Published : 14/04/2021 03:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కౌలు రైతు బలవన్మరణం

అమరావతి, న్యూస్‌టుడే: అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అమరావతిలో చోటు చేసుకుంది. సీఐ విజయ్‌కృష్ణ తెలిపిన వివరాల మేరకు పల్లపువీధికి చెందిన రైతు రాఘవరపు వెంకటేశ్వర్లు (38) 4 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని అందులో మిర్చి, పత్తి పంటలను సాగు చేశారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించక ఈ ఏడాది దిగుబడులు గణనీయంగా తగ్గాయి. గత మూడు సంవత్సరాల నుంచి పంటలు సరిగా పండకపోవడంతో అప్పులు వడ్డీలతో కలిపి రూ.8 లక్షలు అయ్యాయి. అప్పులు ఎలా తీర్చాలనే ఆవేదనతో వెంకటేశ్వర్లు సోమవారం అర్దరాత్రి ఇంట్లో దూలానికి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వెంకటేశ్వర్లుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు  మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు.

సంతానం కలగలేదని యువకుడు..
ఫిరంగిపురం గ్రామీణం, న్యూస్‌టుడే: సంతానం కలగలేదని రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఫిరంగిపురంలో జరిగింది. నరసరావుపేట రైల్వే పోలీసుల కథనం ప్రకారం... ఫిరంగిపురాకి చెందిన భీమిశెట్టి ఇన్నయ్య, ఇన్నమ్మ దంపతుల కుమారుడు ఫ్రాన్సిస్‌(27) గ్రామంలోని ఒక హోటల్‌లో పని చేస్తుంటాడు. గ్రామానికి చెందిన నిజయాతో మూడేళ్ల క్రితం వివాహమైంది. వారికి సంతానం కలగలేదు. కొన్నాళ్లుగా మనోవేదన పడుతున్నాడు. సోమవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు తిరిగి రాలేదు. ఫిరంగిపురం నిర్మల్‌ హృదయ్‌ అనాథ శరణాలయం వెనుక భాగాన రైలు పట్టాలపై ఫ్రాన్సిస్‌ మృతి చెంది పడి ఉన్నాడు. శరీరం ముక్కలుగా విడిపోయి ఉంది. రైలు కింద పడి ఉంటాడని భావించారు.  బంధువుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు నరసరావుపేట రైల్వే పోలీసులు తెలిపారు.

ప్రమాదవశాత్తు నిప్పంటుకుని వృద్ధుడి మృతి
తాడికొండ, న్యూస్‌టుడే: ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుని వృద్ధుడు మృతి చెందిన ఘటన మండలంలో మంగళవారం జరిగింది. తాడికొండ పోలీసుల కథనం ప్రకారం... మండలంలోని మోతడక గ్రామానికి చెందిన చుక్కా గుండయ్య(58)కు రెండు నెలల క్రితం పక్షపాతం వచ్చింది. అతని భార్య రెండేళ్ల క్రితం మరణించడంతో ఒంటరిగా ఉంటున్నాడు. మంగళవారం ఉదయం విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది. కొవ్వొత్తి వెలిగించే క్రమంలో జారి మంచంపై పడింది. మంటలు వ్యాపించాయి. వృద్ధుడి శరీరం కాలిపోయింది. చికిత్స నిమిత్తం 108 వాహనంలో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అదే రోజు సాయంత్రం గుండయ్య మృతి చెందాడు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని