బంద్‌ రోజు బీఈడీ ప్రయోగ పరీక్షలు..!
eenadu telugu news
Published : 27/09/2021 03:15 IST

బంద్‌ రోజు బీఈడీ ప్రయోగ పరీక్షలు..!

అయోమయంలో శిక్షణార్థులు

ఈనాడు-అమరావతి: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలోని బీఈడీ విద్యార్థులకు (2019-21బ్యాచ్‌) నాలుగో సెమిస్టర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు సోమ, మంగళవారం నిర్వహించనున్నట్లు వర్సిటీ ఇంతకు ముందే షెడ్యూల్‌ ప్రకటించింది. కానీ సోమవారం భారత్‌ బంద్‌ నేపథ్యంలో పరీక్ష వాయిదా వేయాలని, బస్సులు లేకపోతే కళాశాలలకు చేరుకోవడం కష్టమని చెబుతున్నా యంత్రాంగం పట్టించుకోకుండా సోమవారం హాజరుకావల్సిందేనని సంక్షిప్త సమాచారం పంపడంతో వర్సిటీ పరిధిలోని వేలాది మంది విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. వాయిదా వేయాలని ఒకవైపు విద్యార్థులు, కుదరదని యంత్రాంగం ఎవరికి వారు ఆదివారం రాత్రి వరకు పట్టువదల కపోవడంతో సోమవారం పరీక్షలపై అయోమయం నెలకొంది. దీనిపై పలువురు శిక్షణార్థులు వర్సిటీ ఉన్నతాధికారులను ఫోన్‌లో సంప్రదించారు. అయితే ఉన్నతాధికారులు మాత్రం తాము ఇప్పటికే కళాశాలలకు స్పష్టత ఇచ్చామని చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం బంద్‌కు మద్దుతు ప్రకటించింది. మరోవైపు ఆర్టీసీ బస్సులను సోమవారం మధ్యాహ్నం వరకు నడపటం లేదని స్పష్టం చేసింది. బస్సులు లేకుండా పరీక్షలకు ఎలా హాజరవుతామని దూర ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.

ఐడీకార్డులు.. ఎగ్జామినర్ల జాబితాలకు ఆమ్యామ్యాలు?: ప్రాక్టికల్‌ పరీక్షలకు వర్సిటీ ఎగ్జామినర్లను నియమిస్తుంది. వారి వివరాలను పరీక్షలకు ఒక రోజు ముందు తెలియజేస్తుంది. వారికి వర్సిటీ నుంచి అధికారికంగా ఐడీ కార్డులు ముద్రించి పంపుతుంది. ఈసారి వర్సిటీ కార్డులు ముద్రించకుండా నేరుగా కళాశాలల ఖాతాలకు డబ్బులు జమ చేసి వాటితో ఎగ్జామినర్లకు ఐడీ కార్డులు సిద్ధం చేసి ఇవ్వాలని సూచించింది. దీంతో కొన్ని కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు ఆదివారం పరీక్షల పర్యవేక్షణ అధికారులను కలిసి తమ కళాశాలకు కేటాయించిన ఎగ్జామినర్ల జాబితా ఇవ్వాలని కోరితే అందుకు రూ.వెయ్యి నుంచి రూ.4వేల దాకా ముట్టజెప్పాలని కోరి వసూళ్లకు పాల్పడినట్లు విమర్శలు వచ్చాయి. కొన్ని బీఈడీ కళాశాలల్లో పని చేసే మహిళా అధ్యాపకులకు డ్యూటీలు వేయడానికి ఆమ్యామ్యాలు ఆశించినట్లు సమాచారం. బంద్‌ రోజు ప్రయోగ పరీక్షలు, ఎగ్జామినర్ల జాబితాలు ఇవ్వటానికి డబ్బులు ఆశించటం వంటివి వర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య కరుణ దృష్టికి తీసుకెళ్లగా నాలుగో విడత ప్రాక్టికల్‌ పరీక్షలు సోమ, మంగళవారం జరిగేలా షెడ్యూల్‌ ఉంది. ఈ పరీక్షలు ఆ రెండు రోజుల్లోనే కాదు.. అవసరమైతే మూడు, నాలుగు రోజులు జరుపుకోవటానికి వెసులుబాటు ఉంది. ఈ విషయాన్ని ఇప్పటికే కళాశాలలకు తెలియజేశాం. పరిస్థితులకు అనుగుణంగా వాళ్లు నిర్ణయం తీసుకోవాలి. ఎవరైనా బంద్‌ కారణంగా హాజరుకాలేకపోతే వారికి కచ్చితంగా తిరిగి పరీక్షలు పెడతాం. అలా ఇబ్బందులు పడిన వారుంటే వర్సిటీని సంప్రదించొచ్ఛు వారికి కళాశాలల నిర్వాహకులతో మాట్లాడి ఏదో ఒకరోజు పరీక్ష పెట్టడానికి చర్యలు తీసుకుంటా’మన్నారు. ‘డ్యూటీలు వేయటానికి, ఎగ్జామినర్ల జాబితాలు ఇవ్వటానికి, ఐడీకార్డులు ముద్రించడానికి డబ్బులు అడిగినట్లు నా దృష్టికి రాలేదు. ఇది సీఈ, పరీక్షల సమన్వయకర్తలకు తెలుస్తుంది. నిబంధనలకు విరుద్దంగా వసూళ్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, చర్యలు తీసుకుంటామని’ హెచ్చరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని