కలల సౌధం.. అందితనే ఆనందం
eenadu telugu news
Published : 29/07/2021 05:19 IST

కలల సౌధం.. అందితనే ఆనందం

నిర్మాణం పూర్తయినా నిరుపయోగంగా ఇళ్లు

రూ.వందల కోట్లు వెచ్చించినా నెరవేరని లక్ష్యం

వసతుల కల్పనపై స్పష్టత కరవు

ఈనాడు, గుంటూరు

 

మాచర్లలో అర్ధంతరంగా ఆగిన గృహ నిర్మాణాలు

జిల్లాలో గుంటూరుతో పాటు పట్టణాల్లోని మురికివాడల్లో నివసించే పేదలకు సౌకర్యాలతో కూడిన బహుళ అంతస్తుల భవనాలు నిర్మించి ఇవ్వాలని పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ(టిడ్కో) ఆధ్వర్యంలో గతంలో నిర్మాణాలు చేపట్టారు. ఇందులో భాగంగా గుంటూరు, ఇతర పట్టణాలు, సీఆర్‌డీఏ పరిధిలో 51412 ఇళ్లను మంజూరు చేశారు. కేంద్రం ఇచ్చే రూ.1.50లక్షలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1.50లక్షలు కలిపి రాయితీగా అందించి మిగిలిన సొమ్మును బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునేలా పథకాన్ని రూపొందించారు. 2015 నుంచి 2019 వరకు నాలుగు విడతల్లో మంజూరైన ఇళ్లను జీ+3 విధానంలో నిర్మాణాలు ప్రారంభించి కొన్ని పూర్తి చేశారు. లబ్ధిదారులను ఎంపిక చేసి కొందరికి ప్లాట్లు కేటాయించారు. ఇళ్ల నిర్మాణం పూర్తయినా వసతుల కల్పనలో జాప్యం జరుగుతోంది. ప్రధానంగా తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్తు సౌకర్యం, అంతర్గత రహదారుల నిర్మాణం తదితర పనులు రెండేళ్లుగా ఆగిపోయాయి. ప్రాజెక్టులు పూర్తి చేయాల్సిన గుత్తేదారు కంపెనీలకు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు నిలిపేశాయి. లబ్ధిదారుల సొంతింటి కల నెరవేరలేదు. లబ్ధిదారుని వాటా చెల్లించడానికి అప్పులు చేసిన వారు ఇబ్బందులు పడుతున్నారు. పిడుగురాళ్లలో గృహాల పనులు జరుగుతున్నాయి. రేపల్లె, వినుకొండలో పనులకు ఆమోదం లభించడంతో త్వరలోనే గుత్తేదారులు వాటిని ప్రారంభించనున్నారు.


రేపల్లె గృహసముదాయంలో అధ్వానంగా రహదారి

ప్రారంభించకుండానే పాడవుతున్నాయి

జిల్లాలో రూ.వందల కోట్లు వెచ్చించిన గృహ సముదాయాల్లోని ఇళ్లు లబ్ధిదారులకు ఇవ్వకపోవడంతో పరిసరాల్లో పిచ్చిమొక్కలు పెరిగి చిట్టడవిని తలపిస్తున్నాయి. మూడు, నాలుగో విడతల్లో తెనాలి, నరసరావుపేట, సత్తెనపల్లి, పొన్నూరుకు ఇళ్లు మంజూరైనా నిర్మాణాలు ప్రారంభం కాలేదు. సత్తెనపల్లిలో తొలివిడత మంజూరైన ఇళ్లలోనే మూడోవంతు కూడా నిర్మించకుండానే మిగిలిన వాటిని రద్దు చేశారు. చిలకలూరిపేట, నరసరావుపేట, గుంటూరు, పొన్నూరు, తెనాలి, మంగళగిరి, సీఆర్‌డీఏ ప్రాంతాల్లో తొలివిడతలో చేపట్టిన నిర్మాణాలు పూర్తయినా మౌలిక వసతుల కల్పనలో జాప్యం జరుగుతోంది. తెనాలిలోని చినరావూరు గృహసముదాయంలో సామగ్రి చోరీకి గురైంది. ఇటీవల వర్షాలకు టిడ్కో ఇళ్ల సముదాయంలో నీరు నిలిచింది. అంతర్గత రహదారులు చిత్తడిగా మారాయి. నిర్మాణం కోసం తెచ్చిన ఇనుము, పైపులు, ఇతర సామగ్రి పాడైపోయింది.


తెనాలిలో పునాది దశలో నిర్మాణం ఆపేయడంతో పెరిగిన పిచ్చిమొక్కలు

* జిల్లాలో గుంటూరుతోపాటు మున్సిపల్‌ పట్టణాలు, సీఆర్‌డీఏ పరిధిలో 2015 నుంచి 2019 వరకు ప్రభుత్వం నాలుగు విడతలుగా ఇళ్లను మంజూరు చేసింది. వాటిలో కొన్ని నిర్మాణ దశలో ఉండగా, కొన్ని పూర్తయినా లబ్ధిదారులకు అప్పగించలేదు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని