
తాజా వార్తలు
నలుగురి అనుమానాస్పద మృతి
నిర్జీవంగా ఇంట్లో కనిపించిన కుటుంబం
ఇంటి యజమాని అదృశ్యం
దర్యాప్తు చేస్తున్న పోలీసులు
లుథియానా(పంజాబ్): ఒకే కుటుంబంలోని నలుగురు అనుమానాస్పదస్థితిలో మరణించిన ఘటన లుథియానాలో జరిగింది. వారిని కలిసేందుకు బంధువులు ఇంటికి రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మయూర్ విహార్ కాలనీకి చెందిన స్థిరాస్తి వ్యాపారస్తుడు రాజీవ్సూద్ అతని భార్య సునీత, కుమారుడు ఆశిష్, కోడలు గరిమ, పదమూడేళ్ల మనవడితో కలిసి నివసిస్తున్నారు. మంగళవారం గరిమ తండ్రి వారిని కలిసేందుకు ఇంటికి వచ్చాడు. ఎంతసేపటికీ ఎవరూ తలుపు తీయకపోవడంతో పోలీసులకు, ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించాడు. పోలీసులు వచ్చి పరిశీలించగా రాజీవ్సూద్ మినహా ఇంటిలో వారంతా నిర్జీవంగా కనిపించారు. పదునైన ఆయుధం ఉపయోగించి వారందర్నీ హతమార్చి ఉంటారని అడిషనల్ డిప్యుటీ కమిషనర్ సమీర్‌వర్మ తెలిపారు. వారికి కుటుంబ కలహాలు ఏమీ లేవని పేర్కొన్నారు. కాగా ఘటన బయటపడినా ఇంటి యజమాని రాజీవ్సూద్ ఎక్కడున్నారో తెలియరాలేదు. నగరానికి దూరంగా ఆయన కారు దగ్ధమైన స్థితిలో కనిపించింది. కారులో ఎవరూ లేరని పోలీసులు నిర్ధరించారు. మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.