Published : 14/04/2021 03:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

దేవస్థానం బస్సుల ట్రయల్‌ రన్‌కు స్పందన

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: ఇంద్రకీలాద్రిపై ఏడాది తరువాత ఉగాది రోజున దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం బస్సులు ఘాట్‌ రోడ్డు మార్గంలో నడపడంతో భక్తుల నుంచి చక్కని స్పందన లభించింది. దుర్గగుడి ఈవోగా భ్రమరాంబ బాధ్యతలు స్వీకరించిన వారం రోజుల వ్యవధిలోనే ఘాట్‌ రోడ్డు మార్గంలో దేవస్థానం బస్సులు తిప్పడం, సర్వదర్శనానికి మహా మండప మార్గంతో పాటు ఘాట్‌ రోడ్డు మార్గంలో కూడా క్యూలైను ఏర్పాటు చేయడం వంటి నిర్ణయాలు సామాన్య భక్తులకు ఊరటనిస్తున్నాయి. మండు వేసేవిలో దూరప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఘాట్‌ రోడ్డు మార్గంలో పైవరకు రావడానికి దేవస్థానం బస్సులకు అనుమతి లేదని చెప్పి సర్వదర్శనం లైను మహా మండప మార్గానికే పరిమితం చేశారు. దీంతో వృద్ధులు, దివ్యాంగులు ఏడు అంతస్తుల మెట్లు ఎక్కలేక అవస్థలు పడ్డారు. కొవిడ్‌ నిబంధనల కారణంగా లిఫ్టులు మూసివేయడం, ఘాట్‌ రోడ్డు మార్గంలో సర్వదర్శనం లేకపోవడంతో ఎదురైన ఇబ్బందులను భక్తులు నూతన ఈవో దృష్టికి తీసుకువచ్చారు. ఉచిత దర్శనానికి టోకెన్లతో సంబంధం లేకుండా నేరుగా క్యూలైన్లోకి వచ్చే విధంగా ఈవో నిర్ణయం తీసుకున్నారు. భక్తులకు మరింత సౌకర్యంగా ఉండేందుకు దేవస్థానానికి ఉన్న ఎనిమిది బస్సుల్లో రెండింటిని ఘాట్‌ రోడ్డు మార్గంలో తిప్పేందుకు ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. మిగతా ఆరు బస్సులు రైల్వేస్టేషను, బస్టాండ్‌ నుంచి భక్తులను కనకదుర్గానగర్‌ వరకు మాత్రమే నడపుతున్నారు. ఈవో భ్రమరాంబ మాట్లాడుతూ మెట్లు ఎక్కలేని వృద్ధులు, దివ్యాంగులు, మహిళలను దృష్టిలో ఉంచుకొని రెండు బస్సులను ఘాట్‌ రోడ్డు మార్గంలో తిప్పేందుకు నిర్ణయించామన్నారు. ట్రయల్‌ రన్‌లో ఎదురయ్యే ఇబ్బందులను పరిశీలించిన తరువాత వాటిని అధిగమించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఘాట్‌ రోడ్డు, మహామండప మార్గాలో భక్తులు కొవిడ్‌ నిబంధనలు పాటించి అమ్మవారి దర్శనం చేసుకునేందుకు అనుమతించామన్నారు. ఘాట్‌ రోడ్డు మార్గంలో కూడా ఉచిత దర్శనం లైను ఏర్పాటు చేసినందున భక్తులు అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని