తమిళ సినిమాలు: వివాదాలు.. విశేషాలు - tamtamil nadu films sri lanka movies that faced controversy
close
Published : 28/05/2021 09:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తమిళ సినిమాలు: వివాదాలు.. విశేషాలు

తమిళనాడులో రాజకీయ దుమారం రేపిన చిత్రాలు

తమిళనాడులో ‘ఫ్యామిలీ మ్యాన్‌’ సెగ రగులుతోంది. ఈ వెబ్‌ సిరీస్‌ తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలతో పాటు, ప్రభుత్వం కూడా ఈ వెబ్ సిరీస్‌ను నిషేధించాలని కోరుతోంది. ఈ వివాదం వెనక కారణాలతో పాటు.. తమిళనాట రాజకీయ దుమారం రేపిన మరికొన్ని సినిమా వివాదాలేంటో చూద్దాం!

విజయం.. వివాదం

‘ఫ్యామిలీ మ్యాన్‌’ వెబ్‌ సిరీస్‌ ఎంత విజయం సాధించిందో రెండో సీజన్‌ అంతగా వివాదంలో చిక్కుకుంది. ట్రైలర్‌లో శ్రీకాంత్‌ తివారీ ముంబయి నుంచి చెన్నై వెళ్లే వరకూ బాగానే ఉంది. ఎప్పుడైతే రాజీ పాత్రలో సమంత కనిపిస్తుందో అక్కడే వారికి అభ్యంతరాలు ఎదురయ్యాయి. తమ మనోభావాలు దెబ్బతినేలా ట్రైలర్‌ ఉందని వారి వాదన. శ్రీలంకలో తమ ఉనికి కోసం పోరాడుతున్న తమిళులను ఉగ్రవాదులుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని ఆగ్రహానికి గురయ్యారు. ఎల్‌టీటీఈకి ఉగ్రవాద సంస్థ ఐసీస్‌తో సంబంధమున్నట్లు చూపడంపై తమిళ వర్గాలు మండిపడుతున్నాయి. ఆ రాష్ట్ర ఐటీ శాఖమంత్రి మనో తంగరాజ్‌తో పాటు ఎండీఎంకే అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ వైగో.. రెండో సీజన్‌ను నిషేధించాలని కేంద్ర ఐటీ శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌కు బహిరంగ లేఖలు రాశారు. 

తమిళ ప్రజల పట్ల ప్రేముంది

ట్రైలర్‌లో కొన్ని షాట్స్‌ చూసి, మొత్తం కథను అంచనా వేయొద్దని అంటున్నారు ఫ్యామిలీ మ్యాన్‌ సృష్టికర్తలు రాజ్‌, డీకే. తమ బృందంలో ఎక్కువమంది తమిళనాడుకు చెందినవారే ఉన్నారని చెప్పుకొచ్చారు. ‘తమిళ సంస్కృతి పట్ల అవగాహన ఉంది. వారంటే  అపారమైన ప్రేమ, గౌరవం ఉంది. సున్నితమైన కథను అందించే ప్రయత్నం చేశాం. రెండో సీజన్‌ చూశాక కచ్చితంగా మా ప్రయత్నాన్ని మెచ్చుకుంటారు’ అని వారు చెబుతున్నారు. నిజానికి ఈ వెబ్‌ సిరీస్‌ గత డిసెంబర్‌లోనే విడుదలవ్వాల్సి ఉంది. ఆ తర్వాత ఫిబ్రవరి12 కి మారింది. ఇప్పుడు జూన్‌ 4న విడుదలకు సిద్ధమైంది. ఈ ఆలస్యం వెనక ఓ కారణం ఉంది. భారత్‌తో పాటు విదేశాల్లోనూ ఈ వెబ్ సిరీస్‌కు విపరీతమైన ఆదరణ దక్కింది. హిందీ, తమిళ్, తెలుగుతో పాటు విదేశీ భాషలతో కలుపుకొని మొత్తం 10 భాషల్లో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ డబ్బింగ్‌ పనుల వల్లే ఇంత ఆలస్యమైంది.


గతంలోని వివాదాలివి

కమల్‌ హాసన్‌ ‘విశ్వరూపం’(2013) శాంతి భద్రతలకు భంగం కలిగించేదిగా ఉందని అప్పటి జయలలిత ప్రభుత్వం ఆ సినిమాపై నిషేధం విధించింది. ఆ తర్వాత న్యాయస్థానంలో పోరాడటంతో చివరకు థియేటర్లలో విడుదలైంది. ఈ సమయంలోనే ‘నాకు ఇండియా వదిలి వెళ్లాలని ఉంది’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కమల్ హాసన్‌. అంతగా ఈ సినిమాపై రాజకీయ దుమారం రేగింది. సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది.

* సినిమాటోగ్రాఫర్‌ సంతోశ్‌ శివన్‌ దర్శకుడిగా తెరకెక్కించిన ‘ఇనామ్‌’ (2013)ను విడుదలైన కొన్ని రోజులకే థియేటర్ల నుంచి తొలగించారు. శ్రీలంకలో అంతర్యుద్ధం కారణంగా అనాథలైన చిన్నారుల జీవితాలను కథాంశంగా ఎంచుకోవడమే ఈ చిత్ర వివాదానికి ప్రధాన కారణం. సింహళీయులకు అనుకూలంగా ఉందని రాజకీయ పార్టీలు ఆగ్రహించాయి. 


* విజయ్‌-అట్లీ కాంబినేషన్‌లో వచ్చిన ‘మెర్సల్‌’(2017)లో కేంద్ర ప్రభుత్వ విధానాలైన జీఎస్‌టీ, డిజిటల్‌ ఇండియాపై అభ్యంతరకర డైలాగ్స్‌ ఉన్నాయని, హిందువుల మనోభావాలను గాయపరిచేలా ఉందని వివాదం చెలరేగింది. ఈ వివాదాలు మెర్సల్‌కు మరింత ప్రచారం తీసుకొచ్చి బాక్సాఫీసు వద్ద ఘనవిజయం సాధించింది.

* అలాగే విజయ్‌ మరో చిత్రం ‘సర్కార్‌’కి ఇలాంటి రగడే జరిగింది. ఇందులో ప్రతినాయిక పేరు కోమలవల్లి. దివంగత మాజీ సీఎం జయలలిత అసలు పేరు కోమలవల్లి కావడమే ఈ గొడవకు కారణం. అప్పుడు అధికారంలో ఉన్న అన్నాడీఎంకే ప్రభుత్వం దర్శకుడు మురుగుదాస్‌ ఇంటికి వెళ్లి సోదాలు చేయడం చర్చనీయాంశమైంది.  

* జాన్‌ అబ్రహం తను హీరోగా నటించి, నిర్మించిన ‘మద్రాస్‌ కేఫ్’‌ సినిమాను తమిళనాడులోని రాజకీయ పార్టీలు అడ్డుకునే ప్రయత్నం చేశాయి.

* వివాదాలకు ఆమడ దూరంలో ఉండే విజయ్‌ సేతుపతికీ తప్పలేదు ఈ సెగ. శ్రీలంక వెటరన్‌ స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్‌ బయోపిక్‌లో నటించడానికి అంగీకరించడాన్ని అక్కడి ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. శ్రీలంకలో తమిళులపై అరాచకాలు జరుగుతున్నప్పుడు నోరుమెదపని మురళీధరన్ పాత్రను ఎలా పోషిస్తావని మండిపడ్డారు. అక్కడి రాజకీయ ఒత్తిడికి విజయ్‌ సేతుపతి తలొగ్గక తప్పలేదు. అలా ‘800’ చిత్రం మొదలవకుండానే ఆగిపోయింది.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని