Published : 14/04/2021 03:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రక్తదానం సామాజిక బాధ్యత

శిబిరాన్ని సందర్శిస్తున్న హోం మంత్రి సుచరిత

నగరంపాలెం, న్యూస్‌టుడే: ప్రతి ఒక్కరు రక్తదానాన్ని సామాజిక బాధ్యతగా గుర్తించాలని రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత పిలుపునిచ్చారు. స్థానిక ఆంధ్రక్రైస్తవ కళాశాల ఎదురుగా ఉన్న అంబేడ్కర్‌ భవన్‌లో ఆంధ్రప్రదేశ్‌ అంబేడ్కర్‌ యూత్‌ అసోసియేషన్‌(అపాయ్‌) వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ గోళ్లమూడి రాజసుందరబాబు, రెడ్‌క్రాస్‌ సొసైటీ, జీజీహెచ్‌ బ్లడ్‌ బ్యాంక్‌ సంయుక్త ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకొని మంగళవారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న హోంమంత్రి సుచరిత రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడుతూ గతంలో కరోనా సమయంలో రక్త నిల్వలు సరిపడా లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ప్రతి ఒక్కరు రక్తదానానికి ముందుకు రావాలని కోరారు. కరోనా నియంత్రణపై సీఎం జగన్‌ తీసుకుంటున్న చర్యలు బాగున్నాయన్నారు. సామాజిక బాధ్యతతో రాజసుందరబాబు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి రక్తనిధిని జీజీహెచ్‌ బ్లడ్‌ బ్యాంక్‌కు అందించడం అభినందనీయమన్నారు. నగర మేయర్‌ కావటి మనోహర్‌నాయుడు మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమన్నారు. జీజీహెచ్‌లో ఎంతో మంది రోగులు రక్త నిల్వలు లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో.. ఇలాంటి రక్తదాన శిబిరాల ద్వారా వారిని అదుకోవచ్చన్నారు. అపాయ్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు రాజసుందరబాబు మాట్లాడుతూ వివిధ మండలాల నుంచి అంబేడ్కర్‌ యువత రక్తదానం చేయడం సంతోషంగా ఉందన్నారు. అంబేడ్కర్‌ చెప్పిన విధంగా పే బ్యాక్‌ సొసైటీ అనే నినాదంతో శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో రెడ్‌ క్రాస్‌ సొసైటీ వైస్‌ ఛైర్మన్‌ పి.రామచంద్రరాజు, డాక్టర్‌ భాస్కరరావు, కె.సురేష్‌కుమార్‌, దళిత సంఘాల నాయకులు కర్రా హనోక్‌ బెంజిమెన్‌, ప్రభుతేజ, ప్రభాకర్‌, రాజు తదితరులు పాల్గొన్నారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని