Published : 14/04/2021 03:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అమ్మ కడుపునకు కోత

గ్రామీణ పామర్రు, న్యూస్‌టుడే

హజ ప్రసవాలకు కొందరు వైద్యులు తిలోదకాలిస్తున్నారు. డబ్బు కోసం ఆశపడి అమ్మ కడుపునకు కోత కోస్తున్నారు. అవసరం ఉన్నా.. లేకపోయినా ఎడాపెడా శస్త్రచికిత్సలు చేస్తూ వారి ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. కాన్పు కోసమని ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తే అప్పుల పాలు కావాల్సిన దుస్థితి నెలకొంటుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు చేసేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నాయి. అయితే ప్రభుత్వాసుపత్రుల్లో లభించే సౌకర్యాలపై సరైన అవగాహన లేకపోవడం, ప్రసవానికి ఆసుపత్రిలో చేరినా పై ఆసుపత్రులకు రిఫర్‌ చేయడం వంటి కారణాలతో గర్భిణులు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నాఉ.
జిల్లాలో 88 పీహెచ్‌సీలు ఉండగా, రెండు ఏరియా ఆసుపత్రులు, ఒక జిల్లా ఆసుపత్రి, బోధనాసుపత్రి మరొకటి, ఏడు కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్స్‌, 36 ముఖ్యమంత్రి పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 593 ఆరోగ్య ఉప కేంద్రాల ద్వారా ప్రజకు వైద్యసేవలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రసవాలు చేసేందుకు జిల్లాలోని వైద్య విధాన పరిషత్‌ (జిల్లా ఆసుపత్రి, ఏరియా ఆసుపత్రి, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్స్‌)లో గైనకాలజిస్ట్‌ పోస్టులు 30 ఉండగా ప్రస్తుతం 28 మంది పనిచేస్తున్నారు. జగ్గయ్యపేట, కైకలూరు ఆసుపత్రులలో గైనకాలజిస్ట్‌ పోస్టులుఖాళీగా ఉన్నాయి.
జిల్లా ఆసుపత్రి, ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్స్‌, 24/7 పనిచేసే ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో ప్రసవాలు చేస్తున్నారు. శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఏర్పడితే జిల్లా ఆసుపత్రి, బోధనాసుపత్రి, ఏరియా ఆసుపత్రి, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో మాత్రమే చేస్తున్నారు.

సగం మందికి శస్త్రచికిత్సలే
గర్భిణి ఆరోగ్య పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకునే విచక్షణాధికారం వైద్యుడికి ఉంది. వైద్యం వ్యాపారంగా మారిన ఈ రోజుల్లో డబ్బుకు ఆశపడి కొందరు వైద్యులు శస్రచికిత్సలకు ప్రాధాన్యం ఇస్తున్నారన్న విమర్శలున్నాయి. పురిటినొప్పులు వచ్చే వరకు వేచి చూడకుండా త్వరగా అయిపోతుందని ఆపరేషన్‌ చేస్తున్నారు. సహజ కాన్పు కంటే శస్త్రచికిత్సకు అధికంగా సొమ్ము వస్తుందన్న అత్యాశే దీనికి కారణం.
జిల్లాలో ఓ మోస్తరు ఆసుపత్రుల్లో సహజ కాన్పునకు రూ. 15 వేలు, శస్త్రచికిత్సకు అయితే రూ. 40 వేలు వసూలు చేస్తున్నారు. ఇక కార్పొరేట్‌ ఆసుపత్రిలో అయితే శస్త్రచికిత్సకు రూ. లక్ష వరకు వసూలు చేస్తున్నారు. అనవసరంగా శస్త్రచికిత్సలు చేస్తుండడంతో మహిళలు నడి వయసులో చాలా ఇబ్బందులు పడతున్నారు. ఆపరేషన్‌ సమయంలో మత్తు ఇవ్వాల్సి ఉంటుంది. దీని వల్ల తర్వాతి రోజుల్లో తీవ్రమైన నడుము నొప్పి సమస్య వేధిస్తుంది. పిల్లల పెంపం, ఇంటిపనుల్లో పడి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయడం వల్ల పలు దుష్ఫలితాలు సంభవిస్తున్నాయి. గర్భసంచి తొలగించాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. సరైన పోషకాహారం తీసుకోక అనారోగ్యానికి గురవుతున్నారు. ఆపరేషన్‌ సమయంలో కుట్లు సరిగా వేయకపోవడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. తొలిసారి సిజేరియన్‌ చేస్తే.. రెండో కాన్పుకు కూడా శస్త్రచికిత్స చేయాల్సి వస్తోంది. పలు సందర్భాలలో రక్తస్రావం జరిగి మరణాలు కూడా సంభవిస్తున్నాయి.

ఏయే కేసుల్లో అవసరం
సహజ కాన్పు కష్టమని భావించిన కేసుల్లో వైద్యులు సిజేరియన్‌కు వెళ్తారు. హైరిస్క్‌ కేసుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో కోతలకు నిర్ణయం తీసుకుంటారు. ప్రసవ సమయం దాటిపోతున్నా నొప్పులు రాకపోవడం, బిడ్డ పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పుడు దీనికి మొగ్గు చూపుతారు. బిడ్డ అధిక బరువు కారణంగా గర్భసంచి నుంచి బయటకు వచ్చేందుకు ఇబ్బంది అని భావించిన కేసుల్లో తప్పనిసరిగా ఆపరేషన్‌ చేస్తారు. గర్భం నుంచి శిశువు తల వచ్చి ఆగిపోవడం లేదా తిరగబడి కాళ్లు రావడం.. వంటి పరిస్థితులు తలెత్తినప్పుడు చేయాల్సి వస్తుంది. ఉమ్మనీరు తగ్గినప్పుడు శిశువును రక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకుంటారు. ఫలానా రోజు ప్రసవం కావాలంటూ కూడా శస్త్రచికిత్సల వైపు గర్భిణి కుటుంబ సభ్యులు మొగ్గుచూపుతున్నారు. నెలలు నిండకుండానే మంచి రోజు కదా అని సిజేరియన్‌ చేసి బిడ్డను బయటకు తీయడం ఇబ్బందికరమని వైద్యులు చెబుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని