వాహనాల దొంగలు..హత్య కేసులో నిందితులు
eenadu telugu news
Published : 05/08/2021 06:06 IST

వాహనాల దొంగలు..హత్య కేసులో నిందితులు

సత్యనారాయణపురం, న్యూస్‌టుడే : ద్విచక్ర వాహనాల దొంగతనం కేసులో అయిదుగురు నిందితులను సత్యనారాయణపురం పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరికి నెల్లూరు జిల్లాలో గతనెల 22వ తేదీన జరిగిన ఒక హత్య కేసుతో సంబంధం ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. బుధవారం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గత నెలలో సత్యనారాయణపురంలోని బ్రహ్మయ్య పంతులువీధి, సన్నిదానం వారి వీధిలో ఇంటి ముందు ఉంచిన రెండు ద్విచక్ర వాహనాలు చోరీకి గురయ్యాయి. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసు స్టేషన్‌ పరిధిలోని బెజవాడ క్లబ్‌ సమీప పొలాల్లో ద్విచక్ర వాహనాలు కనిపించాయి. అక్కడ నిఘా పెట్టగా, ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించడంతో... ద్విచక్ర వాహనాల దొంగతనం చేసింది తామేనని అంగీకరించారు. నెల్లూరు జిల్లాకు చెందిన పి.సాయిజగదీష్‌, పి.సాయిహర్షవర్ధన్‌రెడ్డి, ఎ.వెంకటేష్‌, ఎం.కుమార్‌, పి.నవీన్‌లను అరెస్టు చేసి, ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వీరు నేరాలకు ఉపయోగించిన కారును సైతం స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై నెల్లూరు జిల్లాలో పలు కేసులు ఉన్నట్లు పోలీసులు వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని