గుంటూరు జీజీహెచ్‌లో పాము కలకలం
eenadu telugu news
Published : 24/09/2021 03:35 IST

గుంటూరు జీజీహెచ్‌లో పాము కలకలం

మూడు రోజుల క్రితం ఎలుకల బోనులో చిక్కిన సర్పం


కాన్పుల విభాగంలో పామును పట్టుకునే ప్రయత్నంలో ఆర్‌ఎంవో, సిబ్బంది

నగరంపాలెం(గుంటూరు), న్యూస్‌టుడే: గుంటూరు జీజీహెచ్‌ కాన్పుల విభాగంలోకి గురువారం రాత్రి 8 గంటల సమయంలో పాము రావడంతో బాలింతలు, గర్భిణులు, సహాయకులతో పాటు వైద్య సిబ్బంది పరుగులు తీశారు. సర్వజనాసుపత్రిలో కాన్పుల వార్డు ప్రతి నిత్యం రద్దీగా ఉంటుంది. పాము మాత్రం ఏమాత్రం బెరవకుండా వార్డులోని కాన్పుల గది(లేబర్‌వార్డు) సమీపంలోకి వెళ్లడంతో సిబ్బందితో పాటు రోగులు, సహాయకులు భయాందోళనలకు గురై ఒక్కసారిగా పరుగులు తీయడంతో వెలుపల ఉన్నవారు సైతం ఆందోళన చెందారు. గర్భిణుల సహాయకులు అందించిన సమాచారం ప్రకారం.. సుమారు 8 గంటల సమయంలో లేబర్‌ వార్డులో కాన్పు చేసే సమయంలోనే పాము రావడంతో అక్కడ ఆయా పామును చూసి కేకలు వేయడంతో విషయం బయటకు వచ్చిందని తెలిపారు. కాన్పుల వార్డులోకి పాము రావడం ఇది రెండోసారని, మూడు రోజుల కిందట ఎలుకలను పట్టుకునేందుకు ఏర్పాటు చేసి బోనులో పాము చిక్కడంతో విషయం గోప్యంగా ఉచ్చారని రోగుల సహాయకులు తెలిపారు. కాన్పుల విభాగం వెనుక నిర్మాణంలో ఉన్న ఖాళీ స్థలంలో వ్యర్థాలు వేయడం, అక్కడ మురుగునీరు చేరడంతో పాములు, ఎలుకలకు ఆవాసంగా మారిందని తెలిపారు. గతంలో కూడా చిన్నపిల్ల వార్డులో పసికందును ఎలుకలు కొరికి చంపిన ఘటన జీజీహెచ్‌లోనే జరిగిందని, ఈ సారి కాన్పుల వార్డులోకి పాము ప్రవేశించడంతో రోగులు భయాందోళన చెందుతున్నారు. విషయం తెలుసుకున్న ఆర్‌ఎంవో డాక్టర్‌ సతీష్‌ పారిశుద్ధ్య సిబ్బందితో కాన్పుల వార్డులోని ప్రతి ప్రాంతాన్ని క్షుణంగా పరిశీలించి, ఎక్కడా కలుగులు, రంధ్రాలు ఉన్నాయో వాటికి మరమ్మతులు చేయించారు. వాష్‌బేసిన్‌ సమీపంలోని రంధ్రంలోకి పాము దూరడంతో క్రిమిసంహారక ద్రావణాన్ని చల్లి పామును పట్టుకునే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని