‘గమ్యం’.. అంత నమ్మకంగా ఉన్నా: నరేష్‌ - naresh about naandi interview
close
Updated : 17/02/2021 19:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘గమ్యం’.. అంత నమ్మకంగా ఉన్నా: నరేష్‌

ఏ పాత్రకైనా సిద్ధం.. కాకపోతే ఒక కండిషన్‌

హైదరాబాద్‌: ‘అల్లరి’తో వెండితెరకు పరిచయమై.. కామెడీ కథా చిత్రాలతో ప్రేక్షకులకు కితకితలు పెట్టారు కథానాయకుడు నరేష్‌. ‘గమ్యం’, ‘మహర్షి’ లాంటి విభిన్న కథా చిత్రాల తర్వాత అదే తరహా సీరియస్‌ కథాంశంతో ఆయన నటించిన సినిమా ‘నాంది’. విజయ్‌ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నరేష్‌ తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులోని కొన్ని విశేషాలు..

అలా ‘నాంది’ పడింది..

‘‘అల్లరి’తో నా కెరీర్‌ ప్రారంభమైంది. అప్పటి నుంచి కామెడీ సినిమాలపైనే ఫోకస్‌ చేశాను. అలా నా నుంచి ఎన్నో హాస్యప్రధాన చిత్రాలు వచ్చాయి. దర్శక, నిర్మాతలు కూడా అదే తరహా కథా చిత్రాలతోనే నా వద్దకు వచ్చేవారు. అలాంటి సమయంలో ఓసారి విజయ్‌ కనకమేడల ‘నాంది’ కథతో నా దగ్గరకు వచ్చారు. ఈ కథకు నేను న్యాయం చేయగలనని నిర్మాతలు కూడా విశ్వసించారు. దాంతో ఈ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కింది.’’

నిరాశకు గురయ్యా..

‘‘బంగారు బుల్లోడు’ రిలీజ్‌పై నేను సానుకూలంగా లేననే చెప్పాలి. 2018లోనే ఆ సినిమా పట్టాలెక్కినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న ఆ సినిమా ఇటీవల విడుదలయ్యింది. మంచి టాక్‌ను సొంతం చేసుకోలేకపోవడం కొంచెం నిరాశకు గురిచేసింది.’’

ఎంపిక మారింది..

‘‘స్ర్కిప్ట్‌ల ఎంపిక విషయంలో నా ఆలోచనా విధానం కొంతమేర మారింది. ‘నాంది’ సినిమా పట్టాలెక్కినప్పుడే.. ఇది సీరియస్‌ ఫిల్మ్‌ అని అందరికీ చెప్పాలని నిర్ణయించుకున్నాం. అదే విధంగా పోస్టర్లు, టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాం. ఈ సినిమా మంచి రెస్పాన్స్‌ సొంతం చేసుకుంటుందని నమ్ముతున్నాను.’’

శారీరకంగా కష్టపడ్డా..

‘‘‘లడ్డూబాబు’కు మేకప్‌ విషయంలో ఎంతో కష్టపడ్డా. దాదాపు ఐదు గంటలు మేకప్‌ కోసమే కేటాయించాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు ‘నాంది’ కోసం శారీరకంగా కష్టపడ్డాను. నేను తలకిందులుగా వేలాడుతున్నట్లు ఉన్న ఓ పోస్టర్‌ చూశారు కదా.. ఆ సీన్‌ షూట్‌ చేయడానికి ఆరు గంటలు పట్టింది.’’

గూగుల్‌ చేస్తారు..

‘‘మా సినిమాలో చట్టాల గురించి చూపించాం. ముఖ్యంగా ఓ సెక్షన్‌ గురించి చెప్పాం. కథ విన్నా తర్వాత ఆ సెక్షన్‌ గురించి గూగుల్‌ చేసి తెలుసుకున్నా. మా సినిమా విడుదలయ్యాక చాలామంది కూడా నాలాగే గూగుల్‌ చేసి ఆ సెక్షన్‌ గురించి తెలుసుకుంటారని అనుకుంటున్నా.’’

ఆమె నటన అద్భుతం..

‘‘వరలక్ష్మిని లేడీ విజయ్‌ సేతుపతి అని పిలుస్తుంటాను. ఒక హీరో కుమార్తెగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఆ అమ్మాయి.. కేవలం హీరోయిన్‌ పాత్రలు మాత్రమే చేస్తాననకుండా అన్నిరకాల పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇది నిజంగానే మెచ్చుకోవాల్సిన విషయం. ఆమె చాలా అద్భుతంగా నటిస్తుంది. ’’

ఆ నమ్మకం ఉంది..

‘‘కోలీవుడ్‌, బాలీవుడ్‌ల్లో ‘నాంది’ని రీమేక్‌ చేయడానికి కొంతమంది అడుగుతున్నారు. బాలీవుడ్‌లో రీమేక్‌ చేసే అవకాశాలున్నాయి. ‘గమ్యం’ సినిమాకు ఎంత నమ్మకంగా ఉన్నానో.. ‘నాంది’కి కూడా అంతే నమ్మకంగా ఉన్నాను. ఎందుకంటే మా టీమ్‌ అంత చక్కగా కుదిరింది.’’

సక్సెస్‌ మీట్‌కు వస్తారు..

‘‘సాధారణంగా నా సినిమా ప్రీరిలీజ్‌ వేడుకల్లో టాలీవుడ్‌కు చెందిన యువ హీరోలందరూ సందడి చేసేవాళ్లు. కరోనా అనంతరం ఇటీవల షూట్స్‌ ప్రారంభం కావడంతో అందరూ వివిధ ప్రాంతాల్లో చిత్రీకరణలతో బిజీగా ఉన్నారు. అదీకాక కరోనా భయం కూడా ఉంది కదా. అందుకే ‘నాంది’ ప్రీరిలీజ్‌కు ఎవరూ రాలేకపోయారు. సక్సెస్‌మీట్‌కు అందర్నీ తప్పకుండా పిలుస్తా.’’

ఒక్క హిట్‌ చాలు..

‘‘ నా కెరీర్‌ ఆరంభం నుంచి హిట్‌, ఫ్లాప్‌లను చవిచూశాను. ‘సుడిగాడు’ తర్వాత కొన్ని ఫ్లాప్‌లు వచ్చాయి. కాబట్టి, ఏడాదికి నాలుగు, ఐదు సినిమాలు వరుసగా చేయడానికి బదులు ఒక్క హిట్‌ సినిమా చేసిన చాలు అనేది నా ఉద్దేశం. అందుకే మంచి కథా చిత్రాలపై ఫోకస్‌ చేస్తున్నా.’’

దేనికైనా రెడీ..

‘‘విజయ్‌ సేతుపతిలాగా ఎలాంటి పాత్రలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. హీరో, విలన్‌, సహాయనటుడు, మల్టీస్టారర్‌.. ఇలా ఏ పాత్ర అయినా ఓకే. అలాగే ఏ భాషా చిత్రమైనా సరే చేస్తా. కాకపోతే కథ నాకు నచ్చితే చాలు.’’Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని