ఉద్యోగాల పేరుతో మోసగించిన ఇద్దరి అరెస్టు
eenadu telugu news
Published : 24/09/2021 03:35 IST

ఉద్యోగాల పేరుతో మోసగించిన ఇద్దరి అరెస్టు


వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ కె.వి.మహేష్‌, సీఐ తబ్రేజ్‌, ఎస్సైలు 

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న విజయవాడలోని రంగరావు వీధికి చెందిన పాలేపు వేణుగోపాల్‌, గుంటూరు వాసవి నగర్‌లోని బొమ్మరిల్లు అపార్ట్‌మెంట్‌లో ఉండే కంభంపాటి రత్నకుమారిని కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలు మూడో పట్టణ పోలీసుస్టేషన్‌లో సీఐ తబ్రేజ్‌, ఎస్సైలు జయశేఖర్‌, నరేంద్రతో కలిసి కర్నూలు డీఎస్పీ కె.వి.మహేష్‌ గురువారం సాయంత్రం వివరాలు వెల్లడించారు. గతంలో రాష్ట్ర సచివాలయంలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిగా పనిచేసిన పాలేపు వేణుగోపాల్‌ను అధికారులు తొలగించారు. పనిచేసే సమయంలో ఏర్పడిన పరిచయాలను అవకాశంగా చేసుకుని వారికి ఫోన్లు చేసి బ్యాంకులు, ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలిప్పిస్తానని నమ్మించేవాడు. కంభంపాటి రత్నకుమారితో పాటు మరికొందరితో కలిసి పరిచయాలను విస్తృతం చేసుకుని ఉద్యోగాల ఖాళీల జాబితాలను పంపేవారు. నమ్మిన వ్యక్తుల వద్ద రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేశారు. కొందరికి నకిలీ ఆర్డరు కాపీలు ఇవ్వటం.. తర్వాత సెల్‌ఫోన్‌ నంబరు మారుస్తూ తప్పించుకుని తిరిగారు. ఈ క్రమంలో కర్నూలు మాధవీనగర్‌కు చెందిన వెంకటరాముడుకు స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియాలో మెసెంజర్‌ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి రూ.1.60 లక్షలు తీసుకుని నకిలీ ఆర్డర్‌ కాపీ ఇచ్చి మోసగించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు గతేడాది జులై 29 కేసు నమోదైంది. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు గురువారం వేణుగోపాల్‌, రత్నకుమారిని అరెస్టు చేసి రెండ్‌ చరవాణులు సీజ్‌ చేశారు. మోసపోయిన బాధితుల నుంచి సదరు సెల్‌ఫోన్లకు ఫోన్‌కాల్స్‌ రాగా పోలీసులు మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నిందితుల చరవాణుల్లోని వాట్సాప్‌లను పరిశీలించగా శ్రీకాకుళం, చిత్తూరు, ఇతరత్రా పలు జిల్లాలవాసులు బాధితులు పంపిన సంక్షిప్త సమాచారాలు గుర్తించారు. ఈ కేసులో మరికొంత మందిని అరెస్టు చేయాల్సి ఉందని డీఎస్పీ తెలిపారు. బాధితులు ఎవరైనా ఉంటే ధైర్యంగా ఫిర్యాదు చేయాలని సూచించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని