The Family Man 3: కథ నాక్కూడా తెలియదు - no idea how the story the family man season 3 says manoj bajpayee
close
Published : 07/06/2021 01:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

The Family Man 3: కథ నాక్కూడా తెలియదు

ప్రేక్షకులు మూడో సీజన్‌ కావాలంటున్నారు

సమంత ఒక పెద్ద స్టార్‌ 

ఇంటర్వ్యూలో మనోజ్‌ బాజ్‌పాయ్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’.. ఇది వెబ్‌ సిరీస్‌ల స్థాయిని పెంచిందనడంలో సందేహం అనవసరం. మొదటి సిరీస్‌కు మంచి ఆదరణ లభించడంతో దర్శకనిర్మాతలు సీజన్‌2కు శ్రీకారం చుట్టారు. ఇటీవల విడుదలైన ఈ సీజన్‌ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. మనోజ్‌ బాజ్‌పాయ్‌, సమంత, ప్రియమణి తదితరులు కీలకపాత్రలు పోషించారు. సిరీస్‌ మంచి విజయం సాధించిన సందర్భంగా నటుడు మనోజ్‌బాజ్‌పాయి పీటీఐతో మాట్లాడారు. చాలామంది ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ 3’ కోసం డిమాండ్‌ చేస్తున్నారని నటుడు మనోజ్‌ బాజ్‌పాయ్‌ అన్నారు. ఆ కథ తనకు కూడా తెలియదని చెప్పుకొచ్చారు. ఇంకా పలు ఆసక్తికరమైన విషయాలు ఆయన పంచుకున్నారు.

ఒక సీజన్‌ను తెరకెక్కించడానికి ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. ఒకవేళ అమెజాన్‌, రాజ్‌ అండ్‌ డీకే కలిసి మూడో సీజన్‌ చేస్తే నేను ఎంతో సంతోషిస్తాను. అంతకంటే ముందు కథ సిద్ధం చేయాలి. దీంతో పాటు అవసరమైన ప్రక్రియ మొత్తం పూర్తి కావాలి. అభిమానులు మూడో సీజన్‌ కావాలని కోరుతున్నారు. ఆ విషయం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. అయితే, మూడో సీజన్‌ ఎలా ఉండబోతుందో నాక్కూడా తెలియదు. కథ కోసం ఎదురుచూస్తున్నాను. 

ఈ ఏడాది ఆరంభంలో మనోజ్‌బాజ్‌పాయ్‌ ఉత్తమ నటుడిగా తన కెరీర్‌లోనే తొలిసారి ‘భోంస్లే’ అవార్డు అందుకున్నారు. తాజాగా.. ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ ‌2’ మంచి విజయం సాధించడంతో ఆయన రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారు.

వాళ్లిద్దరూ మేధావులు

మొదటి సీజన్‌ తర్వాత ‘ఫ్యామిలీ మ్యాన్‌’కు మంచి మార్కెట్‌ ఏర్పడింది. రాజ్‌ అండ్‌ డీకే ప్రస్తుతం ఉన్న పరిశ్రమలో తెలివైన కుర్రాళ్లు. దర్శకుడు సుపర్ణ్‌వర్మ మాతో ఎంతో స్నేహపూర్వకంగా ఉంటారు. రెండో సీజన్‌లో నాకు రావాల్సిన గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా రచయితలు సుమన్‌, మనోజ్‌ను అభినందించకుండా ఉండలేను. ఒక్కమాటలో చెప్పాలంటే వాళ్లు స్వచ్ఛమైన మేధావులు.

‘ది ఫ్యామిలీ మ్యాన్’లో షరీబ్ హష్మి, ప్రియమణి, శ్రేయా ధన్వంతరి, సన్నీ హిందూజా, షాహాబ్ అలీ, అష్లేషా ఠాకూర్, వేదాంత్ సిన్హా నటించారు.

వన్‌ మ్యాన్‌ షో కాదు.. అందరికీ పేరొచ్చింది

ఈ సిరీస్‌కు వన్‌ మ్యాన్‌ షోగా గుర్తింపు రాకపోవడం నిజంగా నాకు నచ్చింది. ఈ సీజన్‌తో షరీబ్ మంచి విజయం సాధించడం నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. అతను ఇంకా మంచి పాత్రలు చేయాలని కోరుకుంటున్నా. తన విజయాన్ని నా విజయంలాగే భావిస్తున్నా. శ్రేయా గురించి చెప్పాలంటే ఆమె సీజన్ వన్ తర్వాత పెద్ద స్టార్ అయ్యింది. ఈ సిరీస్‌లో ప్రియమణి, సన్నీ హిందూజ, వేదాంత్‌ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. వాళ్లకు మంచి పేరు రావడం పట్ల నేను మరింత సంతోషంగా ఉన్నాను.

సమంత పెద్ద స్టార్‌

దక్షిణాదిలో పెద్ద స్టార్‌ హీరోయిన్‌ సమంత. డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లో తెరంగేట్రం చేసింది. తొలిసారిగా పనిచేస్తున్నప్పటికీ రాజీగా తన మార్కు వేసింది. ఆమె నటనకు ప్రత్యేకంగా మార్కులు వేయాల్సిన అవసరం లేదు. అంత పెద్ద స్టార్‌ హీరోయిన్‌ అయినప్పటికీ ఆమె ఈ సిరీస్‌ కోసం ఎంతో కష్టపడి పనిచేసింది. ఆమె ఉండటం ఈ సిరీస్‌కు ఎంతో సహకరించింది.

వాట్సాప్‌ గ్రూపులో సందడేసందడి..

దాదాపు ఒకే బృందంతో రెండు సీజన్లు పూర్తి చేశాం. దీంతో అందరం కుటుంబ సభ్యుల్లా మారిపోయాం. అందరిలాగే మాకూ వాట్సాప్‌ గ్రూప్‌ ఉంది. అందులో సందడి మామూలుగా ఉండదు. ఇప్పుడు మేమంతా ఒక కుటుంబం. ఫ్యామిలీ మ్యాన్‌ పేరుతో వాట్సాప్ గ్రూప్‌ ఉంది. అయితే.. నేను టైప్ చేస్తూ ఎక్కువగా సందేశాలు పెట్టలేను. అందుకే ఆ గ్రూపులో యాక్టివ్‌గా ఉండను. సెట్స్‌లోనే కాదు బయట కూడా అందరం కలుసుకుంటూ ఉంటాం. యోగక్షేమాలు తెలుసుకుంటాం.

ఆ తేడాను పాత్రలు చెరిపేశాయి

నేను శ్రీకాంత్ పాత్రను నిజాయతీగా మీ ముందుకు తీసుకొచ్చేందుకు ఎంతో కష్టపడి పనిచేశాను. నా పాత్ర కొంతమందికి నవ్వు తెప్పించి ఉండవచ్చు. పరిస్థితులను దూరం నుంచి గమనించే వారికి నవ్వు రావడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. కానీ.. శ్రీకాంత్‌లాంటి పాత్ర ఉండే పరిస్థితుల్లో ఉండే ప్రజలకు అతని బాధ తెలుస్తుంది. ఒక దశలో ‘ది ఫ్యామిలీ మ్యాన్’ అనేది మంచి వ్యక్తులు, చెడు వ్యక్తులకు మధ్య జరిగే పోరు. అయితే, ఈ సిరీస్‌లో పాత్రలు ఇద్దరి మధ్య ఉన్న రేఖను చెరిపేసేలా తీర్చిదిద్దారు.  

ఆ డైరెక్టర్లు మార్చేశారు

మన మీద సినిమాల ప్రభావం చాలా ఉంది. అందుకే మనం విలన్లు అనగానే వారిని చెడ్డవారిగా చూస్తాం. నాకు తెలిసి ఈ మూసధోరణిని డైరెక్టర్లు రామ్‌గోపాల్‌ వర్మ, శేఖర్‌కపూర్‌, మణిరత్నం మార్చారని అనుకుంటున్నాను. వాళ్ల తర్వాత అనురాగ్‌ కశ్యప్‌, దివాకర్‌ (బెనర్జీ) విలన్లను మానవతా కోణంలో చూపిస్తున్నారు. వాళ్లు సినిమా కథను వాళ్ల కోణంలో నుంచి చూపించేందుకు ప్రయత్నించారు.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని