Published : 14/04/2021 03:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మందగమనం

50 శాతం నిండిన శీతలగోదాములు

ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న సరకు
నిల్వలు పెరగడంతో ధరపై ప్రభావం
ఈనాడు-అమరావతి

గుంటూరు మిర్చియార్డుకు మిరపకాయల టిక్కీలు పోటెత్తుతున్నాయి. యార్డుకు వస్తున్న సరకు వచ్చినట్లే అమ్మకాలు జరగకపోవడంతో నిల్వలు పెరిగి ధరలపై ప్రభావం పడుతోంది. వారం రోజుల వ్యవధిలో రకాలను అనుసరించి క్వింటాకు రూ.500ల నుంచి రూ.1000ల వరకు ధరలు తగ్గాయి. మిర్చి చివరికోతలు కావడంతో నాణ్యమైన సరకు లభ్యత తగ్గి ధరలు తగ్గాయని మార్కెట్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈఏడాది సీజన్‌ ప్రారంభం నుంచి రైతులకు మెరుగైన ధరలు లభిస్తుండటంతో రైతులు అమ్మకాలకే మొగ్గుచూపుతున్నారు. నాణ్యత ఉన్న సరకుకు ప్రస్తుతం కూడా మంచి ధర లభిస్తోంది. ప్రస్తుత ధరలకు విక్రయించకుండా శీతలగోదాముల్లో నిల్వచేస్తే ఖర్చులు, వడ్డీ కలిపితే క్వింటాకు రూ.3వేల
వరకు అదనంగా అమ్మితేనే కలిసొస్తుందని రైతులు చెబుతున్నారు. దీనికితోడు మూడోకోత కాయలు కావడంతో నాణ్యత తక్కువగా ఉన్నందున నిల్వచేసినా పెద్దగా ప్రయోజనం ఉండదని భావిస్తున్న రైతులు అమ్మకాలకే ఆసక్తి చూపుతున్నారు. దీంతో మార్కెట్‌పై ఒత్తిడి పెరుగుతోంది. ఏప్రిల్‌ నెల ప్రారంభం నుంచి యార్డుకు ఎక్కువరోజులు సెలవులు రావడంతో పనిదినాల్లో సరకు ఎక్కువగా వస్తోంది. దీంతో యార్డులో నిత్యం 3లక్షల టిక్కీలతో కిటకిటలాడుతోంది. మరో పదిరోజులుపాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వ్యాపారుల అంచనా.

50 శాతం నిండిన శీతలగోదాములు
ఈఏడాది సీజన్‌ ప్రారంభం నుంచి మిర్చి ధరలు ఆశాజనకంగా ఉండటంతో రైతులు అమ్మకాలకు మొగ్గుచూపారు. పెద్దరైతులు, నిల్వదారులు తొలి, రెండో కోతకు సంబంధించిన కాయలు శీతలగోదాములకు తరలించారు. ఇప్పటివరకు జిల్లాలోని శీతలగోదాముల్లో 50లక్షల టిక్కీల మిర్చి నిల్వచేశారు. ఇందులో తాలుకాయలు 12లక్షలు కాగా, పాతసరకు 4లక్షల టిక్కీల వరకు ఉంది. ఇంకా 15లక్షల టిక్కీల వరకు శీతలగోదాములకు వెళుతుందని అంచనా. మొత్తంమీద ధరలు కొంత ఆశాజనకంగా ఉండటం, నాణ్యమైన సరకు కాకపోవడంతో రైతులు విక్రయాలకే మొగ్గుచూపుతున్నారు. దీంతో మార్కెట్‌పై ఒత్తిడి పెరిగి ధరలపై కొంత ప్రభావం చూపుతోందని వ్యాపారులు చెబుతున్నారు. యార్డుకు మే 10 నుంచి నెలరోజులపాటు సెలవులు ఇవ్వనున్నారు. సెలవుల వరకు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని మిర్చి ఎగుమతి వ్యాపారి దినేష్‌ తెలిపారు. నాణ్యమైన సరకు లభ్యత తగ్గినందున ధరలు తగ్గుతున్నాయన్నారు.

కిక్కిరిసిన మిర్చి యార్డు
గుంటూరు, ప్రకాశం జిల్లాలతోపాటు కర్నూలు కర్ణాటక రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలు, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాల నుంచి సరకు ఎక్కువగా వస్తోంది. తొలికోతలు నాణ్యమైన సరకు కావడంతో వ్యాపారులు ఆయా ప్రాంతాలకు వెళ్లి మిరపకాయలు రైతుల వద్ద కొనుగోలు చేశారు. ప్రస్తుతం సరకు నాణ్యత లేకపోవడంతో రైతుల వద్దకు వ్యాపారులు వెళ్లకపోవడంతో యార్డుకు తీసుకువస్తున్నారు. స్థానికంగా వస్తున్న కాయలతోపాటు పొరుగు ప్రాంతాల నుంచి వస్తున్న సరకుతో యార్డు కిక్కిరిసిపోతోంది. బంగ్లాదేశ్‌, శ్రీలంకకు ఎగుమతులు మందకొడిగా ఉండటం వల్ల కొన్ని రకాలకు డిమాండ్‌ తగ్గింది. ఈ రకాలను దేశీయంగా కారంతయారీ, ఇతర అవసరాలకు తరలిస్తున్నారు. తేజ రకం మిర్చికి చైనా నుంచి డిమాండ్‌ ఉండటంతో ఎగుమతులు ఆశాజనకంగానే ఉన్నాయి. దీంతో ధరలు కొన్నాళ్లుగా స్థిరంగా కొనసాగాయి. ప్రస్తుతం సరకు నిల్వ పెరగడంతో ధరలు కొంత తగ్గుతున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని