బైపాస్‌ రోడ్డు పనులు వేగవంతం చేయండి
eenadu telugu news
Published : 29/07/2021 05:19 IST

బైపాస్‌ రోడ్డు పనులు వేగవంతం చేయండి


సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ నివాస్‌

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : జిల్లాలో నిర్మాణంలోని రహదార్లు, రైల్వేకి సంబంధించిన పనులు, భూసేకరణ తదితర అంశాలపై కలెక్టర్‌ జె.నివాస్‌ నగరంలోని విడిది కార్యాలయంలో బుధవారం సమీక్షించారు. చిన ఆవుటపల్లి నుంచి గొల్లపూడి వరకు చేపట్టిన విజయవాడ బైపాస్‌ రోడ్డు పనులు వేగవంతం చేయాలన్నారు. కలపర్రు నుంచి చిన ఆవుటపల్లి వరకు ఆరు వరుసల జాతీయ రహదారి నిర్మాణ పనులు 96 శాతం పూర్తయినట్టు తెలిపారు. హనుమాన్‌జంక్షన్‌ వద్ద బైపాస్‌ రోడ్డు మిగులు, డ్రెయిన్ల నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. గన్నవరం విమానాశ్రయం వద్ద పైవంతెన నిర్మాణానికి అవససరమైన చర్యలు తీసుకోవాలన్నారు. జక్కంపూడి-గొల్లపూడి మధ్య రైల్వే పైవంతెన నిర్మాణ విషయంలో ఎంత ఎత్తు ఉండాలనేది అధికారికంగా రైల్వే అధికారులకు అందించాలని ఎన్‌.హెచ్‌. అధికారులకు సూచించారు. ఖమ్మం-విజయవాడల మధ్య ప్రతిపాదిత నూతన రహదారి నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ పేర్కొన్నారు. కత్తిపూడి-ఒంగోలు అనుబంధ జాతీయ రహదారి పనుల్లో ప్యాకేజీ-1, ప్యాకేజీ-2 లలో కొద్ది పాటి భూసేకరణ పనులను సత్వరమే పూర్తి చేయాలన్నారు. పామర్రు-ఆకివీడుల మధ్య 5 మండలాల పరిధిలో 64 కిలో మీటర్ల రోడ్డు విస్తరణకు ఇప్పటికే 90 శాతం భూమిని అప్పగించినట్టు పేర్కొన్నారు. జిల్లాలో పలు చోట్ల జాతీయ రహదారుల విస్తరణ/నిర్మాణ పనులు పూర్తయిన చోట్ల అప్రోచ్‌ రోడ్లు నిర్మించలేదని, వీటిని త్వరితగతిన ఏర్పాటు చేయాలన్నారు. నందిగామ-కంచికచర్ల బైపాస్‌ రోడ్డు పనుల్లో పెండింగులో ఉన్న 900 మీటర్ల పనులను వచ్చే సమావేశం నాటికి పూర్తి చేయాలన్నారు. బెంజిసర్కిల్‌ వద్ద రెండో పైవంతెన పనులు 80 శాతం మేర పూర్తయినట్టు తెలిపారు. మిగతా పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ముస్తాబాద-గొల్లపూడి మధ్య నూతన రైలు మార్గం ఏర్పాటు తదితరాలపై సమీక్షించారు. ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తేవాలన్నారు. సమీక్షలో జేసీ కె.మాధవీలత, సబ్‌కలెక్టర్‌ ప్రవీణ్‌చంద్‌, గుడివాడ, నూజివీడు ఆర్డీవోలు జి.శ్రీనుకుమార్‌, కె.రాజ్యలక్ష్మి, ఎన్‌.హెచ్‌. పీడీ నారాయణ, మేనేజర్‌ సాహూ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని