ఆదమరిస్తే ప్రాణాలకు షాక్‌!
logo
Published : 16/06/2021 03:39 IST

ఆదమరిస్తే ప్రాణాలకు షాక్‌!

ఈనాడు, అమరావతి


పిచ్చిరెడ్డి, విజయలక్ష్మి మృతదేహాలు (పాత చిత్రాలు)

పీవీ పాలెం మండలం భవనంవారిపాలెంలో మే 19న రైతు సీహెచ్‌ పిచ్చిరెడ్డి(55) విద్యుదాఘాతానికి గురై మృత్యువాతపడ్డారు. పచ్చి మిరపతోటకు నీరు పెట్టడానికి వెళ్లి విద్యుత్తు ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనపై పోలీసు కేసు నమోదైంది. విద్యుత్తుశాఖ అధికారులు వివరాలు నమోదు చేసుకుని సాయం మంజూరు కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించారు. ఇదే మండలం జీఎన్‌పాలేనికి చెందిన గుడిపల్లి విజయలక్ష్మి(53) మే 25న మామిడిపండ్లు కోయటానికి తోటకు వెళ్తుండగా పొలాల్లో తెగిపడిన తీగపై కాలు వేయడంతో ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయింది. విద్యుత్తు శాఖ అధికారులు ఉన్నతాధికారులకు పరిహారం కోసం ప్రతిపాదనలు పంపారు. రెండు కుటుంబాలకు సాయం అందాల్సి ఉంది.

జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో తరచూ విద్యుత్తు ప్రమాదాలు జరిగి ప్రజలు, పశువుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. దశాబ్దాల కింద వేసిన తీగలు, నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో ఈదురుగాలులు, వర్షాలకు తీగలు తెగి ప్రమాదాలు జరుగుతున్నాయి. మెరుపుల వల్ల ఇన్సులేటర్లు కాలిపోయి తీగలు తెగుతున్న సందర్భాలు ఉన్నాయి. నేల మీద పడిన తీగలను పనులకు వెళ్లే హడావుడిలో రైతులు తాకడంతో విద్యుదాఘాతానికి గురై మృత్యువాత పడుతున్నారు. అప్పటివరకు అందరితో కలిసి ఉన్నవారు క్షణాల వ్యవధిలో చనిపోవడంతో కుటుంబ సభ్యుల వేదన వర్ణనాతీతం. పొలాలకు మేతకు వెళ్లిన పశువులు తెగి పడిన విద్యుత్తు తీగల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నాయి. రూ.వేలు వెచ్చించి కొనుగోలు చేసిన పాడిపశువులు చనిపోతే రైతుకు తీరని శోకం మిగులుతోంది. ప్రభుత్వం ఇచ్చే పరిహారం సకాలంలో అందక బాధితులు అష్టకష్టాలు పడుతున్నారు. విద్యుత్తు శాఖ అధికారులు అడిగిన పత్రాలు అందించడానికి నెలల సమయం పడుతోంది. విద్యుత్తుపై రైతులకు అవగాహన లేకపోవడం వల్ల కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రకృతి విపత్తుల వల్ల జరిగే విద్యుత్తు ప్రమాదాల్లోనూ ప్రజలు చనిపోతున్నారు.

కారణాలివే..

* వేసవిలో విద్యుత్తు తీగల్లోని అల్యూమినియం కరిగే స్థాయికి వచ్చి సామర్థ్యం తగ్గుతుంది. ఆ సమయంలో వర్షం పడితే తీగలు తెగిపోతున్నాయి.

* పొలాల్లో వాడే త్రీఫేజ్‌ మోటార్లకు ఎర్తింగ్‌ చేసుకోవడం లేదు. దీనివల్ల తరచూ స్టార్టర్ల వద్ద విద్యుత్తు షాక్‌కు గురై రైతులు చనిపోతున్నారు. ● విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగితే రైతులే ఏబీ స్విచ్‌లు ఆపి హెచ్‌బీ ఫ్యూజులు వేసే క్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయి.

* విద్యుత్తు నియంత్రికలు(ట్రాన్స్‌ఫార్మర్‌) వద్ద సెక్షన్‌ ఫ్యూజులకు నిర్దేశించిన గేజ్‌ కంటే ఎక్కువగా ఉన్న తీగలను వేయడం వల్ల తీగలు తెగినా ఫ్యూజు పోక పోవడంతో సరఫరా కొనసాగి ప్రమాదాలు జరుగుతాయి. * 100కేవీ సామర్థ్యం ఉన్న నియంత్రిక వద్ద 14గేజ్‌ తీగ రెండు వరుసలు వేయాలి. అయితే జీరో కాపర్‌ లేదా కండక్టర్‌లోని తీగతో వేయడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ●* వర్షాలు పడేటప్పుడు ఇనుప స్తంభాలు ఉన్నచోట తీగ(కండక్టర్‌)లోని లీడ్‌ బయటకు వస్తే ఆ లీడ్‌ ద్వారా స్తంభాలకు విద్యుత్తు సరఫరా కావడంతో ప్రమాదాలు జరుగుతాయి. * గృహవిద్యుత్తు సర్వీసులకు ఎర్తింగ్‌ చేసుకోవడం లేదు. దీనివల్ల తీగల్లో సరఫరా తేడా వల్ల కరెంటు న్యూట్రల్‌లోకి వెళుతోంది. దానిని పట్టుకున్నప్పుడు షాక్‌ తగులుతోంది. ●* దశాబ్దాల తరబడి తీగలు మార్చడం లేదు. గుంటూరు నగరం బ్రాడీపేటలో ఇప్పటికీ 50ఏళ్ల కింద వేసిన ఎల్‌టీ లైన్లు ఉన్నాయి. వీటివల్ల తరచూ సరఫరాకు అంతరాయం కలుగుతోంది. ●* నగరాలు, పట్టణాల్లో నియంత్రికల వద్ద ప్రతి మూడు నెలలకు ఒకసారి ఎర్తింగ్‌ తనిఖీ చేసి బాగు చేస్తారు. గ్రామాల్లో ఈ పరిస్థితి లేకపోవడం వల్ల ఎర్తింగ్‌ సక్రమంగా లేక ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి.

ఇద్దరికే పరిహారం

జిల్లాలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో 58 విద్యుత్తు ప్రమాదాలు జరిగి 39 మంది చనిపోయారు. ఇందులో ఇప్పటివరకు ఇద్దరికి మాత్రమే పరిహారం అందింది. డివిజన్‌ నుంచి ఉన్నతాధికారులకు నివేదికలు రాలేదు. అదేవిధంగా 21 విద్యుత్తు ప్రమాదాల వల్ల 28 జంతువులు చనిపోగా ఇందులో 13 ప్రమాదాలకు సంబంధించిన వివరాలు ఉన్నతాధికారులకు అందలేదు. మనుషులకు రూ.5లక్షలు, పశువులకు పశువైద్యులు ఇచ్చే నివేదిక ఆధారంగా పరిహారం చెల్లిస్తారు. విద్యుత్తు వల్ల మృతి చెందినట్లు శవపరీక్ష నివేదిక ఉన్న వారికే పరిహారం అందుతోంది. ఎఫ్‌ఐఆర్‌, పోస్టుమార్టం నివేదిక ఇతర వివరాలు సేకరించడానికి బాధిత కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి.

లోపాలు సరిచేసి ప్రమాదాలు అరికడతాం

జిల్లాలో విద్యుత్తు తీగలు ప్రమాదకరంగా ఉన్న ప్రాంతాల్లో వెంటనే మరమ్మతు చేసేలా ఆయా ఈఈలకు ఆదేశాలిస్తాం. నగరంలో ట్రాన్స్‌ఫార్మర్లకు రక్షణ లేని ప్రాంతాల్లో రక్షణ చర్యలు తీసుకుంటాం. విద్యుత్తు ప్రమాదాలకు గురై మృతిచెందిన వారికి నిబంధనల మేరకు పరిహారం అందేలా చూస్తాం.

- మురళీమోహన్‌, పర్యవేక్షక ఇంజినీరు, విద్యుత్తు శాఖ, గుంటూరు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని