Published : 14/04/2021 03:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మళ్లీ కొవిడ్‌ కేర్‌ కేంద్రాలు

ప్రారంభానికి కసరత్తు మొదలు
తెనాలి టౌన్‌, న్యూస్‌టుడే


తెనాలిలో కొవిడ్‌ కేర్‌ కేంద్రం ఏర్పాటు చేయనున్న టిడ్కో ఇళ్ల సముదాయం

కొవిడ్‌ రెండో దశలో కేసుల సంఖ్య పెరిగిపోవడం, బాధితులతో ప్రభుత్వ వైద్యశాలలు నిండిపోవడంతో తిరిగి ‘కొవిడ్‌ కేర్‌ కేంద్రాల’ ఏర్పాటుకు అధికారులు కసరత్తు ఆరంభించారు. తొలిగా గుంటూరు (400 మంచాలు), తెనాలి (400 మంచాలు), చిలకలూరిపేట (200 బెడ్లు) ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధమైంది.   మొత్తం 1000 మంది బాధితులకు చికిత్స అందించేలా ప్రణాళికను రూపొందించారు. ఆయా కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేయడానికి ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి. గతంలో మాదిరిగానే వీటిని టిడ్కో గృహ సముదాయాల్లో ఏర్పాటు చేస్తున్నారు. అదే విధంగా సిబ్బంది నియామక ప్రక్రియ కూడా మొదలైంది.
గత ఏడాది కొవిడ్‌ తొలి దశలో గుంటూరు, తెనాలి, చిలకలూరిపేట, నర్సరావుపేట, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, బాపట్ల, గుండిమెడ ప్రాంతాల్లో మొత్తం పది కొవిడ్‌ కేర్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మే నెలలో ఇవి ప్రారంభమయ్యాయి. వీటిల్లో మొత్తం 5 వేల మంచాలను ఏర్పాటుచేశారు. జులై, ఆగస్టు నెలల్లో ఈ కేంద్రాలన్నీ బాధితులతో కిటకిటలాడాయి. దాదాపు 29 వేల మంది బాధితులు చికిత్స పొందారు. సుమారు 300 మంది వైద్యులు, సిబ్బంది విధులు నిర్వహించారు. కొద్ది నెలల తర్వాత కేసుల సంఖ్య తగ్గుతూ రావడంతో ఒక్కొక్కటిగా వీటిని మూసివేస్తూ తుదకు గత ఏడాది డిసెంబరులో మొత్తం కేంద్రాలను ఎత్తివేశారు. ఇప్పుడు తిరిగి వాటిని తెరవనున్నారు.

ఈ వారాంతంలో సేవలు అందుబాటులోకి..
కరోనా కేసులు పెరుగుతుండడంతో తిరిగి కొవిడ్‌ కేర్‌ కేంద్రాలను ఏర్పాటుచేయాలని జిల్లా ఉన్నతాధికారులు నిర్ణయించారు. తొలి దశలో జిల్లాలో మూడు చోట్ల వీటిని ప్రారంభిస్తున్నాం. ఆ మేరకు పనులు జరుగుతున్నాయి. ఈ వారాంతంలో ఈ కేంద్రాల్లో సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కేసుల సంఖ్యను అనుసరించి ఇతర  ప్రాంతాల్లోనూ వీటి ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంటాం.

- డాక్టర్‌ లక్ష్మానాయక్‌, కొవిడ్‌ కేర్‌ కేంద్రాల జిల్లా నోడల్‌ అధికారి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని