జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా రవీంద్రబాబు
eenadu telugu news
Published : 24/09/2021 03:46 IST

జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా రవీంద్రబాబు

నలుగురు సీనియర్‌ సివిల్‌ జడ్జిలకు ఉద్యోగోన్నతి


ఎ.వి.రవీంద్రబాబు

గుంటూరు లీగల్‌ న్యూస్‌టుడే: జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్న ఎ.వి.రవీంద్రబాబును నియమించారు. జిల్లాలో పనిచేస్తున్న నలుగురు సీనియర్‌ సివిల్‌ జడ్జిలకు అదనపు జిల్లా జడ్జిలుగా ఉద్యోగోన్నతి కల్పిస్తూ రాష్ట్ర హైకోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు ఆఖరున జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహించిన జి.గోపీచంద్‌ పదవీ విరమణ చేయడంతో కార్మిక న్యాయస్థానం న్యాయమూర్తి జునైద్‌ అహ్మద్‌ను ఇన్‌ఛార్జి జిల్లా జడ్జిగా నియమించారు. దీంతో ఖాళీగా ఉన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి పోస్టులో రవీంద్రబాబును నియమించారు. ఖాళీగా ఉన్న కుటుంబ న్యాయస్థానం న్యాయమూర్తి పోస్టులో చిత్తూరులో అదనపు జిల్లా జడ్జిగా పనిచేస్తున్న పి.వి.యస్‌.సూర్యనారాయణను నియమించారు. ఐదో అదనపు జిల్లా జడ్జిగా చిత్తూరులో సీనియర్‌ సివిల్‌ జడ్జిగా పనిచేస్తున్న ఆర్‌.శ్రీలతను నియమించారు. మూడో అదనపు జిల్లా కోర్టు జడ్జిగా విశాఖపట్నంలో పనిచేస్తున్న జి.అర్చనను నియమించారు. ఆదోనిలో పనిచేస్తున్న యమ్‌.ఎ.సోమశేఖర్‌ను పదోన్నతిపై గురజాల అదనపు జిల్లా జడ్జిగా నియమించారు. వీరితోపాటు జిల్లాలో సీనియర్‌ సివిల్‌ జడ్జిలుగా పనిచేస్తున్న నలుగురికి అదనపు జిల్లా జడ్జిలుగా ఉద్యోగోన్నతి లభించింది. తెనాలిలో పనిచేస్తున్న జి.గీతను కడప అదనపు జిల్లా జడ్జిగా, నరసరావుపేటలో పనిచేస్తున్న షేక్‌.సికిందర్‌ బాషాను విజయనగరం అదనపు జిల్లా జడ్జిగా, సత్తెనపల్లిలో పనిచేస్తున్న యస్‌.నాగేశ్వరరావును విజయవాడలో అదనపు జిల్లా జడ్జిగా, గురజాలలో పనిచేస్తున్న వి.శ్రీనివాసరావును నందిగామ అదనపు జిల్లా కోర్టు జడ్జిగా నియమిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత జూనియర్‌ సివిల్‌ జడ్జిగా నియమితులైన రవీంద్రబాబు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఉద్యోగోన్నతి పొందారు. ఆయన ప్రకాశం జిల్లాలో న్యాయవాదిగా పనిచేశారు. ఆయనకు గుంటూరు జిల్లాతో అనుబంధం ఉంది. గతంలో మంగళగిరిలో తొలి సీనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జిగా ఆయన పనిచేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని