నేనేం పాపం చేశాను!?
logo
Published : 16/06/2021 03:39 IST

నేనేం పాపం చేశాను!?

వదిలి వెళ్లిన తల్లి...

చికిత్స పొందుతూ పసికందు మృతి

 

‘నవ మాసాలు తల్లిగర్భంలో హాయిగా ఉన్నాను. బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టాలని అందరిలాగే ఎంతో ఆశపడ్డాను. భూమి మీదకు రావడానికి అనారోగ్యంతో రోజుల తరబడి పోరాడాను. వైద్యులు నాకోసం తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయింది. తల్లి పొత్తిళ్లల్లో నిద్రపోవాల్సిన నేను మరణశయ్యపై పడి ఉన్నాను. తొమ్మిది రోజులకే నూరేళ్లు నిండాయి. ఇలాంటి పరిస్థితుల్లో అనాథలా నా మృతదేహాన్ని ఆసుపత్రిలో వదిలేయడం న్యాయమా!? నేనేం పాపం చేశానని నాకు ఇంత శిక్షవేశారు’

- ఓ పసికందు ఆత్మఘోష!.

నెహ్రూనగర్‌, న్యూస్‌టుడే : అనారోగ్య సమస్యల కారణంగా మృత్యువుతో పోరాడుతూ తొమ్మిది రోజుల మగ శిశువు మృతి చెందాడు. కారణమేమోగానీ నవ మాసాలు మోసిన తల్లి ఆ పసికందుని ఆస్పత్రిలో పడకపైనే వదిలి వెళ్లింది. ఈ హృదయవిదారకర ఘటన గుంటూరు జీజీహెచ్‌లో చోటుచేసుకుంది. దీనిపై కొత్తపేట పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం ఓ గర్భిణి ప్రసవం కోసం ఈ నెల 6న జీజీహెచ్‌లో చేరింది. తన పేరు కె.చెంచమ్మ, పశ్చిమగోదావరి జిల్లా, ఏలూరు అని తెలిపింది. ఆమె 7న మగ బిడ్డకు జన్మనిచ్చింది. అనారోగ్య సమస్యలతో ఉన్న ఆ పసికందుకు వైద్యులు చికిత్స అందించారు. ఆ సమయంలో దగ్గరుండాల్సిన తల్లి 12న శిశువును వదిలిపెట్టి వెళ్లిపోయింది. ఆమె ఆచూకీ కోసం ఆరా తీస్తూనే ఆ పసికందును బతికించడానికి వైద్యులు వారం రోజులు తీవ్రంగా శ్రమించారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం మృతి చెందాడు. కాన్పునకు చేరిన సమయంలో ఆమె పేరు, ఊరు తప్ప ఇతర వివరాలేమీ ఇవ్వలేదు. వైద్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. పసికందు మృతదేహాన్ని జీజీహెచ్‌ శవాగారంలో భద్రపరిచారు. శిశువు సంబంధీకులు కొత్తపేట స్టేషన్‌లో0863-22218185, 99634 83601 సంప్రదించాలన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని