Published : 07/05/2021 02:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రజా సహకారంతో పూర్తి నియంత్రణ

మాట్లాడుతున్న రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని. వేదికపై మంత్రులు పెద్దిరెడ్డి, పేర్ని నాని, వెలంపల్లి, కొడాలి నాని, ఎంపీ బాలశౌరి, కలెక్టర్‌ ఇంతియాజ్‌

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : కొవిడ్‌ మొదటి దశను సమర్థంగా ఎదుర్కొన్నాం, ప్రస్తుత రెండో దశ వ్యాప్తి ఆందోళనకరంగా ఉంది. ప్రభుత్వ చర్యలకు తోడు, ప్రజలు తమ సహకారం అందిస్తే కరోనాను పూర్తిగా నియంత్రించ గలుగుతామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని) వ్యాఖ్యానించారు. నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జిల్లా స్థాయి కరోనా నియంత్రణ చర్యలపై గురువారం సాయంత్రం ఆయన సమీక్షించారు. మంత్రి ఆళ్ల మాట్లాడుతూ.. జిల్లాలో ఐసీయూలో 745 పడకలు, నాన్‌-ఐసీయూలో 1,891 పడకలను ఆక్సిజన్‌ సదుపాయంతో ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రజా ప్రతినిధుల సూచనల మేరకు మరిన్ని ఆసుపత్రులకు ప్రాణ వాయువు, అత్యవసర మందుల సరఫరాపైనా దృష్టిపెట్టినట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో నిర్దేశించిన మార్గదర్శకాల అమలు విషయంలో జిల్లా స్థాయిలో పర్యవేక్షణ, సమీక్షలు చేస్తున్నట్టు చెప్పారు. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం సమర్థంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
వేర్వేరుగా కొవిడ్‌ పరీక్షలు, టీకా..
జిల్లాలోని పలు చోట్ల వ్యాక్సినేషను, కొవిడ్‌ నిర్ధారణ వైద్య పరీక్షలను ఒకే కేంద్రంలో చేస్తున్నారు. అలా కాకుండా వేర్వేరు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర సమాచార, రవాణా శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) సూచించారు. ప్రతి పీహెచ్‌సీ పరిధిలో నిర్ధారణ పరీక్షల కోసం ముందుగా ఐడీలు రూపొందించి, నమూనాలను సేకరించాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ కె.ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. ఆక్సిజన్‌ను పరిశ్రమలకు కాకుండా ఆరోగ్య పరమైన సేవలకే వినియోగించాలని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలిపారు. నైట్రోజన్‌ నుంచి ఆక్సిజన్‌ను తయారు చేసే ప్రక్రియపై దృష్టి సారిస్తున్నట్టు వివరించారు. ఎవరైనా ఔత్సాహికులు ఆక్సిజన్‌ జనరేటర్లు ఇచ్చేందుకు ముందుకు వస్తే, కస్టమ్స్‌ డ్యూటీపై 28 శాతం ఉన్న పన్ను 12 శాతానికి తగ్గిస్తామన్నారు. కలెక్టరు ఇంతియాజ్ మాట్లాడుతూ.. ప్రాణ వాయువు ప్రిపేర్డ్‌నెస్‌పై ప్రత్యేకాధికారుల బృందం జేసీ ఆధ్వర్యంలో పని చేస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం 4,545 పడకలు అందుబాటులో ఉన్నాయని, మరో 60 పడకలు అందుబాటులోకి రానున్నట్టు వివరించారు. ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కు 87 శాతం మేర వ్యాక్సినేషను పూర్తి చేసినట్టు తెలిపారు. సమీక్షలో మంత్రులు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), వెలంపల్లి శ్రీనివాసరావు, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, సామినేని ఉదయభాను, కొలుసు పార్థసారథి, దూలం నాగేశ్వరరావు, సింహాద్రి రమేష్‌, జోగి రమేష్‌, వసంత కృష్ణ ప్రసాద్‌, మేకా ప్రతాప వెంకట అప్పారావు, కొక్కిలిగడ్డ రక్షణనిధి, ఎం.జగన్మోహనరావు, వల్లభనేని వంశీ, కైలే అనిల్‌కుమార్‌, విజయవాడ మేయరు రాయన భాగ్యలక్ష్మి, ఎస్పీ రవీంద్రబాబు, జేసీలు కె.మాధవీలత, ఎల్‌.శివశంకర్‌, మోహనరావు, డీఎంహెచ్‌వో డాక్టరు సుహాసినీ, జీజీహెచ్‌ సూపరింటెండెంటు డాక్టరు కె.శివశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని