బంగారు దుకాణంలో చోరీకి యత్నం
eenadu telugu news
Published : 24/09/2021 03:35 IST

బంగారు దుకాణంలో చోరీకి యత్నం

పది మంది దొంగల అరెస్టు


వివరాలు వెల్లడిస్తున్న అదనపు ఎస్పీ (కార్యకలాపాలు) దేవప్రసాద్‌

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే : బంగారు వ్యాపారంలో నష్టాలొచ్చాయని ఓ దుకాణంలో చోరీ చేయడానికి ప్రయత్నించిన పది మంది దొంగలను ప్రొద్దుటూరు పోలీసులు అరెస్టు చేశారు. అదనపు ఎస్పీ(కార్యకలాపాలు) దేవప్రసాద్‌ కడపలోని తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు. ‘ప్రొద్దుటూరులోని ఆర్ట్స్‌ కళాశాల రోడ్డులో ఉంటున్న షేక్‌ యాకుబ్‌కు బంగారు దుకాణం ఉండేది. వ్యాపారం సరిగా జరగకపోవడంతో స్థిరాస్తీ వ్యాపారం ప్రారంభించాడు. బంగారు వ్యాపారం చేసేటప్పుడు చెన్నై, కోయంబత్తూరుకు వెళ్లే సమయంలో చెన్నూరు మండలం రామనపల్లెకు చెందిన తోట రామచంద్రుడు, పాలంపల్లెకు చెందిన నిత్యపూజయ్యతో పరిచయమైంది. పెద్ద చోరీలు, నిధులు కనిపెట్టే వ్యక్తి కావాలని యాకుబ్‌ వారిని అడిగాడు. వారు ప్రకాశం జిల్లా త్రిపురాంతకం గ్రామానికి చెందిన రావులకొల్లు వెంకటేశ్వర్లును పరిచయం చేశారు. ఓ బంగారు దుకాణంలో చోరీ చేయాలని నిర్ణయించుకున్నారు. చోరీలు చేయడంతో అనుభవం ఉన్న గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన బంగారు రాజు అలియాస్‌ రాజ్‌కుమార్‌, విజయవాడ బ్రాహ్మణవీధికి చెందిన అక్కవరపు బాలఏసు, వెంకన్న, విశాఖపట్నానికి చెందిన డేవిడ్‌రాజు, నర్సీపట్నానికి చెందిన అప్పలనాయుడు, శంకర్‌రావులను పిలిపించారు. వారితో యాకుబ్‌ ఒప్పందం కుదుర్చుకున్నారు. బుధవారం కడప నుంచి ఆటోలో ప్రొద్దుటూరుకు వెళ్లారు. మోక్షగుండం వీధిలో ఉన్న తస్మియా బంగారు దుకాణం వద్దకు వెళ్లి తొలుత రెక్కీ నిర్వహించారు. తమ వెంట తెచ్చుకున్న పరికరాలతో షెట్టర్‌ తాళాన్ని పగలగొట్టి లోపలికి వెళ్లారు. అక్కడే ఉన్న వాచ్‌మెన్‌ను ఆయుధాలతో బెదిరించి మొదటి అంతస్తులోకి వెళ్లారు. లోపల ఉన్న కాపలాదారు వారిని చూసి గట్టిగా కేకలు వేయడంతో భయపడి అక్కడ నుంచి ఉడాయించారు. బాధితులిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పది మంది దొంగలను ప్రొద్దుటూరు ఆర్టీపీపీ రోడ్డులోని చౌడమ్మ ఆలయం వద్ద ఉండగా అరెస్టు చేసినట్లు’ అదనపు ఎస్పీ చెప్పారు. వారి నుంచి ఆయుధాలను జప్తు చేశామన్నారు. ఈ కేసును ఛేదించిన పోలీసులకు నగదు బహుమతి అందజేశారు. సమావేశంలో ప్రొద్దుటూరు ఒకటో పట్టణ సీఐ నాగరాజు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని