Published : 14/04/2021 03:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నగరపాలిక హరిత బాట

అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా శ్రీకారం
ఈనాడు - అమరావతి

బ్లేజ్‌వాడగా మారుతున్న విజయవాడ నగరంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు నగరపాలిక నడుంబిగించనుంది. మొత్తం ఐదు వేల చెట్లను మొక్కలను అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ కార్యక్రమాన్ని రెండు దశలలో చేపడతారు. ప్రారంభసూచకంగా తొలివిడత కింద అంబేద్కర్‌ జయంతి రోజు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. బెజవాడలో పచ్చదనం కొరవడి వేడి భరించలేని స్థాయికి చేరింది. పరిస్థితిని మార్చి, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు హరితబాట పట్టారు. బుధవారం నాడు నగరపాలక అధికారులు, సిబ్బంది, కార్పొరేటర్లు మొక్కలు నాటనున్నారు. దీనికి సంబంధించి నగర మేయర్‌ భాగ్యలక్ష్మి తొలి సంతకం చేశారు.
విజయవాడ నగరం 61.88 చదరపు కి.మీ మేర విస్తరించింది. నగర విస్తీర్ణానికి తగ్గట్లుగా పచ్చదనం కొరవడింది. రానురాను నివాస ప్రాంతాలు పెరగడంతో కాంక్రీట్‌ జంగిల్‌గా మారుతోంది. ఫలితంగా వాతావరణ సమతుల్యత దెబ్బతింటోంది. వేసవిలో అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడుతున్నారు. దీంతో పాటు ఆహ్లాదకర వాతావరణం లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో కార్యక్రమం ఉపయోగపడనుంది. రెండు దశలు పూర్తి అయితే సుందరంగా తీర్చిదద్దంతో పాటు ప్రజలకు ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించేందుకు దోహదపడుతుంది. దీంతో స్వచ్ఛమైన గాలిని పీల్చుకునే అవకాశం నగరవాసులకు కలుగుతుంది. అంబేద్కర్‌ జయంతి నాడు వెయ్యి మొక్కలు నాటనున్నారు. వేసవి కావడంతో త్వరగా ఎదిగేందుకు పెద్ద మొక్కలనే నాటనున్నారు.
విజయవాడ నగరంలోని బందరు, ఏలూరు, రైవస్‌, బడమేరు కాలవ గట్లు, కార్పొరేషన్‌ ఖాళీ స్థలాల్లో వీటిని నాటబోతున్నారు. వీఎంసీ పరిధిలోని ఏడు కి.మీ మేర కాలవ గట్లపై పచ్చదనం పెంచుతారు. ఇందుకు గాను టబాబియా, రేలా, పొన్న, పున్నాగ, పొగడ, మారేడు, వేప, మోదుగు, తదితర నీడనిచ్చే రకాలను ఎంపిక చేశారు. మొదటి దశలో కాలవ గట్లను ఎంచుకున్నారు. నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో అయితే ఎండిపోయే సమస్య ఉండదని, ఎండా కాలం అయినా ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. రుతుపవనాల ప్రవేశం తర్వాత రెండో దశను ప్రారంభిస్తారు. తొలకరి జల్లులు మొదలైన తర్వాత దాదాపు నాలుగు వేలు మొక్కలు నాటనున్నారు. గట్లపై మిగిలిన ప్రాంతాలతో పాటు, ఖాళీ స్థలాల్లో నాటడంపై దృష్టి పెడుతున్నారు. నాటడంతో పాటు, అవన్నీ బతికేలా చర్యలు కూడా తీసుకుంటున్నారు. మొక్కల సంరక్షణ కోసం టెండరు పిలిచారు. మొక్కలు తీసుకొచ్చి, గుంతలు తీయడం, తర్వాత.. వాటికి నీటిని అందించడం గుత్తేదారు బాధ్యత. ఆరు నెలల పాటు వీటికి నీటి తడులను అందిస్తారు. దీనిపై వీఎంసీ కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్‌ ‘ఈనాడు’తో మాట్లాడుతూ.. విజయవాడ నగరాన్ని హరితమయం చేసే లక్ష్యంతో బృహత్‌ కార్యక్రమాన్ని చేపట్టనున్నామని చెప్పారు. అందరి సహకారంతో దీన్ని విజయవంతం చేస్తామని వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని