కట్లు.. కాన్పులకు కష్టమే!
eenadu telugu news
Published : 27/09/2021 03:15 IST

కట్లు.. కాన్పులకు కష్టమే!

పీహెచ్‌సీల్లో ‘నాడు-నేడు’ అసంపూర్తి

వైద్య సేవలకు తీవ్ర విఘాతం

 

ఈనాడు, అమరావతి

 


పెదపలకలూరు పీహెచ్‌సీలో వినియోగంలో లేని కాన్పుల గది

జిల్లాలో ప్రాథమిక వైద్య-ఆరోగ్య కేంద్రాల్లో తొలిదశలో చేపట్టిన ‘నాడు-నేడు’ పనుల నిర్వహణలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. నెలలు తరబడి పనులు సాగుతున్నాయి. పర్యవసానంగా ఆస్పత్రుల్లో వైద్యసేవలు లోపిస్తున్నాయి. అసలే కరోనా, డెంగీ జ్వరాల భయంతో ప్రజలు చాలా వరకు చిన్నా చితక వ్యాధులకు పీహెచ్‌సీలకే వెళ్లి చూపించుకుంటున్నారు. ఆయా ఆసుపత్రుల్లో జరుగుతున్న నాడు-నేడు పనుల వల్ల వీరికి సేవలు అందించటానికి వైద్యులు, సిబ్బందికి అసౌకర్యం, అంతరాయర ఏర్పడుతోంది. నిర్దేశిత వ్యవధిలో పనులు పూర్తి చేసి భవనాలను అప్పగించాల్సిన రహదారులు-భవనాల శాఖ ఈ పనులను పట్టించుకోవడం లేదనే విమర్శ ఉంది. ఈ శాఖ ఆధ్వర్యంలో అనేక పనులు జరుగుతున్నాయి. ఏరికోరి ఆసుపత్రుల్లో నాడు-నేడు పనులను దీనికే అప్పగించటం..వారికి అంతగా మానవ వనరులు లేకపోవడంతో పర్యవేక్షణ లోపించి పనులు సవ్యంగా సాగడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సుమారు ఏడాది క్రితం జిల్లాలో 40 పీహెచ్‌సీల్లో ఆధునికీకరణ పనులు ప్రారంభించారు. వీటిల్లో పనులు కొన్నింటిలో 80 శాతం కాగా, మరికొన్నింటిలో కనీసం సగం మేర పనులు పూర్తికాలేదు. తుది దశకు చేరుకున్న భవనాల పనులను పూర్తి చేయడానికి ప్రస్తుతం నిధుల సమస్య ఎదురవుతోంది. దీంతో అసౌకర్యాల మధ్యే వైద్య యంత్రాంగం వచ్చిన రోగులకు సేవలు అందించడం కనిపిస్తోంది.

మరుగుదొడ్లు లేక..

జిల్లాలో మేడికొండూరు, పెదకూరపాడు, 75 త్యాళ్లూరు, పెదకూరపాడు, నుదురుపాడు తదితర ఆసుపత్రుల్లో 80 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. మిగిలిన 20 శాతం పూర్తయితే ఈ భవనాల్లో పూర్తి స్థాయిలో వైద్యసేవలు అందించడానికి వీలుపడుతుంది.

మూత్ర పరీక్ష చేయించుకోవడానికి పెదపలకలూరు పీహెచ్‌సీలో మరుగుదొడ్లు లేవు. దీంతో రోగులను ఇంటికే పంపేస్తున్నారు. ఈ సమస్య ఇక్కడే కాదు.. మేడికొండూరు, నుదురుపాడు, 75 త్యాళ్లూరు తదితర చోట్లా ఉంది. నెలల తరబడి పనులు కొనసాగుతుండడంతో ఆసుపత్రుల్లో దుమ్ము, ధూళి వంటివి పేరుకుపోయాయి. దీంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఇక ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది సమస్యలైతే వర్ణనాతీతం. ఒకే గదిలో ఇద్దరు వైద్యులు కూర్చొని రోగులను చూస్తున్నారు. ఫార్మాసిస్టుకు కనీసం మందులు పెట్టుకోవడానికి గది లేకపోవటంతో ఆసుపత్రిలో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ అడ్డదిడ్డంగా పడేయటం ఆయా ఆసుపత్రుల్లో నెలకొన్న గదుల లేమిని తెలియజేస్తోంది. కొన్నిచోట్ల భవనాల పనులు పూర్తయినా ఇంటీరియర్‌ డెకరేషన్‌ పనులు కాలేదు. ప్రధానంగా విద్యుత్తు వైరింగ్‌ పనులు, ఫ్యాన్లు వంటివి బిగించలేదు. స్త్రీ, పురుషులను వేర్వేరుగా పరీక్షించేందుకు గదులు లేకపోవటంతో ఒకే గదిలో కర్టెన్‌ అడ్డుపెట్టి పరీక్షిస్తున్నారు.


వరండాలో అడ్డదిడ్డంగా పెట్టిన మందుల పెట్టెలు, సామగ్రి

గదుల లేమితో..

గాయాలపాలై వచ్చే రోగులకు శుభ్రం చేసి కట్టుకట్టాల్సి వస్తే బెడ్‌పై ఉంచటానికి కనీసం గది లేదు. దీంతో చాలా ఆసుపత్రుల్లో కట్లు కట్టడం లేదు. ఏదైనా చిన్న శస్త్రచికిత్స చేయాల్సి వచ్చినా దాని నిర్వహణకు గదులు లేక వాటిని వాయిదా వేయటం లేదా గుంటూరు జీజీహెచ్‌కు వెళ్లాలని సూచిస్తున్నారు. ఈ పనులకు ఎంపికైన కొన్ని ఆసుపత్రుల్లో కాన్పులు నిర్వహించేవారు. పనుల నిర్వహణ కారణంగా ప్రస్తుతం ప్రసవాలు చేయడం లేదని తెలిసింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే పనుల పూర్తికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరికొన్నింటికి పెద్ద మొత్తంలో నిధుల అవసరం ఉంది. వాటికి నిధులు సమకూర్చి సకాలంలో పూర్తి చేస్తే క్షేత్రస్థాయిలోనే రోగులకు ఆయా వ్యాధులకు వైద్యసేవలు అందుతాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని