Published : 14/04/2021 03:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తల్లీకూతుళ్ల ఆత్మహత్య

దివ్యసాయిశ్రీ (దాచినచిత్రం)

పెదకూరపాడు, న్యూస్‌టుడే: పండగ పూట తల్లీకూతుళ్లు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. తీవ్ర విషాదాన్ని నింపిన ఈ సంఘటన పెదకూరపాడు మండలం ముస్సాపురం గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన నాగవర్దిని తన కుమార్తె దివ్యసాయిశ్రీని మేనల్లుడైన నాగసురేంద్రకు ఇచ్చి ఏడాది క్రితం వివాహం జరిపించింది. నాగసురేంద్ర సత్తెనపల్లిలో ఇనుము, సిమెంట్‌ విక్రయించే దుకాణంలో పనిచేస్తున్నాడు. దివ్యసాయిశ్రీకి చదువుపై ఉన్న ఆసక్తిని గుర్తించి సత్తెనపల్లిలోని ఒక ప్రైవేటు డిగ్రీ కళాశాలలో చేర్పించాడు. ఇటీవల ఆమె మరొకరితో సన్నిహితంగా మెలగడం భర్త దృష్టికి రావడంతో భార్యాభర్తల మధ్య కొన్ని రోజులుగా మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. ఈనెల 10న డిగ్రీ పరీక్షలకు హాజరైన దివ్యసాయిశ్రీ ఎంతకీ ఇంటికి రాకపోవడం, మరొకరితో ప్రేమ వ్యవహారం నెరుపుతూ...అతనితో వెళ్లిపోయినట్లు తెలుసుకున్న నాగసురేంద్ర తన అక్క నాగవర్దినికి విషయం తెలిపాడు. సోమవారం రాత్రి దివ్యసాయిశ్రీకి తల్లి నాగవర్దిని నచ్చచెప్పి గ్రామానికి తీసుకు వచ్చి కాపురం చక్కదిద్దుకోవాలని, ప్రస్తుతం వట్టి మనిషివి కూడా కాదంటూ మందలించింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరిగాయి. రాత్రివేళ డాబాపై నిద్రకు ఉపక్రమించిన తల్లీకూతుళ్లు నాగవర్దిని(40), దివ్యసాయిశ్రీ(20) తెల్లవారుజామున క్రిమిసంహారక మందు తాగి అచేతన స్థితిలోకి వెళ్లారు. నాగసురేంద్ర, అతని బాబాయి వెంకట్రావు ఇరువురినీ సత్తెనపల్లి ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. నాగసురేంద్ర  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పట్టాభిరామయ్య తెలిపారు. మృతదేహాలకు అమరావతి ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధుమిత్రులకు అప్పగించారు. పండగ పూట వీరి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని