Published : 07/05/2021 02:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జగనన్న విద్యా కిట్లు సిద్ధం

ఇబ్రహీంపట్నం గ్రామీణం, న్యూస్‌టుడే

విద్యార్థులకు అందించిన జగనన్న విద్యాకిట్లు (దాచిన చిత్రం)

రానున్న విద్యాసంవత్సరంలో పాఠశాలలు పునఃప్రారంభం అయ్యే సమయానికి జగనన్న విద్యాకానుకను విద్యార్థులకు అందజేయనున్నారు. ఈ మేరకు జిల్లా సమగ్ర శిక్ష అధికారులు పాఠశాల సముదాయాలకు, మండల కేంద్రాలకు కిట్లను చేరుస్తున్నారు. ఇందులో ఏకరూప దుస్తుల వస్త్రం, బెల్టు, బ్యాగు, బూట్లు, సాక్సులను మండల వనరుల కేంద్రాలకు, పాఠశాలల సముదాయాలకు చేరవేయడం, పంపిణీ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా విద్యాశాఖ, సమగ్రశిక్ష అధికారులు సంబంధిత ఎంఈవోలకు, హెచ్‌ఎంలకు మర్గదర్శకాలు జారీ చేశారు. ఎంఈవోలు, పాఠశాలల సముదాయాల ప్రధానోపాధ్యాయులు జిల్లా స్థాయి నుంచి వచ్చే వస్తువుల నాణ్యత పరిశీలించడం, ఎన్ని అందాయన్న సమాచారాన్ని చెరవేయడం వంటి అంశాలపై కూడా తగు సూచనలు చేశారు.
అందించే వస్తువులు ఇవే..
ఒకటి నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఏకరూప దుస్తులు, బూట్లు, సాక్సులు, 1 నుంచి 5వ తరగతి విద్యార్థినులకు బెల్టు, 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు నోటు పుస్తకాలు, బాలురకు బెల్టు, 1 నుంచి 5వ తరగతి వరకు వర్క్‌బుక్స్‌ అందజేయనున్నారు. గతేడాది అన్ని వస్తువులు మండల కేంద్రాలకు చేరుకోగా ఈసారి యూనిఫారం వస్త్రం మండల వనరుల కేంద్రానికి, బూట్లు, సాక్సులు, బ్యాగులు, నోటు పుస్తకాలు పాఠశాలల సముదాయాలకు సరఫరా చేస్తున్నారు. జిల్లాలోని 3134 పాఠశాలలకు జగనన్న విద్యా కిట్లను పంపిణీ చేయనున్నారు. ఈ ఏడాది జనవరిలోనే విద్యార్థుల బూట్లు, సాక్సుల సైజులను సమగ్రశిక్ష ఆధ్వర్యంలో సేకరించారు. విద్యార్థుల సంఖ్యకు ఐదు శాతం అదనంగా కిట్లను అందజేస్తున్నారు.
పక్కాగా పంపిణీ..  
పాఠశాలలు తెరిచే సమయానికి జగనన్న విద్యాకిట్లు అందుబాటులోకి రానున్నాయి. ఎంఈవోలకు, పాఠశాలల సముదాయాల ప్రధానోపాధ్యాయులకు ప్రభుత్వ మార్గదర్శకాలను తెలియజేశాం. ప్రస్తుతం విద్యార్థుల సంఖ్యకు అదనంగా ఐదు శాతం పంపిణీ చేస్తున్నాం. ప్రాంతాల వారీగా అందజేయనున్నాం. పాఠశాలలు తెరిచిన తరువాత జరిగే నూతన విద్యార్థుల ప్రవేశాల సంఖ్యను సేకరించి వారికి ప్రత్యేకంగా జగనన్న విద్యాకానుకలను అందిస్తాం.

- వెంకటేశ్వరరావు, జిల్లా సీఎంవో, సమగ్రశిక్ష పథకం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని