నీవు లేక నేను లేను..
close

తాజా వార్తలు

Published : 26/10/2020 07:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నీవు లేక నేను లేను..

వాగులో పడి భార్య మృతి
మనస్తాపంతో భర్త బలవన్మరణం
దిక్కుతోచని స్థితిలో కుమార్తెలు

నిడమనూరు, న్యూస్‌టుడే: దసరా పండుగను సంతోషంగా జరుపుకోవాలనుకున్న ఆ కుటుంబంపై కాలం కన్నెర్ర చేసింది. పిల్లలిద్దరికీ దుస్తులు కొనడానికి వెళ్లిన భార్య ప్రమాదవశాత్తు వాగులో పడి మృతి చెందగా, ఆమె మృతిని తట్టుకోలేని భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. నాలుగు రోజుల వ్యవధిలో తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన వారి ఇద్దరు కుమార్తెలు కన్నీరుమున్నీరవుతున్నారు. నల్గొండ జిల్లా నిడమనూరు మండల కేంద్రంలో జరిగిన ఈ విషాద సంఘటనల వివరాలు ఇలా ఉన్నాయి. పెందోటి లక్ష్మమ్మ (35), నర్సింహ (38) దంపతులకు ఇద్దరు కుమార్తెలు... నిఖిత (9వ తరగతి పూర్తి చేసింది), అంజలి (8వ తరగతి పూర్తి). లక్ష్మమ్మ స్థానిక ఆదర్శ పాఠశాల బాలికల వసతిగృహంలో కాపలాదారుగా పనిచేసేది. ఆమె ఈ నెల 20న హాలియా పట్టణానికి వెళ్లి పిల్లలకు కొత్త దుస్తులు కొనుక్కుని వస్తుండగా.. నిడమనూరు, బంకాపురం మధ్యలో వర్షాలకు నీట మునిగిన వంతెన దాటుతూ ప్రమాదవశాత్తు వాగులో పడి మృతి చెందింది. ఆమె అంతిమ సంస్కారాలు నిర్వహించిన రోజు రాత్రంతా శ్మశానవాటికలోనే ఉండి విలపించాడు భర్త నర్సింహ. లక్ష్మమ్మ పనిచేసే వసతిగృహం తాళాలు తన దగ్గరే ఉండడంతో అతడు శుక్రవారం మధ్యాహ్నం వాటిని తీసుకుని ఇంటి నుంచి వెళ్లాడు. లక్ష్మమ్మ చిన్న కర్మ శనివారం నిర్వహించాల్సి ఉండగా.. భర్త ఆచూకీ లేదు. అన్నను వెతుకుతూ అతని తమ్ముడు వసతి గృహానికి వెళ్లి చూడగా నర్సింహ ఫ్యాన్‌కు ఉరి వేసుకున్న స్థితిలో విగతజీవిగా కనిపించాడు. నర్సింహ దంపతుల ఇద్దరు కుమార్తెలు, బంధువులు అక్కడకు చేరుకొని గుండెలవిసేలా విలపించారు. ఎస్సై కొండల్‌రెడ్డి సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. నర్సింహ మృతదేహాన్ని పరీక్ష కోసం మిర్యాలగూడకు తరలించారు. మృతుడి తల్లి ఈదమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని