అండర్‌-19 రాష్ట్ర స్థాయి షూటింగ్‌ బాల్‌ పోటీలు ప్రారంభం
eenadu telugu news
Published : 24/09/2021 03:46 IST

అండర్‌-19 రాష్ట్ర స్థాయి షూటింగ్‌ బాల్‌ పోటీలు ప్రారంభం

గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు తరలివచ్చిన క్రీడాకారులు


పోటీలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే విడదల రజిని

చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని మోడరన్‌ గ్రీన్‌వ్యాలీ పాఠశాల క్రీడాప్రాంగణంలో జిల్లా షూటింగ్‌ బాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో 39వ ఆంధ్రప్రదేశ్‌ అండర్‌-19 రాష్ట్ర స్థాయి పోటీలు గురువారం ప్రారంభమయ్యాయి. పోటీలను ఎమ్మెల్యే విడదల రజిని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే రజిని మాట్లాడుతూ చిన్నతనం నుంచే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పిల్లలకు ఆటలపై ఆసక్తిని పెంచితే వారికి మంచి నడవడిక నేర్పిన వారవుతారన్నారు. క్రీడలతో శారీరక మానసికోల్లాసం లభిస్తుందన్నారు. ప్రస్తుతం పిల్లల్లో క్రీడలపై ఆసక్తి తగ్గిపోతోందని, మారుతున్న తల్లిదండ్రుల ఆలోచనా సరళి ఇందుకు కారణంగా ఉందని, ఇది సమాజానికి ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. పోటీల్లో బాలుర విభాగంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 360 మంది క్రీడాకారులు, బాలికల విభాగంలో 11 జిల్లాల నుంచి 330 మంది క్రీడాకారిణులు పాల్గొన్నారు. లీగ్‌కమ్‌ నాకౌట్‌ పద్ధతిలో జరిగిన పోటీల్లో బాలికల విభాగంలో తూర్పు గోదావరి జిల్లాపై పశ్చిమ గోదావరి జిల్లా, చిత్తూరు జిల్లాపై ప్రకాశం జిల్లా కృష్ణాజిల్లాపై గుంటూరు జిల్లా, విజయనగరంపై నెల్లూరు జిల్లా, అనంతపురం జిల్లాపై తూ.గోజిల్లా, ప్రకాశంపై వైఎస్‌ఆర్‌ కడప జిల్లా, విశాఖపై కృష్ణా జిల్లా, అనంతపురంపై తూ.గోజిల్లా, చిత్తూరుపై కడప జిల్లా, విశాఖపట్నంపై గుంటూరు జిల్లాలు విజయం సాధించాయి. బాలికల విభాగంలో క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లలో కృష్ణా జట్టుపై ప.గోజిల్లా జట్టు, విజయనగరం జిల్లా జట్టుపై వైఎస్సార్‌ కడప జిల్లా జట్లు గెలుపొందాయి. పోటీలు శుక్రవారం ముగియనున్నాయి. కార్యక్రమంలో జిల్లా ఉప విద్యాశాఖాధికారి సుధాకరరెడ్డి, రీజనల్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ మహబూబ్‌ బాషా, జిల్లా షూటింగ్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు చేబ్రోలు మహేష్‌, చైర్మన్‌ డాక్టర్‌ కొల్లా రామారావు, కార్యదర్శి కె జోసఫ్‌, జిల్లా ఎస్‌జిఎఫ్‌ కార్యదర్శి పి.మస్తాన్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు అలి, జిల్లా కార్యదర్శి సురేంద్ర పోటీలకు సహకారం అందించిన డాక్టర్‌ మక్కెన వంశీకృష్ణ, నన్నపనేని రాఘవరావు, డాక్టర్‌ ముద్దన రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని