Published : 14/04/2021 03:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఉగాదీ వెళ్లిపోయింది.. వేతనాలు ఏవీ?

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: తెలుగు సంవత్సరాది ఉగాది పండగను ఆనందంగా చేసుకోవాలని భావించినా వేతనాలు విడుదలవకపోవడంతో రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకులాల ఉద్యోగులు మమ అనిపించాల్సిన పరిస్థితి. మార్చి నెలకు సంబంధించి వేతనాలు ఏప్రిల్‌ 13వ తేదీకి కూడా ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడ్డారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని ఉద్యోగులు వేతనాల కోసం నిరీక్షిస్తున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదని అంటున్నారు. నెలలో 1 నుంచి 5వ తేదీల్లో వేతనాలు బ్యాంకు ఖాతాల్లో జమయ్యేవని.. ఇప్పుడు మాత్రం ఎప్పుడు వేతనాలు అందుతాయో తెలియని పరిస్థితి నెలకొందని అంటున్నారు. ఉన్నతాధికారులు సైతం దీనిపై పెదవి విప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాపరిషత్తు, మున్సిపల్‌ పాఠశాలల ఉపాధ్యాయులు, ఉద్యోగులకు వేతనాలు జమ కాగా సంక్షేమ గురుకులాల ఉద్యోగులకు మాత్రం వేతనాలు జమ కాకపోవడాన్ని ఉద్యోగ సంఘాల నాయకులు ఎత్తి చూపుతున్నారు. గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు తీసుకున్న వారు నిర్ణీత గడువు లోపు కిస్తీలు చెల్లించాల్సి ఉండడంతో ఆందోళన చెందుతున్నారు. ఆయా తేదీల్లో కిస్తీలకు సంబంధించి నగదు ఖాతాల్లో లేకుంటే అపరాధ రుసుం వసూలు చేయడంతో పాటు సిబిల్‌ స్కోర్‌లో రుణాత్మక పాయింట్లు జమవుతాయి. భవిష్యత్‌లో ఏవైనా రుణాలు తీసుకోవాలంటే అప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయని ఉద్యోగులు భయపడుతున్నారు. దీని దృష్ట్యా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని వేతనాలు విడుదల చేసేలా చూడాలని కోరుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని