ఏవీ ఔషధాలు?
logo
Published : 16/06/2021 03:39 IST

ఏవీ ఔషధాలు?

పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో అందని  సేవలు

ఈనాడు, అమరావతి


మల్లికార్జునపేట ఆరోగ్య కేంద్రంలోని ఫార్మసీ గదిలో మందులు లేక ఖాళీగా కనిపిస్తున్న బాక్సులు

నగరంలో ముఖ్యమంత్రి పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు వైద్యసేవలు అందడం లేదు. కనీసం మాత్రలు కూడా ఇవ్వడం లేదు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు అటకెక్కాయి. రక్త పరీక్షలు మాత్రమే మొక్కుబడిగా చేస్తున్నారు. రోగులు బీపీ, షుగర్‌ పరీక్షలు చేసి మందులు ఇవ్వాలని కోరుతుంటే బీపీ ఆపరేటర్‌ లేరని, ఔషధాలు సైతం లేవని సిబ్బంది సమాధానమిస్తున్నారు. మొత్తం మీద నగరవాసులకు ఈ కేంద్రాల ద్వారా వైద్యసేవలు అందని ద్రాక్షే అవుతున్నాయి.

గుంటూరు జీజీహెచ్‌పై రోగుల రద్దీని తగ్గించడానికి నగరంలో 13 ముఖ్యమంత్రి పట్టణ ఆరోగ్య కేంద్రాలు నెలకొల్పారు. వీటికి అదనంగా మరో 17 ఏర్పాటు చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన 17 కేంద్రాల్లో ఇంకా సేవలు అందుబాటులోకి రాలేదు. పాత 13 కేంద్రాల నిర్వహణ, వైద్యసేవల బాధ్యతలను ప్రభుత్వం విధానంలో అపోలోకు అప్పగించింది. ఆ సంస్థతో చేసుకున్న ఒప్పందం ఈ ఏడాది మార్చితో ముగిసింది. అప్పటి నుంచి ప్రతినెలా ఆ సంస్థను సేవలు అందించాలని ప్రభుత్వం కోరుతోంది. ఎలాగూ నిర్వహణ బాధ్యతల నుంచి వైదొలుగుతామని ఆ సంస్థ సైతం సరిగా పట్టించుకోవడం లేదనే అపవాదు ఉంది. ప్రస్తుతం 13 పట్టణ ఆరోగ్య కేంద్రాలను శాశ్వత టీకా కేంద్రాలుగా మార్చారు. ఒకవైపు వ్యాక్సినేషన్‌, మరోవైపు సాధారణ వైద్యసేవలు వాటిల్లో అందించాలి. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఆయా కేంద్రాల్లో టీకా వేసే కార్యక్రమం ఒక్కటే సజావుగా జరుగుతోంది. జ్వరం, తలనొప్పితో బాధపడుతూ వాటి గుమ్మం తొక్కుతున్నవారికి కూడా ఇచ్చే పరిస్థితి లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మల్లిఖార్జునపేట, మంగళదాస్‌నగర్‌ కేంద్రాల్లో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఈ రెండు కేంద్రాల పరిధిలో అనేక మురికివాడలు, పేదల నివాసిత ప్రాంతాలు ఉన్నాయి. వీరికి జీజీహెచ్‌కు వెళ్లాలన్నా దూరాభారం కావడంతో చాలా వరకు ఆ ప్రాంతాల వాసులు పట్టణ ఆరోగ్య కేంద్రాలకే వెళ్తున్నారు. ఈ రెండు చోట్ల వ్యాధి నిర్ధారణ పరీక్షలు అటకెక్కాయి. ఫార్మసీ గదుల్లో మందుల నిల్వలు లేవు. అక్కడ పనిచేసే సిబ్బందే తమ వద్ద మందులు లేవని, ఖాళీ అయిన మందుల బాక్సులను చూపిస్తున్నారు. ఇలాంటి దుస్థితిలో పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి.

ముఖ్యమంత్రి పట్టణ ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుతో జీజీహెచ్‌కి రోగుల తాకిడి తగ్గుతుందని వైద్య యంత్రాంగం పేర్కొంది. ఈ కేంద్రాల్లో వైద్యసేవలు లోపించడంతో వీరంతా ప్రతి చిన్న రోగానికి జీజీహెచ్‌కే వస్తున్నారు.


టీకా, రక్త పరీక్షల కోసం వచ్చిన ప్రజలు

మందులు లేవు.. మల్లికార్జునపేట పట్టణ ఆరోగ్య కేంద్రంలో మందుల గురించి ఆరా తీయటానికి ‘ఈనాడు’ ప్రతినిధి వెళ్లగా ఫార్మసీ గదిలో మందులు లేవు. ఇదేమని అడిగితే ఇండెంట్‌ పెట్టామని, మందులు రాలేదని సిబ్బంది సమాధానమిచ్చారు. బీపీ పరీక్షించాలని కోరితే బీపీ ఆపరేటర్‌ లేదని సమాధానమిచ్చారు. పలువురు రోగులు దగ్గు మందు, జ్వరం టాబ్లెట్లు అడిగితే అసలేం లేవన్నారు.

స్వయంగా పరిశీలిస్తా..

- డాక్టర్‌ చుక్కా రత్న మన్మోహన్‌, జిల్లా ప్రాజెక్టు మేనేజరు, ఎన్‌హెచ్‌ఎం విభాగం

ఆయా కేంద్రాలను స్వయంగా తనిఖీ చేసి మందుల నిల్వల గురించి తెలుసుకుంటా. తక్షణమే సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్స్‌ నుంచి కొన్ని మందులను సమీకరించుకుని రోగులకు పంపిణీ చేస్తాం. తప్పనిసరిగా సాధారణ వైద్య సేవలు కోరుతూ వచ్చేవారికి టాబ్లెట్లతో పాటు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయాలి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని