చూసి మురవ.. చెప్పుకొని ఏడవ..
eenadu telugu news
Published : 29/07/2021 04:41 IST

చూసి మురవ.. చెప్పుకొని ఏడవ..

నిర్మాణం పూర్తయినా నిరీక్షణే

ఈనాడు, అమరావతి

ఈ చిత్రంలోని భవనాలను చూశారా..! పేదల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన నిర్మాణాలు. జీప్లస్‌3 అంతస్తులు నిర్మాణం చేశారు. భవనం అంతా పూర్తయింది. ఇంకా విద్యుత్తు, మంచినీరు, డ్రైనేజీ సౌకర్యం కల్పిస్తేచాలు నివాసం ఉండవచ్ఛు అందమైన రంగులు వేశారు. రహదారులు నిర్మాణం చేయాలి. గత రెండేళ్లుగా వీటిలో పురోగతి లేదు. రంగులు మాత్రం అధికార పార్టీని తలపించే విధంగా ఏర్పాటు చేశారు. ఇవి గుడివాడలో టిడ్కో సంస్థ చేపట్టిన నిర్మాణాలు.  గత రెండేళ్లుగా లబ్ధిదారులకు కేటాయించకుండా అసంపూర్తిగా వదిలేశారు.

ఇవి విజయవాడ నగరంలోని పేదలకు అందరికీ ఇళ్లు పథకం కింద టిడ్కో చేపట్టిన గృహాలే. జక్కంపూడి వద్ద కొండను తొలిచి మరీ నిర్మాణం చేశారు. కొన్ని పూర్తయ్యాయి. కొన్ని మధ్యలోనే వదిలేశారు. కొన్ని పునాదుల స్థాయిలో ఉన్నాయి. మొత్తం 137 బ్లాక్‌లు నిర్మాణం చేస్తున్నారు. చాలా వరకు పూర్తయ్యాయి. ఇంకా మంచినీరు, విద్యుత్తు, డ్రైనేజీ సౌకర్యం కల్పిస్తే.. నివాసం ఉండవచ్ఛు కానీ గత కొంతకాలంగా నిర్మాణాలు నిలిపివేశారు. నిధులు లేక నిలిచిపోయాయో, ప్రభుత్వమే నిలిపివేసిందో తెలియని పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ భద్రత లోపించింది. అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది.

జిల్లాలో పెడన పట్టణం మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో టిడ్కో ఇళ్ల పరిస్థితి ఇంచుమించు ఇదేవిధంగా ఉంది. కొన్నిచోట్ల సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. కొన్నిచోట్ల పట్టించుకునే నాధుడే లేడు. షియర్‌వాల్‌ టెక్నాలజీతో నిర్మాణం చేయడం వల్ల గుమ్మాలు, కిటికీలు దొంగతనానికి అవకాశం లేకుండా పోయింది. విద్యుద్దీకరణ ఏర్పాటు చేయకపోవడం, తలుపులు ఇంకా ఏర్పాటు చేయకపోవడంతో నివాసానికి అనువుగా లేవు. జిల్లాలో 27,872 ఇళ్లను మాత్రమే టిడ్కో నిర్మాణం చేస్తోంది. ఇవి మాత్రమే లబ్ధిదారులకు కేటాయించనుంది. వీటిలో కొన్ని నిర్మాణం పూర్తికాగా, కొన్ని పునాదుల దశ దాటలేదు. మౌలిక వసతుల కల్పన నిలిచిపోయింది. ఎప్పటికి పూర్తి అవుతాయో తెలియని పరిస్థితి. మరోవైపు వీటికి బ్యాంకుల నుంచి రుణం కూడా మంజూరైంది. జిల్లాకు ఘనంగా దాదాపు 91వేల ఇళ్లు మంజూరైనా.. మూడోవంతు మాత్రమే నిర్మాణం చేస్తున్నారు. ప్రముఖ కంపెనీలు ఎల్‌అండ్‌టీ, ఎన్‌సీసీ వాటి నిర్మాణం చేపట్టాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా అఫర్డబుల్‌ ఇళ్ల నిర్మాణం చేపట్టింది. పట్టణ ప్రాంతాల్లో వివిధ కేటగిరీల కింద ఇళ్ల నిర్మాణం చేపట్టారు. దీని కోసం టిడ్కో (ఏపీ పట్టణ మౌలిక వసతుల సదుపాయాల సంస్థ) ఏర్పాటు చేసి నిర్మాణ, పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించింది. 300 చదరపు అడుగులు, 365 చ.అ., 430 చ.అ. విస్తీర్ణంతో చేపట్టారు. మూడో కేటగిరి డబుల్‌ బెడ్‌రూం ఇళ్లుగా ఉంటాయి.


గుడివాడలో రహదారి లేని గృహసముదాయాలు

జిల్లాకు అఫర్డబుల్‌ హౌసింగ్‌ స్కీం (ఏహెచ్‌పీ) కింద 91,138 ఇళ్లు మంజూరు కాగా 49489 టెండర్లు పిలిచి పనులు అప్పగించారు. దీనిలో 37,950 ఇళ్ల నిర్మాణం 2019లో చేపట్టాయి. ప్రభుత్వం మారిన తర్వాత వాటి నిర్మాణం నిలిపివేసింది. రివర్స్‌ టెండర్లంటూ జాప్యం చేసింది. దీంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు నిలిచిపోయాయి. నందిగామలో మాత్రం 240 ఇళ్లు పూర్తయి గృహప్రవేశాలకు సిద్ధంగా ఉన్నాయి. గుడివాడలో దాదాపు 3312 ఇళ్లు నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. విజయవాడ జక్కంపూడి కాలనీలో భారీ ఎత్తున అయిదు దశల్లో దాదాపు 55వేల ఇళ్ల నిర్మాణం చేపట్టాలనేది లక్ష్యం. వీటికి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అలాట్‌మెంట్‌ పత్రాలు కూడా అందజేశారు. దాదాపు 3వేల గృహాలు నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. ప్రవేశాలకు సిద్ధంగా ఉన్నాయి. జిల్లాలో దాదాపు రూ.4,677.11 కోట్లతో ఈ ఏహెచ్‌పీ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారు.

విద్యుద్దీకరణ, ముగరుగు నీటి పారుదల వ్యవస్థ, నీటిసరఫరా వ్యవస్థ, అంతర్గత రోడ్ల నిర్మాణం వరదనీటి కాలువలను నిర్మాణం చేపట్టాల్సి ఉంది. పట్టణాలకు చివర నిర్మాణం చేసిన ఈ జీప్లస్‌3 అంతస్తులు ఆకర్షణీయంగా ఉన్నాయి. నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు కేటాయించకపోవడంపై తెదేపా ఆందోళనలు చేసింది. ప్రస్తుతం గుడివాడ, బందరు పట్టణాల్లో నిర్మాణం కొనసాగిస్తున్నారు.

నిర్మాణం పూర్తి చేస్తున్నాం.. - చిన్నోడు, ఈఈ, టిడ్కో

జిల్లాలో 27,872 ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. వీటిని త్వరగా పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. కొన్ని 25శాతం లోపు పూర్తయిన వాటిని గత ఏడాదిగా నిర్మాణం నిలిపివేసిన విషయం తెలిసిందే. గుడివాడ, బందరులో రివర్స్‌ టెండర్‌ నిర్వహించి అప్పగించాం. మౌలిక వసతులు కల్పించాల్సి ఉంది. వీటికి అంచనాలు తయారు చేసి పంపించాం. వీటిని ఆమోదించి టెండర్లకు వెళ్లాల్సి ఉంది. టెండర్లను ఖరారు చేసిన తర్వాత మౌలిక వసతులు కల్పిస్తాం. మరోవైపు బ్యాంకు రుణం కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. లబ్ధిదారులను జియో ట్యాగింగ్‌ చేసి బ్యాంకు రుణం ఇప్పించే ఏర్పాట్లు మెప్మా ఆధ్వర్యంలో జరుగుతోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని