Jashpur Accident: ఛత్తీస్‌గఢ్‌లో విషాదం.. లఖింపుర్‌ ఘటన తరహాలో జనాలపైకి దూసుకెళ్లిన వాహనం

తాజా వార్తలు

Updated : 16/10/2021 16:53 IST

Jashpur Accident: ఛత్తీస్‌గఢ్‌లో విషాదం.. లఖింపుర్‌ ఘటన తరహాలో జనాలపైకి దూసుకెళ్లిన వాహనం

రాయ్‌పుర్‌: పండగ వేళ ఛత్తీస్‌గఢ్‌లో విషాదం చోటుచేసుకుంది. ఇటీవల లఖింపుర్‌ ఖేరి ఘటనలో రైతులపైకి వాహనం దూసుకెళ్లిన తరహాలోనే ఇక్కడి జశ్‌పుర్‌ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకున్న ఓ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. దాదాపు 20 మందికి గాయాలయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం.. జశ్‌పుర్‌ పత్తల్‌గావ్‌కు చెందిన గ్రామస్థులు దుర్గామాత విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో వెనుకనుంచి వేగంగా దూసుకొచ్చిన ఎస్‌యూవీ వారిపైనుంచి దూసుకెళ్లింది. నిందితులు అంతటితో ఆగకుండా అక్కడినుంచి పరారయ్యారు. ఈ ఘటనలో గ్రామానికి చెందిన గౌరవ్ అగర్వాల్(21) దుర్మరణం పాలయ్యాడు. క్షతగాత్రులను చికిత్స కోసం స్థానిక సివిల్‌ ఆసుపత్రికి తరలించారు.

గ్రామస్థుల ఆగ్రహం..

ఈ ఘటనతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన గ్రామస్థులు.. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని వెంబడించారు. కొంత దూరంలో రోడ్డు పక్కన వదిలిపెట్టినట్లు గుర్తించారు. దానికి నిప్పు పెట్టారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. నిందితులు వాహనంలో గంజాయి సరఫరా చేస్తున్నట్లు ఆరోపించారు. ఈ విషయంపై ఇంకా విచారణ జరగాల్సి ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనలో ఇద్దరు నిందితులు.. బబ్లూ విశ్వకర్మ(21), శిశుపాల్ సాహు(26)ను అరెస్ట్‌ చేసినట్లు జిల్లా ఎస్పీ వినయ్‌ అగర్వాల్‌ వెల్లడించారు. ఇద్దరూ మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలి జిల్లాకు చెందినవారని చెప్పారు.

సీఎం బాఘెల్‌ దిగ్భ్రాంతి..

ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్‌ బాఘెల్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘జశ్‌పుర్‌ ఘటన చాలా బాధాకరం. పోలీసులు వెంటనే నిందితులను అరెస్టు చేశారు. ఈ ఘటన విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై కూడా ప్రాథమిక చర్యలు తీసుకున్నాం. నిందితులు ఎవరూ తప్పించుకోలేరు. అందరికీ న్యాయం జరుగుతుంది’ అని ట్వీట్‌ చేశారు. మరోవైపు భాజపా నేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ఘటనకు సంబంధించిన వీడియోను ట్వీట్‌ చేస్తూ.. రాష్ట్రంలో మాదకద్రవ్యాల మాఫియా బలపడుతోందని ఆరోపించారు. బాధిత కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని, జిల్లా ఎస్పీని వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని