాజకీయాల చుట్టూ అల్లుకున్న ఈ కథ బాక్సాఫీసు వద్ద భారీ విజయం సాధించింది. సర్కార్‌గా అమితాబ్‌ అద్భుతంగా నటించారు. ఈ సినిమాలో బిగ్‌బీ నటనను విమర్శకులు గాడ్‌ఫాదర్‌తో పోల్చారు. అభిషేక్‌ బచ్చన్‌ ఈ సినిమాలో అమితాబ్‌ కుమారుడిగా నటించారు. ఆయనకీ మంచి ప్రశంసలు దక్కాయి. కళ్లు, సైగలతోనే అమితాబ్‌ బచ్చన్‌ సర్కార్‌గా అదరగొట్టారు.


పా

హీరోగా ఎన్నో కమర్షియల్‌ హిట్లిచ్చిన ఇండియన్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌.. వయసైపోయాక కూడా విశ్రాంతి తీసుకోలేదు. మరింత కొత్తగా ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశారు. బిగ్‌బీ చేసిన అలాంటి గొప్ప ప్రయత్నమే ‘పా’. ఇందులో వింత వ్యాధితో బాధపడే 12 ఏళ్ల బాలుడిగా ఆయన అదరగొట్టారు. ఆ పాత్రను పోషించినందుకు గానూ ఆయన్ను జాతీయ పురస్కారం వరించింది. బిగ్‌బీకి తండ్రిగా అభిషేక్‌ బచ్చన్‌ నటించడం విశేషం. 


షమితాబ్

దక్షిణాది స్టార్‌ హీరో ధనుష్‌తో అమితాబ్‌ చేసిన సినిమా ‘షమితాబ్’‌. బిగ్‌బీ వాయిస్‌ ఎంత శక్తిమంతంగా ఉంటుందో తెలిసిందే. ఆయన గొంతే ప్రధానంగా ఈ సినిమా నడుస్తుంది. ఈ చిత్రంలో ధనుష్‌కు మాటలు రావు గానీ హీరోగా వెలిగిపోవాలనే ఆశ. సరికొత్త సాంకేతికతతో ధనుష్‌కు బదులుగా అమితాబ్‌ మాట్లాడుతుంటారు. ధనుష్‌ నటనకు అమితాబ్‌ గాత్రం తోడై సూపర్‌స్టార్‌గా వెలిగిపోతాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తి సినిమా పలు మలుపులు తిరుగుతుంది. ఇందులో అమితాబ్‌ వైవిధ్యమైన నటనను చూసి తీరాల్సిందే. 


బుడ్డా హోగా తేరా బాప్‌

పూరి జగన్నాథ్‌ తొలిసారి బాలీవుడ్‌లో తీసిన సినిమా ‘బుడ్డా హోగా తేరా బాప్’‌. ఇందులో అమితాబ్‌ పాత్ర ఇది వరకు చూడని రీతిలో సరికొత్తగా ఉంటుంది. పూరి మార్క్‌ డైలాగ్స్‌కి అమితాబ్‌ నటన తోడై సరికొత్త అనుభూతిని అందించారు. బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించిందీ సినిమా.


‘పీకూ’

70 ఏళ్ల వయసులో వృద్ధాప్య సమస్యలతో బాధపడే వ్యక్తిగా అమితాబ్‌ ‘పీకూ’లో అదరగొట్టారు. ఇందులో దీపికా తండ్రి పాత్రలో నటించారు. ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు భావోద్వేగానికి గురిచేస్తాయి. దివంగత నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ టాక్సీ డ్రైవర్‌గా చేశారు. మంచి ఫీల్‌ గుడ్‌ మూవీలా సాగే ఈ సినిమా పతాక సన్నివేశాల్లో మాత్రం కంటతడి పెట్టిస్తుంది. సున్నితమైన హాస్య సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అమితాబ్‌ నటనను మెచ్చుకోకుండా ఉండలేం. 


పింక్‌

ఈ మధ్య కాలంలో బాగా గుర్తుండిపోయే పాత్ర ‘పింక్‌’ సినిమాలో దక్కింది. ముగ్గురు అమ్మాయిల తరఫున వాదించే న్యాయవాదిగా అదిరిపోయే పర్ఫార్మెన్స్‌ ఇచ్చారాయన. తాప్సీ ప్రధాన పాత్రలో నటించింది. ‘పీకూ’ సినిమాను తెరకెక్కించిన సుజిత్‌ సర్కార్‌ దీనికీ దర్శకత్వం వహించారు. ఇందులో మహిళలపై జరిగే దాడులు, వివక్షపై అమితాబ్‌ డైలాగ్స్‌ అమితంగా ఆకట్టుకున్నాయి. దీన్నే తమిళంలో అజిత్‌, తెలుగులో పవన్‌కల్యాణ్‌ రీమేక్‌ చేశారు.


ఇవన్నీ అమితాబ్‌ చేసిన వాటిలో కొన్ని మాత్రమే. ఇంకా అనేక అద్భుతమైన పాత్రల్లో నటించారు. వయసైపోయాక అందరిలా విశ్రాంతి తీసుకోకుండా.. నటనే శ్వాసగా జీవిస్తున్నారు. నిత్యనూతనంగా తెరపై కనిపించే ప్రయత్నం చేస్తున్నారు. 80 ఏళ్ల వయసుకు దగ్గరపడుతున్నా విరామెరగకుండా పనిచేస్తున్నారు. నటనంటే ఆయనకున్న మక్కువ అలాంటిది. వయసుకు తగిన పాత్రలు చేస్తూ తనదైన ప్రత్యేక దారిలో దూసుకెళ్తున్నారు. అందుకే ఇండియన్‌ సూపర్‌స్టార్‌గా శిఖరస్థాయిన నిలబడ్డారు. ఆయన జీవితం నటులకే కాదు, సామాన్యులకు కూడా గొప్ప పాఠం. మరిన్ని మంచి పాత్రలు చేయాలని కోరుతూ.. మరొక్కసారి ఇండియన్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని