బడిలో వనం... పౌష్టిక ఫలం
eenadu telugu news
Published : 05/08/2021 06:34 IST

బడిలో వనం... పౌష్టిక ఫలం

ఈనాడు, అమరావతి

జిల్లాలో మొదటి దశలో నాడు-నేడు పనులు పూర్తయిన పాఠశాలల్లో పలు రకాల పండ్ల మొక్కలు పెంచాలని జిల్లా సమగ్రశిక్ష యంత్రాంగం నిర్ణయించింది. ప్రస్తుతం జరుగుతున్న వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా 636 పాఠశాలల్లో 33,220 పండ్ల మొక్కలు నాటేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో వాటిని నాటనున్నారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డీడబ్ల్యూఎంఏ) ఈ మొక్కలను పాఠశాలలకు అందజేయనుంది. బడి-ఈడు పిల్లల్లో పౌష్టికాహార లోపం ఉన్న వారికి పండ్లు ఇచ్చి ఆ సమస్యను అధిగమించేలా చేస్తారు. నాడు-నేడు పనుల్లో భాగంగా ప్రతి పాఠశాలకు నీటి వసతి కల్పించారు. ఆయా పాఠశాలల్లో ఈ మొక్కల పెంపకానికి ఏ మట్టి అనుకూలమో గుర్తించి సమకూర్చనున్నారు. ఇప్పటికే ఆయా పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణం, ఇతరత్రా పనుల నిర్వహణకు గతంలోనే మట్టి, ఇసుక తదితర మెటీరియల్‌ తోలారని, అందులో భాగంగా మిగిలిన మట్టిని ఈ మొక్కల పెంపకంలో వినియోగించాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. మొక్కలు నాటే పనులకు తక్షణమే శ్రీకారం చుట్టాలని హెచ్‌ఎంలకు స్పష్టం చేశారు. ఆగస్టు 16వ తేదీలోపు ఈ పనులు ముగించాలని పాఠశాల యంత్రాంగాన్ని ఆదేశించారు. పిల్లలు స్కూళ్లకు వచ్చేలోపు మొక్కలు నాటడం పూర్తి చేయాలని, వాటికి అవసరమైతే ట్రీగార్డులు తొడగాలని మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రతి పాఠశాలకు 50 మొక్కలు పెంచాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని