Akhil: రొమాంటిక్‌ సీన్స్‌లో నటించడమంటే ఇబ్బందే
close
Updated : 15/10/2021 04:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Akhil: రొమాంటిక్‌ సీన్స్‌లో నటించడమంటే ఇబ్బందే

‘‘కమర్షియల్‌ ఫార్ములా నుంచి బయటకొచ్చి నిజాయితీగా చేసిన చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. ఇందులో ఓ మంచి సందేశం ఉంద’’న్నారు అఖిల్‌ అక్కినేని. ఆయన హీరోగా నటించిన ఈ సినిమాని బొమ్మరిల్లు భాస్కర్‌ తెరకెక్కించారు. బన్నీవాసు, వాసు వర్మ సంయుక్తంగా నిర్మించారు. పూజా హెగ్డే కథానాయిక. ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు అఖిల్‌. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..

‘‘కథను నమ్మి నిజాయితీగా చేసిన చిత్రమిది. నిజానికి అల్లు అరవింద్‌ సర్‌ ఓ లవ్‌స్టోరీ చేయాలని చెప్పినప్పుడు.. ‘అబ్బా! ఇంకో ప్రేమకథా’ అనుకున్నా. ప్రేమ కథంటే గొప్పగా ఏముంటుంది? రొటీనే కదా అనుకుంటూనే ఆయన ఆఫీస్‌కు వెళ్లా. కానీ, బొమ్మరిల్లు భాస్కర్‌ కథ వినిపించాక.. భలే కొత్తగా ఉంది కదా అనిపించింది. ప్రేమ, పెళ్లి విషయాల్లో మనం ఎదుర్కొనే సమస్యలు, వాటికి పరిష్కార మార్గాల గురించి ఆయన చెప్పిన తీరు నన్ను ఆకట్టుకుంది. రొమాన్స్‌ అంటే ఒకర్నొకరు తాకడమొక్కటే కాదని ఈ సినిమాతో చెప్పబోతున్నాం’’.

నేను కాదు.. నా పాత్రే కనిపించేలా..

‘‘ఏ చిత్రానికైనా ముగింపే ముఖ్యమైంది. ఇందులోనూ ఓ మంచి ముగింపుంది. ఇలాంటి విషయాల్లో భాస్కర్‌ ఎప్పుడూ పక్కాగా ఉంటారు. కథ వినేటప్పుడు కానీ, సినిమా చేసేటప్పుడు కానీ.. ఎప్పుడూ కెరీర్‌ పరంగా భాస్కర్‌కి గ్యాప్‌ ఉందనే విషయాన్నే పట్టించుకోలేదు. ఈ చిత్రం చేస్తున్నప్పుడు తెరపై నేను కాదు.. నా పాత్ర మాత్రమే కనిపించాలన్న లక్ష్యంతో చేశా. ఇందులో నేను హర్ష అనే పాత్రలో కనిపిస్తా. ఓ దశలో అల్లరి కుర్రాడిగా.. కొన్ని సన్నివేశాల్లో పరిణతి ఉన్న వ్యక్తిగా దర్శనమిస్తా. ఓ బాయ్‌ నుంచి మ్యాన్‌గా మారే క్రమంలో ఏం నేర్చుకున్నాననేది ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమాలో స్టాండప్‌ కమెడియన్‌గా విభావరి పాత్రలో పూజా హెగ్డే నటన అందరినీ అలరిస్తుంది’’.

ఫలితం గురించి ఆలోచించను..

‘‘ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరూ ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోతారు. ‘సిసింద్రీ’ తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు ఆమని గారితో నటించడం చాలా సంతోషాన్నిచ్చింది. సెట్స్‌లో ఆమె నన్ను సొంత కొడుకులా చూసుకునేవారు. ఈ సినిమాలో ‘పెళ్లి చూపులు’ కాన్సెప్ట్‌ అందరికీ బాగా కనెక్ట్‌ అవుతుంది. కుటుంబంతో కలిసి హాయిగా చూడొచ్చు. నేనెప్పుడూ సినిమా ఫలితం గురించి ఆలోచించను. మంచి ఫలితం అందుకోవడం నా వంతు కృషి చేస్తా. వ్యక్తిగతంగా నేను రొమాంటిక్‌  సీన్స్‌లో నటించేందుకు ఇబ్బంది పడతా. నేను తెలుగు వాణ్ని. ఇక్కడే ఉండాలనుకుంటున్నా. బాలీవుడ్‌, హాలీవుడ్‌కి వెళ్లాలన్న ఆసక్తిలేదు’’.


‘‘సినిమాల పరంగా వేగం పెంచాలనుకుంటున్నా. ప్రస్తుతం ‘ఏజెంట్‌’ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. అయితే అది ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాదు. ప్రస్తుతం విడుదలకు చాలా చిత్రాలు సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి సంక్రాంతికి వస్తుందా? లేదా వేసవికి విడుదలవుతుందా? అన్నది స్పష్టంగా తెలీదు’’.


 Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని