చెత్త సమస్యలకు చెక్‌
logo
Published : 16/06/2021 03:39 IST

చెత్త సమస్యలకు చెక్‌

వ్యర్థాల సేకరణ, తరలింపునకు కొత్త విధానం

రూ.15.40 కోట్లతో ఐదు ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్ల నిర్మాణం

విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే

నగరంలోని చెత్త, ఇతర వ్యర్థాల సేకరణ, తరలింపులో సమస్యలు నివారించి, మరింత సులువుగా చేసేందుకు విజయవాడ నగరపాలక సంస్థ ప్రత్యేక చర్యలు చేపడుతుంది. ఇందుకు నగరంలోని 5 ప్రాంతాల్లో కొత్తగా చెత్త ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్లను నెలకొల్పేందుకు నిర్ణయించింది. వీటి నిర్మాణానికి రూ.15.40 కోట్లు వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. దీనికి పరిపాలనా ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపారు.

మూడు నియోజకవర్గాల పరిధిలో..

ప్రభుత్వ ఆమోదం లభించిన వెంటనే నగరంలో మూడు నియోజకవర్గాల పరిధిలోని వ్యర్థాల సేకరణ, తరలింపునకు అనువుగా వీటిని నిర్మిస్తారు. ప్రధానంగా రామలింగేశ్వరనగర్‌ ఎస్టీపీ ప్లాంటు, భవానీపురం హౌసింగ్‌బోర్డుకాలనీ, జక్కంపూడికాలనీ ఎస్టీపీ ప్లాంటు, ఆటోనగర్‌ పాత ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌ ఏరియా వంటి ప్రాంతాల్లో ముందుగా నెలకొల్పుతారు. తర్వాత అజిత్‌సింగ్‌నగర్‌లో అధునాతన పద్ధతిన నూతన ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌ను నెలకొల్పనున్నారు. నగరంలో నిత్యం ఉత్పత్తి అవుతున్న 550 మెట్రిక్‌ టన్నుల వ్యర్థాలను తేలిగ్గా డంపింగ్‌ యార్డుకు చేర్చడంతోపాటు, కాలుష్య కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకుంటారు.

ఇబ్బందులు తీరేలా..

ఇప్పటి వరకు నగరంలోని సింగ్‌నగర్‌, ఆటోనగర్‌ ప్రాంతాల్లో మాత్రమే చెత్తట్రాన్స్‌ఫర్‌ స్టేషన్లు ఉన్నాయి. అక్కడ చెత్తను తరలించే సందర్భంలో సమీప ప్రాంతాలు వ్యర్థాలతో నిండిపోతున్నాయి. మరోవైపు దుర్వాసన, కాలుష్యం వంటివి తప్పడం లేదు. కొత్తగా అందుబాటులోకి తేనున్న ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్ల ద్వారా ఈ ఇబ్బందులు తప్పనున్నాయి. మరోవైపు ఇంటింటా చెత్తసేకరణ కూడా త్వరితగతిన చేపట్టేందుకు వీలు కలుగుతుందని చెబుతున్నారు. వీటిని సాధ్యమైనంత త్వరగా పట్టాలెక్కించి, నగరంలోని చెత్తసమస్య పరిష్కారానికి చెక్‌పెట్టడంతోపాటు, కాలుష్యాన్ని కట్టడి చేయడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రత్యేక కంటెయినర్లు

ప్రాజెక్టును పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు ప్రత్యేక కంటెయినర్లను అందుబాటులోకి తేనున్నారు. వీటిలో వ్యర్థాలు బయటకు కనిపించకుండా ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌కు తరలిస్తారు. అక్కడ ప్రత్యేకంగా అమర్చిన ర్యాంపుపైకి వాహనాన్ని ఎక్కించి, కింద భాగంలోని ప్రత్యేక రంధ్రం ద్వారా హుక్‌లోడర్‌, కంపాక్టు వాహనంలోకి చేరుస్తారు. తర్వాత వీటిని నేరుగా డంపింగ్‌ యార్డుకు తరలిస్తారు. ఫలితంగా సేకరించి తెచ్చిన వ్యర్థాలను డంపింగ్‌యార్డులో బహిరంగంగా పడేందుకు, వ్యర్థకాలుష్యానికి అవకాశం ఉండదని అధికారులు భావిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని