అప్రకటిత కోతలు
eenadu telugu news
Published : 24/09/2021 03:35 IST

అప్రకటిత కోతలు

విద్యుత్తు అంతరాయాలతో జనం అవస్థలు

- ఈనాడు, అమరావతి

ఓ వైపు ఉక్కపోత.. మరోవైపు దోమల మోత.. వీటికి తోడు అప్రకటిత కోతలు తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. అధికారికంగా ఎక్కడా విద్యుత్తు కోతలు లేకపోయినా ఈఎల్‌ఆర్‌ (ఎమర్జెన్సీ లోడ్‌ రిలీఫ్‌) పేరుతో ఎడాపెడా కోతలు విధిస్తున్నారు. ముఖ్యంగా పీక్‌ అవర్స్‌లో నరకం చవిచూస్తున్నారు. దీనికి తోడు వర్షాలకు దోమలు బాగా పెరిగాయి. వీటి కాటు ద్వారా వచ్చే వ్యాధులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. రాత్రి, తెల్లవారుజామున సరఫరాలో అంతరాయాలు అధికంగా ఉంటున్నాయి. ఈ సమయాల్లో ప్రజల అవస్థలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. మారిన జీవన శైలిలో భాగంగా విద్యుత్తు ఉపకరణాల వినియోగం బాగా పెరిగింది. దీంతో విద్యుత్తు లేకపోతే పనులు ముందుకు సాగని పరిస్థితి. విద్యుత్తు సరఫరాలో లోటు ఏర్పడినప్పుడల్లా గ్రామీణ ప్రాంతాల్లో కోతలు అమలు చేస్తున్నారు. సరఫరాలో లోటు తలెత్తితే తొలుత గ్రామాల పరిధిలో కరెంటు తీసేస్తున్నారు. అప్పటికీ లోటు కనిపిస్తే మండల కేంద్రాలు, పట్టణాల వరకు కోతలు విధిస్తున్నారు.

 

ఎందుకీ పరిస్థితి..?

రాష్ట్రంలో ఇటీవలి కాలంలో ఎక్కువ రోజులు ఆకాశం మేఘావృతం అయి ఉండడంతో పాటు వర్షాలు పడుతున్నాయి. ఈ ప్రభావం సోలార్‌, పవన విద్యుదుత్పత్తిపై పడుతోంది. ప్రతికూల వాతావరణం కారణంగా ఉత్పత్తి దాదాపు 25 శాతం వరకు పడిపోయింది. సాధారణంగా విద్యుత్తు డిమాండ్‌ 9 నుంచి 13వేల మె.వా వరకు ఉంటుంది. ప్రస్తుతం పది వేల మె.వా లోపే ఉంటోంది. అధికారులు డిమాండ్‌ను బట్టి.. ఉత్పత్తి, సరఫరా ప్రణాళికలు తయారు చేసుకుని ముందుకు సాగుతున్నారు. సోలార్‌ ద్వారా 2,800 మె.వా, పవన శక్తి ద్వారా 3,900 మె.వా మేర విద్యుత్తును ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. సెంట్రల్‌ గ్రిడ్‌ నుంచి 2,400 మె.వా వాటా మనకు దక్కుతోంది. దీనికి తోడు ఏపీ జెన్‌కోకు 7,200 మె.వా సామర్థ్యం ఉంది. పవన, సోలార్‌ విద్యుత్తును గరిష్ఠంగా వినియోగించుకుంటూ అవసరాలను బట్టి థర్మల్‌, హైడల్‌ విద్యుత్తు కేంద్రాలను నిర్వహిస్తుంటారు. సంప్రదాయేతర విద్యుత్తు ఉత్పత్తి పడిపోవడం సమస్యలను రెట్టింపు చేస్తోంది.

సర్దుబాటు కోసం...

దీని వల్ల తలెత్తిన లోటును భర్తీ చేసేందుకు విద్యుత్తును కొనుగోలు చేస్తున్నా చాలడం లేదు. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో సరఫరాను నిలిపి సర్దుబాటు చేయాల్సి వస్తోంది. సాధారణంగా సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు విద్యుత్తు వినియోగం గరిష్ఠంగా ఉంటుంది. ఈ సమయంలో లోటు తలెత్తితే అధిక ధరకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. పలు సందర్భాలలో కొనేందుకు కరెంటు కూడా దొరకడం లేదు. ఈ నేపథ్యంలో అధికారులు కోతలు అమలు చేస్తున్నారు. అప్పటికప్పుడు థర్మల్‌, జలవిద్యుత్తు కేంద్రాలు నిర్వహించడం కష్టం కావడంతో ఈఎల్‌ఆర్‌ ఇవ్వాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదు కావడం, గాలి వేగం తక్కువగా ఉండడం వల్ల సౌర, పవన విద్యుత్తు ఉత్పత్తి తగ్గిపోతోంది.


అధికంగా అవాంతరాలు

* ఈ నెల 21న జిల్లా వ్యాప్తంగా పలు విద్యుత్తు ఉపకేంద్రాల్లో అంతరాయాలు నమోదు అయ్యాయి. కోడూరు సెక్షన్‌ పరిధిలో 11 ఫీడర్లు ఉన్నాయి. వీటి కింద 15,771 కనెక్షన్లు ఉన్నాయి. ఈ పరిధిలో సగటున రెండు గంటలకు పైగా విద్యుత్తు సరఫరా లేదు. దాదాపు 12 సార్లు సరఫరాలో అంతరాయాలు తలెత్తాయి.

* నాగాయలంక సెక్షన్‌ పరిధిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ 13 ఫీడర్ల పరిధిలో 17,988 మంది వినియోగదారులు ఉన్నారు. దాదాపు పది సార్లు సరఫరా నిలిచిపోయింది. ఆ రోజున సరాసరి గంటన్నర మేర ఈఎల్‌ఆర్‌ను అమలు చేశారు. చందర్లపాడు సెక్షన్‌లోని ఆయా గ్రామాల్లో 23వేల కనెక్షన్లు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో కలిపి సగటున 45 నిముషాల పాటు సరఫరా లేదు.

* ఛాట్రాయి సెక్షన్‌లో 26 ఫీడర్లు ఉన్నాయి. వీటి కింద ఏకంగా 51 సార్లు అంతరాయాలు తప్పలేదు. ఇక్కడ 27,147 మంది విద్యుత్తు వినియోగదారులు ఉన్నారు. సరాసరి 42.31 నిముషాల పాటు కోతలు విధించారు. రామనక్కపేట సెక్షన్‌ పరిధిలో 39.45 నిముషాలు, ఉంగుటూరు సెక్షన్‌ పరిధిలో 31 నిముషాల మేర సగటున కోతలు అమలు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని