బాధిత కుటుంబాలకు అండగా మిస్డ్‌కాల్‌ క్యాంపెయిన్‌
logo
Published : 16/06/2021 02:59 IST

బాధిత కుటుంబాలకు అండగా మిస్డ్‌కాల్‌ క్యాంపెయిన్‌


మాట్లాడుతున్న నెట్టెం రఘురాం

కరెన్సీనగర్‌, న్యూస్‌టుడే: కరోనా వంటి విపత్తు పరిస్థితుల్లో ప్రజల్లో భరోసా కల్పించాల్సిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వేలాది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారని విజయవాడ పార్లమెంటు తెదేపా అధ్యక్షులు నెట్టెం రఘురాం విమర్శించారు. విజయవాడ ఆటోనగర్‌లోని తెదేపా జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడారు. బాధ్యతాయుత ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందని, ఆ క్రమంలోనే కరోనా బాధిత కుటుంబాలకు ప్రభుత్వ పరిహారం దక్కేలా 81442 26661 నెంబరుతో ‘తెదేపా మిస్డ్‌కాల్‌ క్యాంపెయిన్‌’ చేపట్టిందన్నారు. కరోనా మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు, ఆక్సిజన్‌ కొరతతో మృతిచెందిన వారికి రూ.25లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పరీక్షల నుంచి నిర్ధారణ వరకు ప్రభుత్వం చెబుతున్న లెక్కలన్నీ బూటకమేనని పేర్కొన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం కరోనా బారిన పడి ఇప్పటి వరకు రాష్ట్రంలో 11882 మంది మరణించారని, ఈ సంఖ్య 80వేలకు పైగానే ఉందన్నది వాస్తవమని చెప్పారు. ఆక్సిజన్‌ మరణాలను ప్రభుత్వ దాస్తోందని, తిరుపతి రుయా ఘటనలో 31 మంది మృతిచెందారని తెదేపా ఆధారాలతో బయటపెడితే సమాధానం చెప్పలేని స్థితిలో జగన్‌ ప్రభుత్వం ఉందన్నారు. రెండో దశపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందస్తుగా హెచ్చరించినా, విపత్తును ఎదుర్కొనే ప్రణాళికలు లేకుండా జగన్‌ ప్రభుత్వం వ్యవహరించిన తీరు రాష్ట్రాన్ని కరోనాంధ్రప్రదేశ్‌గా మార్చేసిందని రఘురాం వ్యాఖ్యానించారు. ఇంతటి విషమ పరిస్థితుల్లో కుల, మత, ప్రాంతాల వారీగా ప్రజలను విభజించడం, ప్రత్యర్థి పార్టీలపై కేసులు పెట్టి వేధించడమే పనిగా ముఖ్యమంత్రి జగన్‌ వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఇకనైనా పాలనపై దృష్టి సారించాలని హితవు పలికారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని