Updated : 14/04/2021 04:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తవ్వుకో నా రాజా..!

ప్రకాశం బ్యారేజీ ఇసుక కోసం ప్రయత్నాలు!
ఈనాడు, అమరావతి

టెండర్ల దశలోనే ఉన్న ప్రకాశం బ్యారేజీ ఇసుకపై బినామీలు వాలేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో నూతన ఇసుక విధానం అడ్డం పెట్టుకుని బ్యారేజీ నుంచి వెలికి తీసిన ఇసుక అమ్మకాలు దక్కించుకునే ఏర్పాట్లు జరుగుతున్నాయి. గతంలో మైలవరం నియోజకవర్గంలో ఆధిపత్యం చెలాయించిన ఇద్దరు నేతల అనుచరులే బ్యారేజీ ఇసుక కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. జలవనరుల శాఖ ద్వారా వీటి అమ్మకాలు దక్కించుకొనేందుకు రంగం సిద్ధమైంది. ప్రకాశం బ్యారేజీలో పేరుకు పోయిన ఇసుకను పూడిక తీత పేరుతో తీయడానికి టెండర్లను ఇంకా ఖరారు చేయలేదు. ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చే విధంగా మార్గదర్శకాలు తయారవుతున్నట్లు సమాచారం. ఇసుక గుత్తేదారుకు సంబంధం లేకుండా ప్రత్యేకంగా దీన్ని అప్పగించేందుకు జలవనరుల శాఖపై రాజకీయ ఒత్తిడి పెరుగుతోంది.
ప్రకాశం బ్యారేజీలో మొత్తం 1.20కోట్ల ఘనపు మీటర్ల ఇసుక మేటలు ఉన్నట్లు గుర్తించారు. డ్రెడ్జింగ్‌ ద్వారా 60లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుకను తోడేయాల్సి ఉంది. దీనికి దాదాపు రూ.95కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. మొత్తం 12 ప్రాంతాల్లో ఇసుక మేటలు ఉన్నట్లు గుర్తించి జలవనరుల శాఖ ఆధ్వర్యంలో వెలికి తీసేందుకు టెండర్లను పిలిచారు. టెండర్లలో పాల్గొన్న కంపెనీలను రివర్స్‌ టెండర్లకు ఆహ్వానించారు. మొత్తం 12 బిడ్లు దాఖలు అయ్యాయి. వీటిలో ఆరు ప్రాంతాలకు ఒకే సంస్థ టెండర్లను దాఖలు చేసింది. మిగిలిన వాటికి ఒకటి చొప్పున దాఖలు అయ్యాయి. వీటికి రివర్స్‌ టెండర్లను ఆహ్వానిస్తే 25 శాతం నుంచి 31 శాతం వరకు తక్కువకే కోట్‌ చేశారు. ప్రస్తుతం వీటి మూల్యాంకన జలవనరుల శాఖ సీఈ కార్యాలయంలో జరుగుతోంది. ఆయా ప్రాంతాల్లో డ్రెడ్జింగ్‌ నిర్వహించి ఇసుకను ఒడ్డుకు చేర్చే బాధ్యత గుత్త సంస్థలదే. ఇలా వెలికి తీసినందుకు అయిన ఖర్చు ఇసుక అమ్మకాల ద్వారా సేకరించుకోవాలని జలవనరుల శాఖ ప్రతిపాదించింది. మొదట ఏపీఎండీసీ ద్వారా ఇసుక విక్రయాలు ఆన్‌లైన్‌లో జరిగేవి.

అక్రమ రవాణాకు మార్గం..!
ఇప్పటికే ఇబ్రహీంపట్నం, నందిగామ, కంచికచర్ల ప్రాంతాల నుంచి ఇసుక పెద్ద ఎత్తున హైదరాబాదుకు తరలిపోతోంది. ప్రకాశం బ్యారేజీ ఇసుక అంటే ఇక అడ్డే ఉండదు. రూ.475 అయితే మూడు ఘనపు మీటర్లు ఒక యూనిట్‌(ట్రాక్టర్‌) అవుతుంది. రూ.1425కే విక్రయించే అవకాశం ఉంది. లోడింగ్‌ ఛార్జీలు రూ.200 కలిపితే రేవు దగ్గర రూ.1625కే ఇసుక లభిస్తుంది. ఇదే ఇసుక విజయవాడ నగరంలో రూ.4వేల నుంచి రూ.5వేలకు విక్రయించే అవకాశం ఉంది. ప్రస్తుతం ట్రాక్టర్‌ ఇసుక రవాణాతో కలిపి రూ.5వేల వరకు పలుకుతోంది. హైదరాబాద్‌లో లారీ ఇసుక రూ.60వేల వరకు పలుకుతోంది.  ఈ ఇసుకపై భారీగా ఆదాయాన్ని గడించే అవకాశాలు ఉండటంతో నేతలు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రస్తుతం కొత్త విధానంలో ఇసుక రేవుల వద్ద నేరుగా విక్రయించనున్నారు. జిల్లా మొత్తం ఒకే గుత్తేదారు ఉంటారు. ఇసుక రేవు వద్ద గరిష్ఠంగా రూ.475కు ఘనపు మీటరు విక్రయించాలని నిర్ణయించారు. జిల్లాలో ఎన్ని రేవులు ఉంటే అన్నింటిని గుత్తేదారుకు అప్పగించాల్సి ఉంటుంది. ఎడ్లబండ్ల ద్వారా మాత్రమే ఉచిత ఇసుక గ్రామస్థులకు అందిస్తారు. ఇది ఈనెల 16 నుంచి అమలు కాబోతోంది. ఈ విధానంలో ప్రకాశం బ్యారేజీ ఇసుకను చేర్చకుండా మినహాయింపు ఇచ్చారు. ప్రస్తుతం 31శాతం వరకు తక్కువ ధరలకు టెండర్లను వేశారు. అంటే 60 లక్షల క్యూబిక్‌ మీటర్ల వెలికి తీసేందుకు సుమారు రూ.60కోట్ల వరకు వ్యయం కానుంది. గుత్తేదారులకు జలవనరుల శాఖ చెల్లించనుంది. దీన్ని తిరిగి ఇసుక అమ్మకాల ద్వారా రాబట్టుకోవాల్సి ఉంది. ఘనపు మీటరు గరిష్ఠంగా రూ.475 చొప్పున 60లక్షల క్యూబిక్‌ మీటర్లు ఇసుక విక్రయాలకు దాదాపు రూ.285కోట్ల వరకు రానుంది. లెక్కలోకి రాని ఆదాయం సరే సరి. దీంతో ఈ వెలికి తీసే ఇసుకపై నేతల బినామీల కన్ను పడింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని