నమ్మేస్తే ముంచేస్తారు
logo
Updated : 16/06/2021 04:41 IST

నమ్మేస్తే ముంచేస్తారు

కర్ఫ్యూలోనూ భారీగా సైబర్‌ మోసాలు

ఈనాడు, అమరావతి

లాక్‌డౌన్‌లోనూ సైబర్‌ నేరాలకు అడ్డుకట్ట పడడం లేదు. మరింత పెరుగుతున్నాయి. మోసగాళ్లు సరికొత్త పంథాలో ఊహించని రీతిలో బురిడీ కొట్టిస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఎదురవుతున్న ఆర్థిక సమస్యలను అధిగమించేందుకు కేటుగాళ్లు అనేక అడ్డదారులు వెతుకుతూ మోసాలకు పాల్పడుతున్నారు. బ్యాంకులకు వెళ్లే అవసరం లేకుండానే అంతర్జాలం, మొబైళ్లలో లావాదేవీలు చేసే వారి సంఖ్య అధికమైంది. సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. దీంతో పాటే వ్యక్తిగత సమాచారానికి కూడా భద్రత కొరవడుతోంది. ఫలితంగా బ్యాంకు ఖాతాలకు సంబంధించిన పలు విషయాలు తస్కరణకు గురవుతున్నాయి. దీని వల్ల ఖాతాల నుంచి అక్రమార్కులు డబ్బును మాయం చేస్తున్నారు. ఆన్‌లైన్‌ సేవలు నానాటికీ విస్తరిస్తున్న ఈ తరుణంలో భద్రత కొరవడింది. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా నిలువునా ముంచే ముఠాలు తయారయ్యాయి. ఇటీవల కాలంలో సైబర్‌ నేరాలు బాగా పెరిగాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వ్యవస్థీకృతంగా కార్యకలాపాలు సాగించే ముఠాలు సవాలు విసురుతున్నాయి. వీరి మోసాలకు నగరంలోని పలువురు మోసపోతున్నారు.

కొవిడ్‌ చికిత్స పేరుతో...

ఇటీవల విజయవాడ నగరంలోని ఓ వైద్యుడికి ఫేస్‌బుక్‌లో సందేశం వచ్చింది. తన విద్యార్థి ఒకరు కొవిడ్‌ బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, చికిత్స కోసం ఆర్థిక సాయం చేయమని.. స్నేహితుడి తండ్రి విన్నపం. దీంతో డాక్టర్‌ మానవతా దృక్పథంతో స్పందించి చెప్పిన ఖాతాకు రూ.50వేలు జమ చేశారు. ఈ విషయాన్ని మరుసటి రోజు ఫోన్‌ చేసి చెప్పారు. తాను డబ్బు పంపమని అడగలేదని, ఫేస్‌బుక్‌లో నకిలీ ఖాతా సృష్టించి పంపించి ఉంటారని చెప్పడంతో నిర్ఘాంతపోయారు. వెంటనే సైబర్‌ పోలీసుస్టేషనులో ఫిర్యాదు చేశారు. .ఇలా చాలా మంది ఇటీవల కాలంలో మోసపోయారు. ఆపదలో ఉన్నారేమోనని ఉడతా భక్తిగా సాయం చేసిన వారు, తర్వాత అసలు విషయం తెలుసుకుని నాలుక్కరుచుకుంటున్నారు. ఓటీపీ సాయంతో ఖాతాలోని నగదు బదిలీ చేయడంతో పాటు, ఓటీపీ అవసరం లేకుండానే డబ్బును మాయం చేస్తున్నారు. ఇలా పలు పద్ధతుల్లో అక్రమాలకు పాల్పడుతున్నారు. ఏమాత్రం అప్రమత్తంగా లేకుంటే కష్టార్జితాన్ని పోగొట్టుకున్నట్లే. ఓటీపీ తరహా నేరాలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి.

ఆన్‌లైన్‌లోనూ స్వీకరణ

విజయవాడలోని సైబర్‌ పోలీస్‌స్టేషన్‌కు రెండు నెలల క్రితం నుంచి సొంతంగా కేసులు నమోదు చేస్తున్నారు. గతంలో కమిషనరేట్‌ పరిధిలోని స్టేషన్లలో నమోదు అయ్యే కేసులు అక్కడే కట్టేవారు. విచారణ కూడా వాటి పరిధిలోకి వచ్చే న్యాయస్థానాల్లోనే సాగేది. దీనిని మార్చి నగరంలోని మూడో ఏసీఎంఎం కోర్టులో సైబర్‌స్టేషనులో నమోదు అయ్యే కేసులను విచారించనున్నారు. గత రెండు నెలల నుంచి సైబర్‌ స్టేషన్‌లోనూ ఫైల్‌ చేస్తున్నారు. కరోనా కారణంగా ఫిర్యాదుదారుల సౌకర్యం కోసం ఆన్‌లైన్‌లోనూ ఫిర్యాదులు తీసుకుంటున్నారు. సైబర్‌ స్టేషనులో పలువురు సిబ్బంది గత నెలలో కరోనా బారిన పడ్డారు. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫిర్యాదుల ఆధారంగా కేసులు నమోదు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని