Published : 14/04/2021 03:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘భర్త వేధింపులతోనే వాణి ఆత్మహత్య’

నున్న(విజయవాడ గ్రామీణం), న్యూస్‌టుడే: పుట్టింటి నుంచి డబ్బులు తీసుకురావాలని భర్తతో సహా అతని కుటుంబ సభ్యులు వేధిస్తుండడం వల్లే మా కుమార్తె, తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఆత్మహత్య చేసుకుందని నున్న గ్రామానికి చెందిన వాణి బంధువులు ఆరోపిస్తున్నారు. గ్రామంలోని కోటకట్టుసెంటరు సమీప ఏఎస్‌ఎం కళాశాల రోడ్డులో నివాసముంటున్న వంగపోలు వాణి (22), తన ఇద్దరు కుమార్తెలతో కలిసి పురుగుల మందు తాగి సోమవారం చనిపోయిన విషయం విధితమే. ముగ్గురి మృతదేహాలకు మంగళవారం శవ పరీక్ష నిర్వహించి నున్న గ్రామానికి తీసుకువచ్చారు. భర్త సురేంద్రతోపాటు అత్త ధనలక్ష్మి, బావ సుధీర్‌, తోడికోడలు గౌతమి, మరిది సాత్విక్‌ కొద్ది కాలంగా పుట్టింటి నుంచి డబ్బులు తీసుకురావాలని వాణిని వేధిస్తున్నారని, ఆ వేధింపులు తాళలేకే ఆమె చనిపోయిందని ఆరోపిస్తూ తమకు న్యాయం కావాలని వాణి బంధువులు కొద్దిసేపు నూజివీడు రహదారిపై ఆందోళన నిర్వహించారు. 2017లో వివాహమైన సమయంలో సురేంద్ర చిల్లర దుకాణం నిర్వహిస్తూ ఉండేవాడని, వరకట్నంగా అర ఎకరం పొలం ఇచ్చామన్నారు. తర్వాత చెడు వ్యసనాలకు బానిసై తల్లితోపాటు సోదరుల మాటలు విని సురేంద్ర అప్పుల పాలయ్యాడన్నారు. దీంతో డబ్బుల కోసం వాణిపై శారీరకంగా, మానసికంగా వేధింపులు తీవ్రతరం చేస్తుండడంతో అనేక దఫాలుగా తమకు కూడా చెప్పి కన్నీరు మున్నీరు అయ్యిందని మృతురాలి కుటుంబ సభ్యులు అంటున్నారు. పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేసి తమకు న్యాయం చేయాలని.. లేని పక్షంలో పోలీసుల ఎదుటే ఆత్మహత్య చేసుకుంటామని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై నార్త్‌జోన్‌ ఏసీపీ షేక్‌ షాను మాట్లాడుతూ కేసు విచారణ వేగవంతం చేశామన్నారు. తాడేపల్లికి చెందిన మృతురాలి తల్లి తిరుమణి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో వాణి భర్త సురేంద్రతోపాటు మరో నలుగురిపై వేధింపుల కేసు నమోదు చేశామన్నారు. దోషులకు శిక్ష పడేలా చూస్తామని వాణి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. ఒకటి, రెండు రోజుల్లోనే ఈ కేసులో ప్రతి ఒక్కరినీ అరెస్టు చేస్తామన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని