శాసన, లోక్‌ సభల్లో ఎస్టీలకు సీట్ల కేటాయింపు పెంచాలి
eenadu telugu news
Published : 24/09/2021 03:46 IST

శాసన, లోక్‌ సభల్లో ఎస్టీలకు సీట్ల కేటాయింపు పెంచాలి

గడ్చిరోలి ఎంపీ అశోక్‌నేతే


శిబిరంలో బీపీ పరీక్ష చేయించుకుంటున్న ఎంపీ అశోక్‌నేతే, చిత్రంలో నాగభూషణం, కిశోర్‌బాబు, వంశీకృష్ణ తదితరులు 

తాడేపల్లి, న్యూస్‌టుడే: శాసన, లోక్‌ సభలకు పోటీ చేయడానికి ఎస్టీలకు సీట్ల కేటాయింపు పెంచాలని భాజపా ఎస్టీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి, మహారాష్ట్రలోని గడ్చిరోలి ఎంపీ అశోక్‌నేతే అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని అంబేడ్కర్‌ కాలనీలో (యానాది) నరేంద్ర మోదీ ప్రభుత్వ అధినేత (సీఎం, పీఎం)గా 20 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా భాజపా యువ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంశీకృష్ణ ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆయన గురువారం ప్రారంభించారు. అనంతరం కేంద్రం రాష్ట్రంలోని పేదలకు ఉచితంగా ఇస్తున్న బియ్యం పంపిణీని, కొవిడ్‌ టీకా కార్యక్రమాన్ని పరిశీలించి విలేకరులతో మాట్లాడారు. ఎస్టీ జనాభా ప్రాతిపదికన రాష్ట్రంలో 12 సీట్లు కేటాయించాల్సి ఉండగా, కేవలం ఏడు ఇచ్చారన్నారు. పార్లమెంటు సీట్లు రాష్ట్రంలో 25 ఉండగా అందులో ఒకటి మాత్రమే ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి కేటాయించారన్నారు. ఎస్టీల రిజర్వేషన్‌ పెంచేందుకు తాను పార్లమెంటులో ప్రభుత్వంతో చర్చిస్తానన్నారు. కేంద్రం నిధులకు రాష్ట్ర ప్రభుత్వం తమ ఫొటోలు పెట్టుకుటుందని ఆరోపించారు. ఇచ్చిన నిధులు దుర్వినియోగం చేస్తున్నారని, కేంద్రం ఇచ్చే బియ్యం పేదలకు అందకుండా సాంకేతిక సమస్యలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. కొవిడ్‌ టీకాలను పూర్తిస్థాయిలో వినియోగించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. భాజపా రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం మాట్లాడుతూ రాష్ట్రాన్ని ప్రభుత్వం అప్పులపాలు చేసిందని విమర్శించారు. కార్యక్రమంలో భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెల కిశోర్‌బాబు, గిరిజన మోర్చ రాష్ట్ర అధ్యక్షులు ఉమామహేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కృష్ణారావు, ఎస్సీ మోర్చా కోనసీమ జోనల్‌ ఇన్‌ఛార్జి జాన్‌బాబు, ఓబీసీ మోర్చ రాష్ట్ర అధ్యక్షులు బిట్రా శివన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని