‘ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితోనే రోడ్లపైకి కార్మికులు’
logo
Published : 16/06/2021 03:39 IST

‘ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితోనే రోడ్లపైకి కార్మికులు’


జీఎంసీ ఎదుట ఐకాస ఆధ్వర్యంలో కార్మిక సంఘాల ధర్నా

నగరపాలకసంస్థ (గుంటూరు), న్యూస్‌టుడే: మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణక్ష్య ధోరణితో ఉన్నందునే కార్మికులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఏపీ మున్సిపల్‌ ఉద్యోగ, కార్మిక సంఘాల ఐకాస రాష్ట్ర కన్వీనర్‌ కె.ఉమామహేశ్వరరావు అన్నారు. సమస్యల పరిష్కారం కోసం వివిధ కార్మిక సంఘాలు చేస్తున్న సమ్మెలో భాగంగా మంగళవారం జీఎంసీ ఎదుట ధర్నా నిర్వహించారు. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కరోనాతో మరణించిన ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు కేంద్ర ప్రభుత్వం రూ.50 లక్షలు బీమా ఇస్తామని ప్రకటించిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 80 మంది కార్మికులు మృతి చెందినా వారందరికీ ఎలాంటి న్యాయం జరగలేదన్నారు. కార్మికులకు కాళ్లు కడగటం, పూలు చల్లడం, చప్పట్లు కొట్టడం వల్ల ఒరిగేదేమీ లేదన్నారు. కార్మికులకు, స్వీపర్లకు నాలుగేళ్లుగా జీతాలు పెంచలేదని, పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసర సరకుల ధరలు మాత్రం పెరుగుతున్నాయని విమర్శించారు. జీఎంసీ ఇంజినీరింగ్‌, పట్టణప్రణాళిక, పారిశుద్ధ్య కార్మిక ట్రేడ్‌ యూనియన్‌ అధ్యక్షుడు ఇ.మధుబాబు మాట్లాడుతూ ఆప్కాస్‌లో కార్మికులను విలీనం చేశాక హక్కులన్నీ తొలగించారన్నారు. కార్మికుల సమస్యలు నెలాఖరులోగా పరిష్కరించకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని.. అవసరమైతే నిరవధిక సమ్మెకు దిగేందుకు వెనుకాడేదిలేదని హెచ్చరించారు. గుంటూరు మున్సిపల్‌ పారిశుద్ధ్య ఒప్పంద కార్మికుల సంఘం అధ్యక్షుడు సోమి శంకరరావు మాట్లాడుతూ మున్సిపల్‌ కార్మికులను ఆప్కాస్‌ నుంచి మినహాయించి వారి సేవల్ని క్రమబద్ధీకరించాలని, కార్మికులకు 11వ పీఆర్‌సీ వర్తింపజేయాలని, ఆరోగ్య భృతి, సమ్మె కాలం జీత బకాయిలు విడుదల చేయాలన్నారు. ఏపీ మున్సిపల్‌ ఉద్యోగ, కార్మిక సంఘం (సీఐటీయూ) జిల్లా అధ్యక్షుడు బి.ముత్యాలరావు, గుంటూరు నగరపాలక సంస్థ యూజీడీ కార్మిక సంఘం అధ్యక్షుడు మేకతోటి రామదాస్‌, సంఘాల నాయకులు సోమి ఉదయ్‌కుమార్‌, పేటేటి యాకోబు, శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, వినోద్‌, కోటిబాబు, ప్రేమ్‌చంద్‌, సుమన్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని