ఇకపై ప్రధాన రైతుబజార్లలోనే కూరగాయల విక్రయాలు
eenadu telugu news
Published : 29/07/2021 04:41 IST

ఇకపై ప్రధాన రైతుబజార్లలోనే కూరగాయల విక్రయాలు

న్యూస్‌టుడే, తెనాలిటౌన్‌: కొవిడ్‌ రెండో దశ కట్టడికి చేపట్టిన పాక్షిక లాక్‌డౌన్‌లో భాగంగా ఏర్పాటు చేసిన మినీ రైతుబజార్లను మూసి వేశారు. ఇకపై జిల్లాలో సాధారణ రైతుబజార్లలోనే పాత విధానంలోనే కూరగాయలను విక్రయిస్తారు. జిల్లాలోని 13 ప్రధాన రైతుబజార్లలో జనం రద్దీ నియంత్రణకు వాటిని 54 చిన్న రైతుబజార్లుగా వర్గీకరించారు. వీటి ద్వారా 400 మంది రైతులు, 167 పొదుపు సంఘాల ప్రతినిధులు తమకు కేటాయించిన 567 దుకాణాల ద్వారా కూరగాయలను ప్రజలకు అందించారు. ఏప్రిల్‌ 16వ తేదీ నుంచి చిన్న రైతుబజార్ల ద్వారా విక్రయాలు మొదలయ్యాయి. విక్రయాలు బాగా తక్కువగా ఉండడంతో అవి క్రమంగా మూతపడుతూ వచ్చాయి. దీంతో పాటు ఈ నెల 1వ తేదీ నుంచి ప్రభుత్వ పాఠశాలలు తిరిగి తెరచుకున్నాయి. చిన్న రైతుబజార్లలో అత్యధికం ఈ పాఠశాలల్లోనే ఏర్పాటయ్యాయి. వాటి కొనసాగింపు ఇబ్బందిగా మారింది. దీంతో మినీ రైతుబజార్ల విషయంలో అధికారులు డైలమాలో పడ్డారు. చివరకు ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో మినీ రైతుబజార్లను మూసివేయాలని నిర్ణయించినట్లు మార్కెటింగ్‌ శాఖ గుంటూరు జిల్లా సహాయ సంచాలకుడు రాజాబాబు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. ఇకపై ప్రధాన రైతుబజార్లలోనే కూరగాయలను విక్రయిస్తామన్నారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ రైతులు, పొదుపు సంఘాల వారికి విడతల వారీగా అవకాశాలు కల్పించేలా ప్రణాళిక రూపొందించుకున్నామని వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని